9, డిసెంబర్ 2024, సోమవారం

సాహచర్యమే మనిషి ఉన్నతికి

 శు భో ద యం🙏


సాహచర్యమే మనిషి ఉన్నతికి,  పతనానికి, కారణం .

                                                     తస్మాత్  జాగ్రత! 


                యెక్కడైనా  యెప్పుడైనా  యెవరితోనయినా సాహచర్యం  ( స్నేహం,- కలిసి యుండటం)  చేసేటప్పుడు 

బాగా ఆలోచించుకోవాలి. ముందుముందు  దానివల్ల కలిగే పరిణామాలు ,వాటి మంచిచెడ్డలు. ఆలోచించకుండా అడుగేస్తే,             

  అది ఊహింపలేని  యనర్ధాలకు దారితీయవచ్చు. అందునా ఆడవారి సాంగత్యం మనిషినెలా పతనం చేస్తుందో,  సారంగు 

  తమ్మయ్య  వైజయంతీ విలాసంలో (  విప్ర నారాయణ చరితము)  సూచించాడు. చిత్తగించండి మరి! 


      

          మ: ఆవిప్రోత్తము  వజ్రపంజర  నిభంబై  నిశ్చలంబైన  స 

                 ద్భావం బంగన  సాహచర్య  గుణసంపర్కంబునన్ 

                 గ్రావమై,లోహంబై, దృఢదారువై, తరుణ వృక్షంబై, ఫలప్రాయమై, 

                 పూవై,   తన్మకరందమై, కరగె, పోబోన్నీళ్ళకున్   పల్చనై;! 


                       విప్రనారాయణుని బ్హహ్మ చర్యమును చెరుప పంతము నూని దేవదాసి  దేవదేవి యతని యాశ్రమమున జేరినది. మొదలే పొమ్మన్న యాపద తప్పెడిది. కానీ దయాస్వభావియై యాస్వామి యామె కాశ్రయ మిచ్చినాడు. దినదిన మాటపాటలతో నామె యాతని హృదయమును వనితా సాంగత్యము వయిపు దిప్పినది. చివర కేమయినాడో చూడండి!! 


                     " వజ్ర పంజరమువంటి (పగులగొట్టలేనిది) యతని యుత్తమ హృదయము, వనితా సాంగత్యమువలన ,క్రమముగా  శిలగామారి, పిమ్మట లోహముగామారినది, అటుపిమ్మట గట్టి చెట్టుగా మారి, యాపై లేత మొక్కయైనదట,, తదుపరి ఫలప్రాయముగామారినదట, ఆపిమ్మట పూవైనదట. ఆపై మకరంద మైనదట. చివరకు  నీళ్ళకన్నా పలచనగా మారిపోయింది. 

                           

                          వజ్రం, రాయి ,చేవదీరినకర్ర, చిరుతరువు, ఫలము, పూవు,,, మకరందము, నీరు, ఇలా వివిధ దశలలో తగ్గుతూ చివరకు నీళ్ళ కన్నా పలచ బడినాడు. అంటున్నాడు కవి. 

         

                              ఇది మనకు మంచి సందేశం కదూ!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: