22, ఏప్రిల్ 2021, గురువారం

అపురూపంగా పుట్టావు.


               🌷🌷🌷

పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. 


అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు. 


అందరాని చందమామకోసం అలకలుపోయావు. 

కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. 


బాగా చిన్నప్పుడే ఆస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు. 


ఆయన్నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు. 


ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభను ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు. 


తీరా పెళ్ళయ్యీ భోయనాలకి కూచుందాఁవనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు. 


చెప్పొద్దూ! అంతహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు. 


ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభను ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.


ఎంత ముద్దు చేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. 


నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానా యాగీ చేసేసింది. 


నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదు పొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది. 


ఇక్కడుంటే తమిళనాడులోలా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏఁవిటో? 


పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు. 


‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు. 


నీకు తోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓవుత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు. 


తనూ నారబట్టలు కట్టేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.


ఇహ మీతమ్ముడు. చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! 


వందచెప్తారు. 


డబ్బడిగితే జేబుఖాళీ అంటారు. 

పన్చెబితే చెయిఖాళీలేదంటారు. 


అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు. 


వాళ్ళతో కలిసి నీమూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు. 


నిశ్శబ్దమందిరాల్లో నిదరోయే మహరాజు బిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠి కిందే పడుకున్నావు.


ఒకటారెండా....పధ్నాలుగేళ్ళు! 


ఎన్నో తప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు. 


జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మా సరదా తీర్చకుండా బయటే ఊరేగుతూ వుంటారు.


అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు. 


అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచిన వెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు. 


నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు. 


ఇంటో అన్నీ వుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం! 


అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆ లేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపం చెంది,  తెద్దాఁవని బయల్దేరావు.


మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు. 


ఏ మాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు. 


నిస్సహాయతనేది సామాన్య మానవుణ్ణి ఎలా బాధిస్తుందో నిరూపించావు. 


మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు. 


ఎంతో ఇష్టంకాబట్టే ఎంత కష్టపడాలో అంతాపడ్డావు. 


ఏ సాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ మనోవైజ్ఞానిక గ్రంథాలూ చెప్పలేదు. 


తాతయ్య నోటివెంట నీ కథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటనుమానం కోతుల్నెలా లొంగదీసుకోడమని! 


అదీ చూసేవాళ్ళం మా చిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం! 


వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది! 


ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువు చేసిన స్నేహమూ, ఆనక వాళ్ళ సాయంతోనే నువు కట్టిన వారధీ చూస్తే... 


దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!


సెభాషోయ్ రామా! నీ గురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా! 


నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీ జీవితం!


నిలకడ లేని వాళ్ళతో పొంతన

నీళ్ళను దాటడానికొక వంతెన

నిర్భయమేగావుంటే నీచెంతన

నిరాధారులకిచ్చావు సాంత్వన

నికార్సైనది నీ మార్గం ఎంతైనా

నిరతమూ మాకదేకదా చింతన


నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!


నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని 

నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!


పదిమందీ కలిస్తే పండగ! 

పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! 

పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!


అందాలరాముడు....

అందువలన దేముడు!!


..........జగదీశ్ కొచ్చెర్లకోట

కామెంట్‌లు లేవు: