23, ఏప్రిల్ 2021, శుక్రవారం

శ్రీనాథుడు

 ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధి గాంచిన శ్రీనాథుడు తన కాలం నాటి సాహిత్య ప్రపంచానికి హిమాలయ పర్వత సదృశమైన సారస్వత మూర్తి. దేశదేశాలు తిరిగి, అనేక ఆస్థానాలలో సత్కారాలు పొందినవాడు. 


విజయ నగరంలో విద్యాస్పర్థలో గౌడ డిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు. అక్కడే, ప్రౌఢ దేవ రాయల ఆస్థానంలో రాజు చేత కనకాభిషేకం చేయించుకున్న వాడు. కొండవీటి రెడ్డిరాజుల రాజ్యంలో విద్యాధికారి పదవిని నిర్వహించాడు. అవచి తిప్పయ, మామిడి సింగయ మంత్రి లాంటి సమకాలీన రాజకీయ వేత్తలతో భుజం భుజం కలిపి తిరిగాడు. 


హర విలాసము, కాశీ ఖండము, భీమేశ్వర పురాణము, శివరాత్రి మహాత్మ్యము, మరుత్తరాట్చరిత్ర లాంటి కావ్యాలు వెలయించాడు. శ్రీహర్షుని సంస్కృత నైషధాన్ని ‘శృంగార నైషధం’ గా మహా ప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. జానపదుల వీరగాధ అయిన పల్నాటి వీర చరిత్రను ద్విపదలో అందంగా సంతరించాడు.


ఎంతో వైభవంగా బ్రతికిన శ్రీనాథుడి చివరి దినాలు మాత్రం చాలా బాధాకరంగా గడిచాయి. సానుభూతి లేని పాలకుల చేతుల్లో బాధలు పడ్డాడు. సొంత వ్యవసాయం లో పక్షుల వల్లా, వరదల వల్లా పంటలు పాడై పోయాయి. పన్నులు కట్టలేక శిక్షలు అనుభవించాడు. చివరికి ఆ దిగులుతోనే మరణించాడు. అయినా, ఆ మహాకవి ఆత్మ విశ్వాసం చూడండి. చనిపొయే టప్పుడు ‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి’ అంటూ స్వర్గారోహణం గావించాడు.


ఆయన కాలంలోనే ఏమి, ఈనాటికి కూడా శ్రీనాథుడు ఒక మేరు శిఖరమే!

కామెంట్‌లు లేవు: