25, మార్చి 2025, మంగళవారం

అత్త మామలను

 *అత్త మామలను కూడా తప్పించుకోలేరు..!*


కోడలైనా  లేక అల్లుడైనా 

పుత్రులు లేని పెద్దల కర్మ కాండ - ఆడ బిడ్డ, అల్లుడి విధి


పితృదేవతారాధనా రహస్యాలు-

మా మామగారి ఆబ్దికం వస్తోంది. 

ఆయనకు మగపిల్లలు లేరు. 

అత్తమామల కోసం మేము ఏం చేయాలి?‘‘


ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. 

కుటుంబనియంత్రణ కారణంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే అనుకోవడం వల్ల 

ఈ సమస్య వస్తోంది. 

అయితే ఇది నేడు క్రొత్తగా వచ్చింది కాదు. 

పూర్వం కూడా కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉండే వారు. వారిని అభ్రాతృకా (సోదరుడు లేనిది) అనేవారు. 

ఆమెను వివాహం చేసుకొనేవారు కాదు. 


దీనికి అనేక కారణాలు ఉండేవి. 

ప్రధాన కారణం మాత్రం అత్తమామల తిథుల సమస్య. 

అంతేకాక అన్నో తమ్ముడో ఉంటే వారితో కలసి పెరిగిన అమ్మాయికీ, 

సోదరులు లేకుండా పెరిగిన యువతికీ తేడా ఉంటుందని కొందరి భావన. 

ఇవి అలా ఉంచితే నేడు ఒక వికృత ప్రవృత్తి తయారైంది. తన కూతురుని ఇచ్చేటప్పుడు ఆడపడుచులు లేని సంబంధాలు కావాలని వెదకి మరీ చేసుకుంటున్నారు. ఫలితంగా వీరే తమ కుమారుడికి సంబంధం వెతకడానికి నానా అగచాట్లూ పడుతున్నారు. 

మరికొందరు  బావమరుదులు లేని ఆస్తిపరుల సంబంధాలు వెదకి మరీ చేసుకుంటున్నారు.


నేడు సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు ప్రధాన కారణం సనాతన ధర్మాన్ని మరచి పోవడమే. 

ఆస్తికోసం ఆశపడిన అభ్రాతృకను పెళ్ళాడిన వారిది 

ఒక సమస్య అయితే, 

ఆస్తి లేకుండా అభ్రాతృకను పెళ్ళాడినవారిది మరొక సమస్య. 

అయితే ఇద్దరూ పెద్దలను అర్చించడం మాత్రం మానివేశారు. 


దీని వల్ల భయంకరమైన పితృదోషాలు ఆ కుటుంబాలకు చుట్టుకుంటున్నాయి. 

పిల్లనిచ్చిన అత్తమామలు తిలోదకాలు లేకుండా అలమటించడం వల్ల ఆ కుటుంబాలకు ఈ విధమైన దోషాలు తగులుతున్నాయి. 

పోనీ వారికి పిండప్రదానాలు చేద్దామా అంటే ..

ఆస్తి తీసుకున్నాడు కదా? 

చేయకుండా ఉంటాడా? 

ఎవరికోసం చేస్తాడు?‘‘ 

అనే ఈసడింపులు వారిని అవమానిస్తున్నాయి. 

ఆస్తి తీసుకోని వారిని ..ఏమిచ్చాడని మీ మామకు చెయ్యాలి?‘‘ అని ప్రశ్నించేవారు మరికొందరు.


వీరందరికీ తెలియని రహస్యాలు హిందూధర్మంలో ఉన్నాయి.


వివాహం చేసే కన్యాదానంలో అమ్మాయిని కేవలం ధర్మఅర్థకామాల్లో సహచరిగా ఇస్తూ ఈ మూడింటిలో ఆమెను అత్రిక్రమించను అని మాట ఇచ్చిన తరువాతే పెళ్ళి జరుగుతుంది. 

మోక్షం కోసం భార్యను విడిచి సన్యాసం స్వీకరించవచ్చు. 

సన్యాసానికి భార్య అనుమతి అవసరంలేదు. 

తండ్రి అనుమతి అవసరం లేదు. 

కానీ తల్లి అనుమతి మాత్రం తప్పని సరిగా ఉండాలి. 

ఇది మొదటి రహస్యం.


కన్యాదానంలో అమ్మాయిని పూర్తిగా ధారాదత్తం చేయరు. ‘‘ఇదం తుభ్యం‘‘ అని మాత్రమే అంటారు. 

మిగిలిన అన్ని దానాల్లో ‘‘ఇది నీకు ఇస్తున్నాను. 

ఇక ఇది నాది కాదు‘‘ అని అంటారు. 

కానీ కన్యాదానంలో ఇది నీకు ఇస్తున్నాను అనిమాత్రమే అంటారు. 

న మమా (నాది కాదు) అని అనరు. 


అంటే కన్యను దానం ఇచ్చినా ఆమె మీద అధికారం పుట్టింటి వారికి ఉంటుంది. 


ఆ అధికారం ఎంత వరకూ ఉంటుంది అంటే ఆమెకు పుట్టే సంతానం మీద మొదటి హక్కు మామగారికి ఉంటుంది. 


అంటే కుమార్తెకు పుట్టే మగసంతానం మామగారి హక్కు. కుమార్తెకు పుట్టే మగపిల్లలను దౌహిత్రుడు అంటారు. మగసంతానం లేదు కనుక ఈ దౌహిత్రుడు పుట్టింటి వారి హక్కు అవుతాడు. 

అతడిని దత్తత తీసుకునే హక్కు వారికి ఉంటుంది. అంతేకాక, మగపిల్లలు లేని అత్తమామలకు సంస్కారాలు చేసే బాధ్యత ఈ దౌహిత్రులకు ఉంటుంది. 

వారు పిండప్రదానాలు చేసి తీరాలి. 

అల్లుడు చేయడం చేయకపోవడం అతని ఇష్టం. 

కానీ శాస్త్రం ప్రకారం అల్లుడికి కూడా ఈ బాధ్యత తప్పించుకోలేనిది.

 దీన్నే ఈ విధంగా శాస్త్రంలో చెప్పారు.


త్రీణి శ్రాద్ధే పవిత్రాణి  దౌహిత్రః కుతపస్తిలాః  |

రజతస్య తథా దానం కథాసంకీర్తనాదికమ్  |  |


పితృయజ్ఞాలలో కుమార్తెకు పుట్టిన కుమారుడు, 

నువ్వులు, మధ్యాహ్న కాలాలు మహాప్రీతిపాత్రమైనవి అని  విష్ణుపురాణం చెబుతోంది.

కనుక దౌహిత్రుడుకు అల్లుడి కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది.


ఇవన్నీ ఇలా ఉంచి మా అత్తమామల తిథుల వరకూ 

వెళ్ళే ముందు వారికర్మలు ఎవరు చేశారు అనేది ప్రధానమైన ప్రశ్న. 

అప్పుడు ఎవరు కర్తృత్వంవహించారు అనేది ప్రధాన ప్రశ్న. 

కర్తృత్వం వహించి వారికి క్రియలు చేసినవారే ఉత్తర క్రియలు కూడా చేయడం సాధారణ మర్యాద. 

అయితే ఇక్కడ ఒక విచిత్రమైన అంశం గమనించాలి.


ఒక గృహిణి ఆరునెలల గర్భవతిగా ఉండగా 

ఆమె భర్త మరణించాడు. 

ఆ భర్తకు క్రియలు చేయడానికి ఆమె గర్భంలో ఉన్న పిండం మీద కర్తృత్వం వేసి కర్మకాండను బ్రాహ్మణుని నియోగించి జరిపించారు. 

అయితే ప్రసవానంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టింది. 

ఈ విధంగా కడుపులోనే ఆమె కర్తృత్వం వహించింది కనుక ఆమెను చేసుకున్న అల్లుడు వారికి పిండప్రదానాలు చేసే బాధ్యత వస్తుంది. 

పెళ్ళి అయ్యే వరకూ ఆమె ఆ తిథులను తాను కర్తగా ఉండి బ్రాహ్మణులను నియోగించి చేయించాల్సి ఉంటుంది.


ఇవన్నీ పితృయజ్ఞాల్లోని సూక్ష్మాలు.  

సామాజిక మాధ్యమాల చర్చలకు చాలా భారమైనవే అయినా కొందరు అడిగిన మీదట చెబుతున్నాము. అంతేకాక, నేడు నెలకొన్న అభ్రాతృక సమస్యల వలన 

ఇది చాలా అతిముఖ్య సమాచారం.


అన్నిటికీ మించి అత్తమామల తిథులు నిర్వహించడం కూడా అదృష్టంగా భావించాలి. 

వారిని ఆరాధించడం కనీస బాధ్యత మాత్రమే కాదు. 

వారి అపార కరుణ పొందడానికి చాలా ముఖ్యమైన మార్గం. 

దేవపూజలు కన్నా పితృదేవతల అర్చన చేయడం మహాఫలాలను ఇస్తుంది.


ఈ విధంగా పిండప్రదానాలు లేని అమ్ముమ్మతాతలను (అత్తమామలను) అర్చించడం దౌహితృలకు (అల్లునికి) సకలసంపదలూ ఇస్తుంది. 

వారు తిలోదకాలు లేకుండా ఈసురోమంటూ ఉంటే 

వీరి వంశం ఏమాత్రం ముందుకు వెళుతుందో 

ఒకసారి ఆలోచించడం మంచిది.


మరొక ప్రశ్న కూడా పరిశీలించండి.

మా అత్తగారికీ నాకు పడదు. 

చనిపోయేటప్పుడు కూడా నా నీడ పడడానికి కూడా 

ఆమె ఇష్టపడలేదు. 

మేము ఆమె తిథులు పెట్టాలా?‘‘ 


ఇది చాలా ముఖ్యమైన మరో ప్రశ్న. 

నేటి అస్తవ్యస్త కుటుంబవ్యవస్థలో సఖ్యత ఉన్న అత్తాకోడళ్ళ సంఖ్య సంతృప్తిగా లేదు. 

కొన్ని సందర్భాలలో ఇది సంపూర్తిగా ప్రతిలోమంగా ఉంది. కనుక ఇటువంటి అనుమానం వస్తోంది. 

దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొంచెం లోతుగా వెళ్ళాలి. 


ఆడపిల్ల వివాహం అయిన తరువాత అత్తారింట్లో 

అతి ముఖ్యమైన స్థానం పొందుతుంది. 

అదే వర్గత్రయంలో స్థానం. 

అంటే తాను, తన అత్తగారు, తన అత్తగారి అత్తగారు అనే పరంపరలో స్థానం పొందడం. 

ఇది మన ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉండదు. 

ఇష్టం ఉన్నా లేకున్నా ఆమెకు ముందుగా తిలోదకాలు ఇవ్వకుంటే తనకు చెందవని గమనించాలి. 

అందరూ ఉండి అనాథప్రేతంగా అలమటించాల్సి వస్తుంది.


ఇదిలా ఉండగా మరొకటి తెలుసుకోవాలి.

బ్రతికి ఉన్నప్పటి రాగద్వేషాలు మృతులకు అంటగట్టాల్సిన అవసరం లేదు. 

ఎందుకంటే వారు పితృదేవతలు అవుతారని గమనించాలి. 

సామాన్యంగా ఉన్న మానవుల రాగద్వేషాలకు వారు అతీతులు. 

శరీరంతో వచ్చిన కోపతాపాలు శరీరంతోనే పోతాయి. అన్నింటికీ మించి మానవులకు అనేక శరీరాలు ఉంటాయి. అవి భౌతిక శరీరం అనే మనకు కనిపించే శరీరాలు. 

ఈ శరీరం అగ్నికి ప్రీతిపాత్రం అవుతుంది.  

కారణశరీరం అనేది మరొకటి వాసనల రూపంలో ఉంటుంది.  

ఇదే జనన మరణాలకు ప్రారబ్ధాలకు కారణం. 

మరొకటి యాతనా శరీరం. 

ఈ యాతనా శరీరమే స్వర్గనరకాలకు పోయి యాతనలు పడుతుంది. 

ఈ విధంగా శరీరాలు విభజన పొంది పవిత్రమైన దేవతలుగా పితరులు మిగులుతారు. 

వారినే మనం అర్చించేది. 

ఇది అందరూ తెలుసుకోవాలి. 


కనుక దేహంలో పొందిన రాగద్వేషాలు దేహంతోనే పోతాయి. 

వాటిని తెలియనితనంతో కొనసాగించి అత్తను అశ్రద్ధ చేయడం వలన పితృదోషాలు కలుగుతాయి. 

సంతానం వృద్ధిలోకి రాదు. 

పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ధననష్టాలు సంభవించడం వంటివి కలుగుతాయి. 

అత్తకు పిండప్రదానాలు చేయించడం వలన ఇహమే కాక పరంలో కూడా ఫలం ఉంటుంది. 

ఆమెను తృణీకరిస్తే ఆమె తరువాత స్థానం పొందాల్సిన కోడలికి వర్గత్రయంలో స్థానం దక్కదు. 

అంతేకాక బ్రతికి ఉన్నంత కాలంకూడా కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


పై ప్రశ్నలు రెండూ అతి ముఖ్యమైనవి. 

అనేక కారణాల వలన పితృయజ్ఞాలు మానివేస్తున్నారు. వీటిని మాని వేయడం వలన నానా బాధలూ పడుతున్నారు. 

ఇన్నాళ్ళూ చేసిన తప్పులు సరిచేసుకోవడం అత్యంత తేలిక.

కామెంట్‌లు లేవు: