25, మార్చి 2025, మంగళవారం

యోగ్యత

 యోగ్యత!


ద్రోణుడు విచక్షణాజ్ఞానం కలవాడు. వివేకవంతుడు. ఆయనకు కొడుకుపై ఎంతటి మమకారమంటే- అశ్వత్థామ మరణించాడన్న గాలివార్త చెవిలో పడగానే ప్రాణాలు విడిచిపెట్టేసేటంత! అంతటి ప్రేమానురాగాలుండీ, అస్త్రవిద్యా బోధనలో ఆ ఆచార్యుడు గొప్ప ఔచిత్యాన్ని పాటించాడు. శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించినన్ని కిటుకులు-సొంత కొడుక్కి నేర్పించనేలేదు. ఆ విచక్షణకు మూలం- అర్జునుడిది సంయమనం... అశ్వత్థామది తెంపరితనం! తాను ఉపదేశిస్తున్న అస్త్రాలు దుర్వినియోగం అయితే భూమ్మీద భయంకర పరిణామాలు ఏర్పడతాయని ద్రోణుడికి బాగా తెలుసు. కాబట్టే వాటిని ఉపదేశించే విషయంలో ఆయన అర్హతకు పెద్దపీట వేశాడు.


అశ్వత్థామ స్వభావం ఎలాంటిదో సౌప్తిక పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకసారి అశ్వత్థామ ద్వారక వెళ్లాడు. గురుపుత్రుడన్న గౌరవంతో కృష్ణుడు సాదరంగా ఆహ్వా నించాడు. యాదవ ప్రముఖులు మర్యా దలు చేశారు. అందరి అభిమానాన్ని ఆస్వాదించిన అశ్వత్థామ ఉన్నట్టుండి-'కృష్ణా! నీ సుదర్శన చక్రాన్ని నాకు ఇచ్చే యరాదా!' అని అడిగాడు. అనుచితమైన ఆ కోరిక యాదవులనే కాదు, శ్రీకృష్ణుణ్ని సైతం విస్మయానికి గురిచేసింది. 'మా అన్న బలరాముడుగాని, కుమారుడు ప్రద్యుమ్నుడుగాని, చివరకు నా ఆప్తమి త్రుడు అర్జునుడు సైతం ఏనాడూ ఆశించ నిదాన్ని నువ్వు కోరావు. అయినా సరే, అడిగావు కాబట్టి ఇచ్చేస్తాను తీసుకో' అన్నాడు కృష్ణుడు. 'నిజం చెప్పు... దాన్ని ఎవరిమీద ప్రయోగించాలనుకొంటున్నావు' అని ప్రశ్నించాడు. అశ్వత్థామ వెంటనే జంకుగొంకు లేకుండా 'నీ మీదనే' అని బదులిచ్చాడు. అదీ... అశ్వత్థామ అసలు నైజం! ఇంతకూ ఆ చక్రాన్ని ధరించడం కాదు కదా, చేతులతో ఎత్తనేలేకపోయాడు. సిగ్గుతో తలదించుకొని వెళ్లిపోయాడు.

బ్రహ్మశిరోనామకాస్త్రం విషయంలోనూ అశ్వత్థామ తండ్రిని పరిపరివిధాల వేధిం చాడు. ఆ హింసను భరించలేక చివరకు ద్రోణుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూనే, దాన్ని కొడుక్కి ఉపదేశించాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి చేతికి చిక్కిన ఆ భీకర అస్త్రం ఎంతటి ప్రమాదానికి కారణమైందో మహాభారతం వివరించింది. కురు క్షేత్ర సంగ్రామంలో కౌరవ వీరులందరూ మరణించాక, కృపాచార్యుడు ఎంతగా వారిం చినా వినకుండా, బహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ మంత్రించి విడిచాడు. దాని తీవ్ర తకు లోకం కంపించిపోయింది. ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించడానికి తగిన తపోబలం అతడికి లేదు. చివరికి వ్యాస నారద మహర్షులు, శ్రీకృష్ణ పరమాత్మ తమ తమ అమోఘ శక్తి సామర్థ్యాలతో లోకాన్ని ఆ మహా విపత్తునుంచి కాపాడారు.


ఈ కాలంలోని శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వినూత్న ఆవిష్కరణలు, విలువైన సిరిసంపదలు, విశేష పాలనాధికారాల వంటి వాటిని సైతం- పదునైన ఆయుధాలుగానే మనం పరిగణించాలి. అవి యోగ్యులైనవారి చేతుల్లో పడిన ప్పుడే సద్వినియోగం అవుతాయని గుర్తించాలి.


ఎర్రాప్రగడ రామకృష్ణ

కామెంట్‌లు లేవు: