☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(86వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కృష్ణావతారం*
*చిన్ని కృష్ణుని లీలలు*
*ఏలినవాని నోట ఏడేడులోకాలు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*రామకృష్ణులూ, గోపబాలకులూ ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడు బోర్లాపడ్డాడు. అప్పుడతని పెదవులకు మన్ను అంటింది. అంటిన మన్నును చప్పరించి చూశాడతను. బాగుంది. తియ్యగా ఉంది. మన్నును గుప్పెడు తీసుకున్నాడు. తినసాగాడు. రాముడది చూశాడు. వద్దని చెప్పాడు. వినలేదు కృష్ణుడు. గోపబాలకులు కూడా కల్పించుకుని వద్దన్నారు. వింటేనా? పైగా మరో గుప్పెడు అందుకున్నాడు కృష్ణుడు.*
*తల్లిని సమీపించాడు రాముడు. గోపబాలకులు కూడా అతన్ని అనుసరించారు.*
*‘‘అమ్మా, అమ్మా! తమ్ముడు కృష్ణుడు మన్ను తింటున్నాడే!’’ ‘‘అవునమ్మా! గుప్పెళ్ళకొద్దీ తీసుకుని తింటున్నాడు. వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదు.’’ అన్నారు గోపబాలకులు.*
*‘‘కృష్ణుడెక్కడ?’’ కోపగించుకుంది యశోద. ‘‘అక్కడ’’ అంటూ అటుగా చూపించారు. అక్కడకి పరుగుదీసింది యశోద. మన్ను తినడం అనారోగ్యం. తినవద్దని చెబుతున్నా వినడం లేదు కృష్ణుడు. దండించాల్సిందేననుకున్నది యశోద. ‘‘కృష్ణా’’ గట్టిగా అరచింది. చేతిలోని మన్నుని విసిరేసి, చేతిని దులుపుకుని అమాయకంగా చూశాడు కృష్ణుడు.*
*‘‘మన్ను తినకూడదని, తింటే అనారోగ్యం అని నీకెన్నిసార్లు చెప్పాన్రా? విన్నావా? ఎందుకు వింటావు? నువ్వు వినవు. నీకెలా చెప్పాలో నాకు తెలుసు, పద చెబుతాను.’’*
*కృష్ణుణ్ణి రెక్కపట్టి లాగింది యశోద ‘‘నిన్ను...నిన్నేం చేస్తానో చూడు.’’ బెదిరించింది.*
*‘‘మన్ను తినలేదమ్మా’’ ఏడుపు ముఖం పెట్టాడు కృష్ణుడు.‘‘అబద్ధాలాడుతున్నావు.’’*
*‘‘లేదమ్మా! నేను నిజమే చెబుతున్నాను.’’*
*‘‘నమ్మను. నువ్వు మన్ను తిన్నావు. తినకపోతే నీ మీద చాడీలు చెప్పడం వాళ్ళకు సరదానా?’’*
*‘‘నా మాట నమ్మట్లేదుకదా, సరే, నా నోరు చూడు, నీకే తెలుస్తుంది.’’ అన్నాడు కృష్ణుడు*
*‘ఏదీ చూపించు.’’ అడిగింది యశోద.*
**ఏలినవాని నోట ఏడేడులోకాలు*
*ముందు సన్నసన్నగా తెరచి, తర్వాత ఓ గుహలా బాగా విప్పార్చి నోరు చూపించాడు కృష్ణుడు. ఆ నోటిలోకి యశోద తొంగి చూసి విస్తుపోయింది.*
*భూమి, ఆకాశం, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్ర గ్రహనక్షత్ర తారకాగణాలు, సకల చరాచర భూత జాలం, స్వర్లోక పాతాళాదిలోకాలు సహా తనూ, తను నివసిస్తున్న గోకులం కూడా కృష్ణుని నోటిలో కనిపించాయి యశోదకు. దిగ్ర్భాంతి చెందింది. నోట మాటలేదు.*
*ఏమిటిదంతా? చిన్నికృష్ణుని నోటిలో సమస్తలోకాలూ కనిపించడం ఏమిటి? ఇది కలా? నిజమా? అంతుచిక్కని ఒకానొకదశలో కళ్ళు మూసుకుంది యశోద. మాయకు లోనయింది. అప్పుడు ఆమెకు సర్వేశ్వరుడు తన ఉనికిని అంతా విడమరచి చెప్పినట్టుగా వినవచ్చింది. అన్నిటా అంతటా తనేనన్న శ్రీహరి గొంతు వినవస్తోంటే యశోద రెండు చేతులూ జోడించి, కృష్ణునికి నమస్కరించింది. సమస్తానికీ ఆధారభూతుడయిన శ్రీమన్నారాయణుని శరణువేడింది. శరణువేడిన మరుక్షణం మాయ వీడిపోయింది.*
*విశ్వరూపాన్ని ఉపసంహరించాడు కృష్ణుడు. నోరు మూసేశాడు. మామూలు పిల్లాడయిపోయాడు. ఏడుపు నటించాడు. యశోద తల్లిహృదయం తల్లడిల్లింది. కృష్ణుణ్ణి దగ్గరగా తీసుకున్నదామె. లాలించింది. ముద్దు చేసింది.‘‘ఏడవకు నాన్నా! ఏడవకు! నువ్వు ఏడిస్తే నేను చూడలేను.’’ అన్నది. కన్నీరు పెట్టుకుంది. తల్లి కన్నీరు పెట్టుకోవడాన్ని చూసి, జాలి చెందాడు కృష్ణుడు. గొలుసు గొలుసులుగా నవ్వసాగాడు. చిన్నికృష్ణుని నవ్వు తొలకరిలా అనిపించింది యశోదకు. అందులో తనివితీరా తడిసిపోయిందామె.*
*మద్దిచెట్లు: సిద్ధపురుషులు*
*యశోద చల్ల చేస్తున్నది. కవ్వం తాళ్ళు పట్టుకుని కుండలో పెరుగు చిలుకుతున్నది. కృష్ణుడు వచ్చాడప్పుడు. పాలిమ్మని ఏడుపు అందుకున్నాడు.‘‘చల్లయిపోనీ, పాలిస్తాను.’’ అన్నది యశోద.*
*వినడే! తల్లి చీరకొంగు లాగసాగాడు కృష్ణుడు.‘‘ఉండురా నాన్నా’’ బతిమలాడుకున్నది యశోద. ఫలితం లేదు. పాలిమ్మని కృష్ణుడు ఒకటే ఏడుపు. తప్పదనుకున్నది యశోద. కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకుని పాలివ్వసాగింది. అంతలో పొయ్యి మీద పాలు పొంగిపోతూ కనిపించాయి. కృష్ణుణ్ణి తొలగించి, పరుగుదీసిందక్కడకి. తనకి పాలివ్వకుండా తల్లి అలా పరిగెత్తి పోవడాన్ని కృష్ణుడు సహించలేకపోయాడు. కోపం వచ్చిందతనికి. కళ్ళెర్రజేశాడు. పెదవులు కొరికాడు. దగ్గరలో ఉన్న రాయి అందుకున్నాడు. పెరుగుకుండ మీదకి విసిరాడు దాన్ని. ‘ఫెడేళ్’మని పెరుగుకుండ పగిలిపోయింది. చల్ల అంతా కాలువలుగట్టి ప్రవహించసాగింది. ప్రవాహంలో తేలివస్తున్న వెన్నముద్దలు చేజిక్కించుకుని అక్కణ్ణుంచి పారిపోయాడు కృష్ణుడు. పొయ్యి మీది పాలు పొంగకుండా చేసుకుని, చల్లకుండ దగ్గరకి చరాచరా వచ్చింది యశోద. అక్కడి దృశ్యాన్ని చూసి కోపం తెచ్చుకుంది. నిండుకుండను పగలగొట్టి పారిపోతావా? ఉండు, నీ పని చెబుతాను అనుకుంటూ కృష్ణుని కోసం వెదకసాగింది. కృష్ణుణ్ణి కొట్టేందుకు చేతికర్ర కూడా అందుకుంది. అటు వెదకి, ఇటు వెదకి. వేసారిపోయింది. ఎక్కడున్నావు కృష్ణయ్యా అంటే ఇదిగో ఇక్కడ ఉన్నానన్నట్టుగా పెరటిలో పూలచెట్టునీడలో రోలు మీద కూర్చుని కనిపించాడు కృష్ణుడు. తిన్నంతగా వెన్న తిన్నాడు. మిగిలినది తన దగ్గర కూర్చున్న కోతికి పెడుతూ కనిపించాడు. వెల్ల వేసినట్టుగా ఒంటినిండా వెన్నే! కృష్ణుణ్ణి చూడగానే కోపం మరింత రెట్టింపయి, అతన్ని పట్టుకునేందుకు పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ రాసాగింది యశోద.*
*అమ్మకి కోపం వచ్చింది. అమ్మ చేతిలో కర్ర కూడా ఉంది. కొడుతుంది. చిక్కకూడదనుకున్నాడు కృష్ణుడు. పరుగుదీశాడు. కాలిగజ్జెలు ఘళ్‌ఘళ్‌మంటూ కృష్ణుడు పరుగుదీస్తోంటే, అతన్ని పట్టుకునేందుకు యశోద ఆపసోపాలుపడ్డది. ఆఖరికి కృష్ణుణ్ణి అందిపుచ్చుకున్నది. చేతికర్ర ఎత్తి కొట్టబోయింది. కన్నీటితో చూశాడు కృష్ణుడు. కరగిపోయింది యశోద. కర్రను వదలి, కృష్ణుణ్ణి కౌగిలించుకుంది.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి