9, డిసెంబర్ 2024, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*220 వ రోజు*

*సభలో సంజయుని సంధి ప్రస్తావన*


మరునాడు ధృతరాష్ట్రుడు సభ తీర్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సోమదత్తుడు, శల్యుడు, దుర్యోధనాదులు సభా ప్రాంగణంలో వున్నారు. సంజయుడు సభను ఉద్దేశించి దృతరాష్ట్రునితో " రాజా! మీరు ఆదేశించినట్లు ఉపప్లావ్యం వెళ్ళి ధర్మరాజును చూసాను ధర్మరాజు పేరు పేరున మిమ్మలి యోగక్షేమాలు అడిగాడు. నేను వివరించాను. అలాగే కృష్ణార్జునులను కలిసాను. శ్రీకృష్ణుడు నాతో ఇలా అన్నాడు " సంజయా! అజాత శత్రువైన ధర్మరాజుకు కోపం వస్తే నీటిలో నిప్పు పుట్టిన చందాన ఉంటుంది. దానిని ఆర్పడం ఎవరి తరం కాదు. యుద్ధం అనివార్యం అయితే మీరు మీ సమస్త సంపదలు యోగ్యులకు పంచి బంధు మిత్రులతో భోగములను అనుభవించి యుద్ధ భూమికి రండి. నాడు సభలో ద్రౌపది గోవిందా రక్షించు అని నన్ను వేడుకున్నది ఇంకా చెవిలో వినిపిస్తుంది. తీర్చలేని ఆ అప్పు తీర్చకనే నేను సారథ్యం వహిస్తున్నను. అర్జునుని గాండీవానికి కౌరవ సేన దగ్ధం కాక తప్పదు " అన్నాడు. అప్పుడు అర్జునుడు " సంజయా! ధర్మరాజు అడిగినట్లు రాజ్య భాగం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు భీముడు నేను దుర్యోధనుని అకృత్యాలకు బదులు చెప్పక వదలము. దుర్యోధనుని యుద్ధ భూమిలో అంపశయ్య మీద పరుండ చేయకుంటే ధర్మరాజు భూశయనం చేసిన దానికి అర్ధము లేదు. భీముడు గద తీసుకుని యుద్ధ భూమిలో వీర విహారం చేస్తుంటే దుర్యోధనుడు రాజ్యం ఇవ్వక ఏమి చేస్తాడు. కౌరవులు మాటలతో సంధి చేయరు. కేవలం యుద్ధము తోనే మాట వింటారు. నకుల సహదేవులు, అభిమన్యుడు, సాత్యకి యుద్ధ భూమిలో వీర విహారం చేస్తున్నప్పుడు సుయోధనుడు సంధి చేస్తాడులే. శిఖండి శత్రురధికులను ఏరిఏరి చంపుతూ, చితకగొట్టుతూ భీష్ముని మీదకు ఉరికి యుద్ధ భూమిలో పడగోట్టినప్పుడు సుయోధనుడు యుద్ధాన్ని గురించి పశ్చాత్తాప బడతాడులే. దృష్టద్యుమ్నుడు ద్రోణుని మీదికి యుద్ధానికి దిగినప్పుడైనా సంధి చేయక తప్పుతుందా? సంజయా! పట్టుకోకుండానే గాండీవం గంతులేస్తోంది. మీట కుండానే నారి కంపిస్తోంది. నా అమ్ముల పొందిలోంచి బాణాలు మాటిమాటికి పైకి ఎగిరెగిరి దూకుతున్నాయి. యుద్ధంలో నేను వింటి నారి లాగి పిడుగుల వంటి బాణాలను గాండీవానికి సంధించి శత్రువుల శిరస్సులను ఛేదిస్తూ వుంటే దుర్యోధనుడి సేన చెల్లా చెదరుగా పారిపోతూ వుంటే దుర్యోధనుడు యుద్ధం గురుంచి పరితపిస్తాడులే. . ఇంద్రాది దేవతలు కూడా ఎవరిని జయించ లేరో వారిని జయించ గలనని మోహపడుతున్నాడు. కంస, నరక, మురులను సంహరించిన మహాత్ముడైన శ్రీకృష్ణుని కూడా దుర్యోధనుడు లక్ష్య పెట్టక అతడిని కూడా తను జయిస్తానను కుంటున్నాడు.. మేము భీష్మ, ద్రోణ, కృప అశ్వధామలతో నమస్కరించి రాజ్యం కోరి యుద్ధం చేస్తాము. మా రాజ్యాన్ని అధర్మంగా అపహరించి, నియమభంగం చేసి, తిరిగి మా రాజ్యాన్ని మాకు ఇవ్వని కౌరవులను సంహరించి మా రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం గెలిచినట్లే కాని ఇందు అధర్మం ఏమీ లేదు. యుద్ధం జరిగిందా ఇక ధార్తరాష్ట్రు లేనట్లే. ఇలా నిండు సభలో ధ్రుతరాష్ట్రునికి నా మాటగా చెప్పు. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వథామ, శల్యులు నిర్ణయించినది జరుగుతుంది. యుద్ధాన్ని నివారిస్తే సుయోధనుడు ఆయుష్మంతు డౌతాడు " అని చెప్పారని చెప్పాడు.

.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: