9, డిసెంబర్ 2024, సోమవారం

10-36-గీతా మకరందము

 10-36-గీతా మకరందము

          విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ | 

జయోఽస్మి వ్యవసాయోఽస్మి 

సత్త్వం సత్త్వవతామహమ్ || 


తా:- వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను. మఱియు నేను తేజోవంతులయొక్క తేజస్సును (ప్రభావమును), (జయించువారలయొక్క) జయమును, (ప్రయత్నశీలురయొక్క) ప్రయత్నమును , (సాత్త్వికులయొక్క) సత్త్వగుణమును అయియున్నాను. 


వ్యాఖ్య:- ప్రపంచములోగల సమస్తపదార్థములందును, మంచివానియందుగాని, చెడ్డవానియందుగాని, భగవానుని అస్తిత్వము కలదు. వారి సాన్నిధ్యమే ప్రపంచములోని సమస్తపదార్థములకు, క్రియలకు శక్తిని ప్రసాదించుచున్నది. ఈ సత్యమును నిరూపించుటకు భగవాను డీ విభూతియోగమున కొందఱు దేవతలను, దానవులను, జంతువులను, జడపదార్థములను, కొన్ని క్రియలనుగూడ పేర్కొనెను. సంక్షేపించి చెప్పుటవలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పుకొనుచుపోయిరి. ఏ వస్తువును జూచినను, ఏ క్రియను పరికించినను అచ్చోట సాక్షాత్ భగవానునియొక్క అస్తిత్వమును భావనచేయవలెను. ఈ ఉద్దేశ్యముచేతనే జూదవిషయ మిచట ప్రస్తావింపబడినది కాని, దానిని ప్రోత్సహించవలెననిగాని, అనుసరించవలెననిగాని, అది ఉపాదేయమనిగాని అభిప్రాయము గాదు. ‘నేను మృగములలో సింహమును’ అని చెప్పినంతమాత్రమున సింహముతో ఆటలాడుకొనుమని అర్థముకాదుగదా! అట్లే ఈ జూదవిషయమున్ను - అని గ్రహించుకొనవలయును. 

      ‘వ్యవసాయము’ అనగా ప్రయత్నము తానని భగవానుడే పేర్కొనుటవలన మోక్షవిషయమున ప్రయత్నరహితులుగ, సోమరులుగనుండక సత్ప్రయత్నమాచరించుచుండుట శ్రేయస్కరమని తేలుచున్నది. ఎచట తేజము (ఉత్సాహము , ధైర్యము మున్నగునవి) ఉండునో, ఎచట దయయుండునో, ఎచట సత్ప్రయత్నముండునో, ఎచట సత్త్వగుణముండునో అచట తానుండునని భగవానుడు పలికిరి. కావున ఆ యా సద్గుణములను చక్కగ అలవఱచుకొనవలెను.

కామెంట్‌లు లేవు: