శ్రీ దత్త ప్రసాదం -3- శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు
శ్రీ స్వామివారు మొగలిచెర్ల సమీపం లోని ఫకీరు మాన్యం భూమిని తన ఆశ్రమం కోసం ఎంపిక చేసుకోవటం..అందుకు శ్రీధరరావు, నిర్మలప్రభావతి గార్లు సంతోషంగా సమ్మతి తెలపడం..ఆ భూమిని శ్రీ స్వామివారి పేరిట రిజిస్ట్రేషన్ చేయటం చక చకా జరిగిపోయాయి..ఇక ఆశ్రమ నిర్మాణం జరగాలి..
"శ్రీధరరావు గారూ..మీరు గృహస్థులు..మీకూ బాధ్యతలున్నాయి..ఆశ్రమనిర్మాణానికి మీమీద భారం పడదు.. అందుకు వేరేవాళ్ళు వస్తారు.." అని శ్రీ స్వామివారు చెప్పారు..
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొట్టిగుండాల గ్రామ వాస్తవ్యులు శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు ఆ బాధ్యత నెత్తిమీద తీసుకున్నారు..శ్రీ స్వామివారి మీద అచంచల విశ్వాసం మీరాశెట్టి దంపతుల స్వంతం..తమ గ్రామం నుంచి నడుచుకుంటూ ఆశ్రమ నిర్మాణ స్థలానికి వచ్చేవారు..మీరాశెట్టి గారికి సంతానం లేదు..శ్రీ స్వామివారు ఆ విషయంలో చాలా స్పష్టంగా "మీరాశెట్టీ మీకు సంతాన యోగం లేదు..నాకు ఆశ్రమం కట్టిస్తే మీకు పిల్లలు పడతారని అపోహ పడొద్దు.." అని ముందుగానే చెప్పారు..మీరాశెట్టి గారు కూడా తాను ఆశ్రమాన్ని నిర్మించి ఇవ్వదల్చుకొన్నాననీ..మరేవిధమైన కోరికా లేదని తేల్చి చెప్పేసారు..
ఆశ్రమం నిర్మాణం పూర్తయిన తరువాత కూడా..మీరా శెట్టి దంపతులు శ్రీ స్వామివారి దర్శనార్ధం తరచూ వచ్చేవారు..ఒక్కొక్కసారి తమతో పాటు కొంతమంది వ్యక్తుల ను కూడా తీసుకొచ్చేవారు..అలా వచ్చినవారి ప్రాప్తాన్ని బట్టి శ్రీ స్వామివారి దర్శనం జరిగేది..శ్రీ స్వామివారు తనకు నచ్చినప్పుడే మనసు విప్పి మాట్లాడేవారు..అందుకు ఒక నిర్దిష్ట సమయమంటూ లేదు..తన దగ్గరకు ఎవరు ఏ కోరికతో వస్తున్నారో ముందుగానే శ్రీ స్వామివారికి ముందుగానే తెలుసు..అందుకు తగ్గట్టు గానే మాట్లాడేవారు..ఈ విషయం లో శ్రీధరరావు దంపతులకు(మా తల్లిదండ్రులు) మీరాశెట్టి దంపతులకు చాలా అనుభవాలు కలిగాయి..
శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా మీరాశెట్టి గారు ఆశ్రమానికి వస్తూ వుండేవారు..వారి ప్రోద్బలం, కృషి తోనే..శ్రీ చెక్కా కేశవులు గారు, శ్రీ మెంటా మస్తానరావు గారు, శ్రీ గోనుగుంట పెద్దిశెట్టి గారు..అందరూ కలిసి..శ్రీ స్వామివారి మందిర వెనుకవైపు స్థలంలో..మందిరానికి అతి సమీపంలో "ఆర్యవైశ్య అన్నదాన సత్రాన్ని" కట్టించారు..ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి, మహాశివరాత్రి పర్వదినానికి.. ఆర్యవైశ్య అన్నదాన సత్రం తరఫున అందరికీ అన్నదానం చేసేవారు..ప్రస్తుతం వారెవ్వరూ జీవించి లేకపోయినా..వారిచ్చిన స్ఫూర్తి తో ఆ సత్రం తరఫున యధావిధిగా సేవలు జరుగుతున్నాయి..శ్రీ స్వామివారిని దర్శించడానికి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నారు..
మీరాశెట్టి గారు జీవించి ఉన్నంత కాలమూ..తనకు తెలిసిన వాళ్ళెవరికి ఏ సమస్య వచ్చినా..వారి సమస్య పరిష్కారం కోసం శ్రీ స్వామివారి సమాధిని దర్శించి, మ్రొక్కుకోమని చెప్పేవారు..అలా ఎంతోమంది స్వాంతన పొందేవారు..మీరాశెట్టి గారికి సంతానం లేకపోయినా..సంతానం లేని వారికి మాత్రం..శ్రీ స్వామివారి సమాధి వద్ద మ్రొక్కుకుంటే చాలు సంతానం కలుగుతుందని గట్టిగా చెప్పేవారు..చిత్రంగా ఆయన నమ్మకం ఏనాడూ వమ్ము కాలేదు..అలా సంతానం పొందిన వారి వద్ద ముందుగానే శ్రీ స్వామివారి మందిర అభివృద్ధికి సహాయం చేయాలని ఒప్పించేవారు..అలా మీరాశెట్టి గారి ద్వారా శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించి, సంతానం పొందిన అనేక మంది భక్తులలో..వింజమూరు గ్రామానికి చెందిన కామేశ్వర రావు గారొకరు..శ్రీ కామేశ్వర రావు గారు మీరాశెట్టి గారికి దగ్గర బంధువు కూడా..మీరాశెట్టి గారిని "పెదనాయనా" అని పిలిచేవారు..
ఆ కామేశ్వర రావు గారు ఈమధ్య తన కూతురి వివాహం కుదిరందనీ..ఆ వివాహానికి మందిరం లో ఉన్న మమ్మల్ని అందరినీ రమ్మని పిలువడానికి వచ్చినప్పుడు, తనకు సంతానం కలగడానికి శ్రీ స్వామివారి ఆశీర్వాదమే కారణమని..అందుకు శ్రీ మీరాశెట్టి గారి ప్రోద్బలమే కారణమని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..
మీరాశెట్టి గారి సలహాతో శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించి తరించిన భక్తుల అనుభవాలను..మీరాశెట్టి గారి ద్వారా స్వయంగా నేను విన్నవీ..భక్తుల ద్వారా సేకరించినవీ..కొన్నింటిని..రేపటి నుంచి కొంతకాలం పాటు ఈ సోషల్ మీడియా వేదికగా చదువుకుందాము..
సర్వం..
శ్రీ దత్తకృప!
రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్
(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
----
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ
-----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :
Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి