22, ఏప్రిల్ 2021, గురువారం

టీ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

టీ

“ఏమన్నా తాగుదామా” అడిగా మా ఆవిడని, ఇద్దరిలో ఎవరికి తాగాలనిపించినా ఇలా అడగటం పరిపాటి.

“సరే టీ కలపండి” టాబ్ లోంచి మొహం తియ్యకుండానే అంది మా ఆవిడ. 

యుద్ధానికి బయలుదేరిన ఉత్తర కుమారుడిలా, అర్జనుడు లేకుండానే వంటింట్లోకి బయలుదేరా. అయ్యా టీ పెట్టటానికి ఇంత బిల్డప్పా అంటే, మరి పెళ్ళానికి నచ్చేలా పెట్టడం అంటే మాటలు కాదు.

నెమ్మదిగా పాల పాకెట్ ని కట్ చేసి, జాగ్రత్తగా గిన్నెలో పోశా. ఏంటో, ఎంత జాగ్రత్తగా పోసినా సగం పాలు వొలికి పోతాయి ఎప్పుడూ అంతే. గబగబా దొరికిన నాప్కిన్ తో అంతా శుభ్రం చేసి, మల్లీశ్వరి సినిమా లో కుండీ గుద్దెసి, శుభ్రం చేసిన తరువాత బ్రహ్మానందం లా విజయగర్వం తో ఒక నవ్వు నవ్వు కున్నా.

మా ఆవిడ సోఫా లోంచి, “మీకు పాకెట్ లోంచి పాలు తియ్యడం రాదు, జాగ్రత్త!! గిన్నెలో పాకెట్ పెట్టి కట్ చేసుకోండీ, లేకపోతే నేను రానా”  

“అక్కర్లే, జాగ్రత్తగానే తీశా” పూర్తి నమ్మకమైన గొంతు తో చెప్పా. ఏమి విచిత్రమో, అంత నమ్మకం గా చెబితే మా ఆవిడకి అనుమానం వచ్చేస్తుంది.

“ సరే వలికినా మీరు తుడవకండి నేను చూసుకుంటా” మా ఆవిడ నాకు తెలుసులే అన్నట్టు గా.

“టీ పొడి ఎక్కడుంది”

“పోపుల డబ్బా పక్కన”

టీ డబ్బా వెతికి ,టి పొడి తీసే లోపు వెధవ పాలకి ఖంగారు వచ్చేసింది, స్టోవ్ అంతా పొంగి పోయాయి.

మళ్ళి మన నాప్కిన్ తో మరోసారి పొంగిన పాలు, స్టోవ్, శుభ్రం చేసి; పాలలో టీ పొడి, పంచదార వేసి, ఈసారి స్టౌ సిమ్ లో పెట్టి జాగ్రత్తగా చూస్తూ కూర్చున్నా.  

“స్టోర్ రూమ్ లో మామిడి కాయ ఒకటి తీసి కొయ్యండి. ముక్కలు సరిగ్గా తరగండి అందంగా. లేక పోతే నాకు ఇవ్వండి నేను తరుగుతా.” అంది మా ఆవిడ పైకి మెట్లేక్కుతూ.

వెళ్ళి మామిడికాయ లు ఒక రెండు తీసి, శుభ్రం గా కడిగి, సన్నగా అందం గా ముక్కలు చేసి, ఉప్పు కారం సన్నగా చల్లి రెండు ప్లేట్లలో సద్ది ఒకటి మా ఆవిడ కిచ్చా.

“టీ ఏది” అడిగింది మా ఆవిడ,

“తెస్స్తున్నా” అని జాగ్రత్త గా మేనేజ్ చేసి, మార్చి పోయిన టీ చూడటానికి వంటింట్లోకి పరిగెత్తా.

ఇంకేముంది ముచ్చటగా మూడోసారి పొంగి మిగిలిన టీ నాకేసి చూస్తోంది గిన్నె లోంచి.

రెండు చిన్న కప్పులలో ఎలాగో అలా వడపోసి, సద్ది ముందు మా ఆవిడ చేతికి టీ అందించా.

“చాలా బావుంది టీ!!, కొద్దిగానే కలిపారే “ చిరాగ్గా అంది మా శ్రీమతి క్వాంటీటీ సరిపోక.

నెమ్మదిగా నసిగా, “పాలు వలికాయి” అని.

“అనుకున్నాను, ఇందాకటి నుండి పాల వాసన తెగ వచ్చేస్తుంటే, టీ కూడా వలికిందా, సరే వచ్చి కూర్చోండి, అయినా నాది బుద్ది తక్కువ మిమ్మల్ని కలపమనడం” అంటూ వంటింట్లో కి పరిగెట్టింది అర్జనుడిలాగా .  

ఎలా అయినా టీ కాయడం వేళాకోళం కాదండీ బాబు. గొప్ప ఆర్టు.!!! అందరికీ రాదు.


సేకరణ:- పుసులూరి రమేష్.

కామెంట్‌లు లేవు: