🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఈ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులను మయూరీ మయూరములుగా నిరూపించి శంకరులు ప్రార్థించారు.*
*శ్లోకము - 54*
*సంధ్యా ఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానక*
*ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్ఠిచ్ఛటా చంచలా*
*భక్తానాం పరితోష బాష్ప వితతిః వృష్టిర్మయూరీ శివా*
*యస్మి న్నుజ్జ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే !!*
*పదవిభాగం :~*
*సంధ్యా = సాయంకాలము*
*ఘర్మ దినాత్యయః = వర్షారంభకాలముగను*
*హరికరాఘాత = విష్ణువు యొక్క హస్తముల వాయింపు చేత*
*ప్రభూత ఆనక ధ్వానః = పుట్టిన మద్దెల యొక్క ధ్వని*
*వారిద గర్జితం = ఉరుముగను*
*దివిషదాం దృష్టిచ్ఛటా = దేవతల యొక్క చూపులో పరంపర*
*చంచలా = మెరుపుగను*
*భక్తానాం పరితోష బాష్ప వితతిః = భక్తుల యొక్క ఆనందాశ్రుధార*
*వృష్టిః = వర్షముగను*
*మయూరీ = ఆడనెమలిఖను*
*శివా = పార్వతీదేవి*
*యస్మిన్ = ఏ నీలకంఠుడను నెమలియందు*
*ఉజ్జ్వల = ప్రకాశమానమైన*
*తాండవం విజయతే = తాండవమను నృత్యము సర్వోత్కృష్టముగా ఉన్నదో*
*తం నీలకంఠం భజే = ఆ శివుని కొలచుచున్నాను.*
*తాత్పర్యము :~*
*మహేశ్వరా ! సంధ్యాకాలమే, వర్షారంభ సమయము. విష్ణువు సంతోషంతో వాయించే మద్దెల నాదమే, ఉరుములు. దేవతలందరూ ఆనందంతో ఆశ్చర్యంతో ఆటూ ఇటూ తిప్పుకుంటూ చూసే చూపులే మెరుపులు. భక్తులు ఆనందంతో వెలువరించే బాష్పాంబువులే, వర్షం. అమ్మవారు మయూరి, ఈ పరిస్థితులలో ఆనంద తాండవం చేసే నెమలి వంటి శివుని భజిస్తాను.*
*గమనిక :~*
*నెమలి వర్షాకాలం ప్రారంభం కాగానే ఆడు నెమలితో కలసి నృత్యం చేస్తుంది. శివుడు సంధ్యా కాలంలో పార్వతితో కలసి నాట్యం చేస్తాడు.( అలంకారం = రూపకం ).*
*ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో మనం ధ్యానించాలని శంకరుల వారి అభిప్రాయంగా గ్రహించాలి.*
*వివరణ:~*
*స్కాందపురాణములో దేవతలు ప్రదోష కాలంలో ఈశ్వరుని సేవిస్తారని ఇలా తెలిపారు.*
*కైలాస పర్వతభవనంలో ముల్లోకాలకూ తల్లియైన పార్వతిని సువర్ణ పీఠములో ఉంచి, ఈశ్వరుడు నాట్యం చేయాలని కోరుకుంటాడు. ప్రదోష కాలంలో దేవతలు ఈశ్వరుని సేవిస్తారు.*
*శివుడు నృత్యం చేసే సమయంలో సరస్వతీ దేవి వీణను వాయిస్తుంది. ఇంద్రుడు వేణునాదం వాయిస్తాడు. బ్రహ్మ తాళం వాయిస్తాడు. లక్ష్మీదేవి పాట పాడుతుంది. విష్ణుమూర్తి మద్దెల వాయిస్తాడు. దేవతలంతా చుట్టూ నిలచి ఆ ప్రదోష సమయంలో పార్వతీ పతియైన ఈశ్వరుని సేవిస్తూ ఉంటారు.*
*పైన పేర్కొన్న విధంగా ఈశ్వరుని ప్రదోషకాలంలో సర్వదేవతలూ పూజిస్తారని తెలుస్తుంది. మనం కూడా సంధ్యా సమయంలో ఈశ్వర స్తోత్రం చేయాలని శంకరులు ఈ శ్లోకము ద్వారా సూచించారు.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి