వాళ్ళిద్దరికీ పెళ్ళయి అరవై ఏళ్ళయింది.
పెళ్లి రోజుని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ పొద్దున్నే లేచారు. తలంటుకున్నారు.
పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్ద మందారం తురుముకుందామె.
" ఈ మధ్యనే" అయిదారేళ్ళ క్రితం కొన్న అత్తరుని రాసుకున్నాడతను.
కధ లోకి వస్తే.. మందారం తురుముకున్న ఆమె, అత్తరు రాసుకున్న అతను కలిసి గుడికి వెళ్ళారు. దేమునికి దండం పెట్టుకున్నారు. మరో పద్ధెనిమిది పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడతను. అప్పటికి అతనికి నూరేళ్ళు వస్తాయి. ఆమె మరో ఇరవైరెండు పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. అప్పటికి ఆమెకి నూరేళ్ళు వస్తాయి.
ఇద్దరూ నిండునూరేళ్ళు బతకాలని కోరుకున్నారు.
దేమునికి కొట్టిన కొబ్బరికాయని ప్రసాదముగా అతని చేతిలో పెడదామని ఇలా నేలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది.
అయ్యయ్యో అనుకుని ఆందోళనతో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసాడతను. ఇంక
బతికి ఉన్న నాలుగు రోజులూ హాయిగా బతకనీయండి. ఇంటికి తీసుకుపొమ్మని డాక్టర్ అంటే .. ఇంటికి తీసుకువచ్చాడు. వీలయిన మేరకు ఆమెకు సపర్యలు చేయసాగాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని ఆనందించాడు. గర్వపడ్డాడు. నిజంగా కూడా అంతే.
పెళ్లి అయిన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచిపెట్టలేదు. అన్నీ అతనితో పంచుకునే బతికింది. ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది. అది ట్రంకు పెట్టె. అటక మీద వుంది. దాని విషయం అడగకండి! అందులో ఏమున్నదీ చూడకండి అని ఆమె ఆంక్ష విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవనూ లేదు, అందులో ఏమున్నదీ చూడనూ లేదు. చూడాలని చాలా సార్లు అనుకున్నా ఆ కోరికని అణచుకున్నాడు. ఇక ఇప్పుడు తప్పదు. చూడాల్సిందే.. అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడామెకి. అవునవును చూడండి.... అందామె.
అటక మీద నుంచి ఆ పెట్టెని దించి జాగ్రత్తగా తెరిచి చూసాడు. ఏమున్నాయి అందులో?
రెండు ఊలు స్వెట్టర్ లు వున్నాయి. అంతేనా?
ఓ మూడులక్షల రూపాయలు కూడా వున్నాయి. పెద్ద మొత్తమే!
ఈ స్వెట్టర్ లు ఏంటి? అని అడిగాడు. దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగిందామె. పెళ్ళయి మీతో పాటుగా నేనిక్కడికి బయలుదేరి వస్తునపుడు మా నాయనమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది. ఏంటో అది? ఆత్రపడ్డాడతను.
భర్తతో ఎన్నడూ పోట్లాడకు. ఒకవేళ అతని మాటలకీ, చేష్టలుకీ పోట్లాడాలన్నంత కోపం వస్తే, ఎంచక్కా స్వెట్టర్లు అల్లుతూ కూర్చో.. కోపం దానంతట అదే పోతుంది అని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్లూ చేసాను అన్నదామె.
ఆ మాటలకి అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. చేతిలోని రెండు స్వెట్టర్ లనూ ప్రేమగా గుండెకు హత్తుకున్నాడు.
అరవైసంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకున్నది రెండంటే రెండే సార్లన్నమాట! చాలు! ఐయామ్ గ్రేట్ అనుకున్నాడతను.
మరి ఈ మూడులక్షలు? ఇంత డబ్బు ఎక్కడది? అని అడిగాడు.
అదీ.. అదీ.. ఈ అరవైఏళ్ళలో నేను స్వెట్టర్లు అమ్మగా వచ్చిన డబ్బు అది అన్నదామె.
*అతను కళ్ళు తేలేసాడు.😜😜😄😄🤣🤣
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి