22, ఏప్రిల్ 2021, గురువారం

తపస్సునొనరించే చోటు...

 

మతంగముని శిష్యులతో తపస్సునొనరించే చోటు...


ఆశ్రమంలో అడుగడుగునా కుందేళ్లు. 

అక్కడున్న అన్ని వృక్షాలకీ వందేళ్లు. 


అలల అలజడితో గలగలల పంప. 

అడివంతా పుష్పసంపదలొక చెంప.


అణువణువూ అనురాగభరితం. 

అసలెక్కడ చూసినా మొత్తం హరితం.


మతంగ ముని ఆదరణతో ఎన్నోయేళ్లు గడిపేసింది.....


శబరి....!


ఒక నిషాద స్త్రీ! వేటను వృత్తిగా చేసుకుని జీవించే కుటుంబంనుంచి వచ్చింది. క్రౌర్యాన్నీ,  ధైర్యాన్నీ కలగలిపి అడవి జంతువుల్ని వెంటాడి, పచ్చి మాంసాన్ని సైతం భక్షించే ఆ కులంలో పుట్టిందన్న కారణమే ఆమెకు అడ్డంకిగా మారింది.


బాల్యము, యవ్వనము గడిచిపోతున్న కొద్దీ మనసులో కోరిక ఋష్యమూక పర్వతంలా పెరిగిపోతోంది. ఆశ్రమవాసులకు సేవలందించి, ప్రశాంత జీవనం గడపాలని, సజ్జన సాంగత్యంలో సహృదయాన్ని సాధించాలని, సకల జీవజాలాన్నీ సమప్రాణులుగా భావించాలనీ ఆశ!!! 


మునులంతా వలదన్నారు. దాంతో విషాద వనితగా మారిన ఆ నిషాద యువతిని మతంగ మహర్షి ఆదరించాడు. ఆశ్రమానికి కావలసిన ఆదరువులు అమర్చిపెట్టవచ్చన్నాడు. మతంగుని మాటకు మనసు పతంగమై ఎగసింది. 


ప్రతినిత్యం ముని కుమారులందరూ ఎన్నో చెట్లను గాలించి, శోధించి సాధించుకొచ్చే ఫలాలు ఎంతో బరువుండేవిట. వాటిని మోస్తూ వారు చిందించిన స్వేదబిందువులు నేలను తాకి ఎన్నో వేల వృక్షాలు మొలకెత్తాయి. ఆ తపశ్శక్తి ప్రభావాన అచట పూచిన పూలు వాడిపోవుట. పళ్లు ఎండవుట. అదొక నిరంతరమైన జీవశక్తితో అలరారే దట్టమైన అడవి.


అంతకాలం మునులు సూర్యుడికన్నా ముందే బయటపడి శ్రమదమాదులకోర్చి సాధించుకొచ్చే పుష్పఫలాదులన్నీ అప్పటికే గుమ్మాల ముందు కనబడ్డం మొదలెట్టాయి. కుటీరాల గోడలన్నీ గోమయంతో అలికినట్టుగాను, ఇంటిముందు కళ్లాపి చిలికినట్టుగానూ కనబడేవి. ముగ్గులెట్టిన ముంగిళ్లు ముత్యాల్లా మెరిసిపోతోంటే చిక్కటి ఆకాశాన చక్కటి నక్షత్రాల్లా తోచేవి. 


ఎవరు ఆశ్రమానికై ఆ శ్రమనొనరిస్తున్నది? అవగతమవ్వలేదు. మహర్షుల సమాధానం విన్న మునులు మౌనం వహించారు. నిషాదుల సేవలు నిషేధమని వారించే చొరవ చెయ్యలేకపోయారు. కాలక్రమంలో సజ్జన సాంగత్యం, సాధుసంతులతో సహజీవనం, దైవారాధన, నిత్యపారాయణ ఇత్యాది నవవిధ భక్తిమార్గాలూ అలవడ్డాయి. 


ఋషులంతా ఒకరొకరుగా విష్ణుసాయుజ్యం పొందుతున్నారు. వారు నడిచిన నేలంతా పూలురాలి నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. నిరతమూ హరినామాన్ని నినదించే మునిపుంగవులు ఒక్కొక్కరుగా ఆ హరిని చేరసాగారు. చెట్లనంటిపెట్టుకుని, పళ్లు మెక్కి కూతకెక్కిన పక్షులకు ఆకలెయ్యడం మానేసింది. అడివంతా ఏదో బాధ. శబరికీ విచారం మొదలయింది.


మతంగుని అవసాన దశలో వారి పాదాలచెంత నిలిచి ‘తన సంగతేమిట’ని ప్రశ్నించింది. దానికా మహర్షి చెప్పిన కబురుకి శబరికి ఒడలంతా పులకరించింది. మళ్లీ పిల్లతెమ్మెర పలకరించింది. పక్షుల కిలకిలలు, పంప గలగలలూ వినబడసాగాయి. 


రాముడొస్తాట్ట! అతడు హరేనుట!! ఆ వచ్చేది తనకోసమేనుట!!!


ముని ఇంకా ఇలా అన్నాడు....


‘నువ్వు సామాన్యురాలివి కాదు శబరీ, నిన్ను కలవాలని ప్రత్యేకించి ఇంత మారుమూల అడవిలోకీ విచ్చేసి నీ ఆతిథ్యం స్వీకరిస్తాడు. సోదరులిద్దరినీ ఆదరించు. అతడికోసం దాచుంచే పనిలేదు. తోచిందే పెట్టు. మంట మండించి వంట వండాల్సిన అవసరంలేదు. ‘ఫల’హారమే చాలు. మావి నిష్కామ కర్మలనీ, ఎటువంటి ఫలాపేక్షా లేని తపస్సులనీ భావిస్తూనే గడిపాం. నిజానికి నీదీ యోగమంటే! కమలాక్షునర్చించు కరములే కరములు. శుభం భూయాత్!’


ఆనక ఆయనా స్వర్గం మీదుగా వైకుంఠానికి పయనమయ్యాడు.


ఆశ్రమమంతా బోసిపోయింది. అడవి కన్నీటి కడవలా మారింది. క్రూరజంతువులు, రోజులు భారంగా నడుస్తున్నాయి. 


రాముడొస్తాట్ట! ఆ ఒక్కమాటే చెవుల్లో ధ్వనిస్తోంది. ఎలావుంటాడు? ఇంతదూరం రావాలంటే చాలా కాలం పడుతుంది.  తైలసంస్కారం చేసుకునే తీరికుండదు. అడ్డదిడ్డంగా వేలాడే కేశాలకు ఎటువంటి క్లేశమూ కలగకూడదని అడ్డంగా మొలిచిన పూలతీగల్ని తొలగించేది. దారిలో పడివున్న పలుగురాళ్లని దూరంగా విసిరేసేది. ఆలేత పాదాలు కందిపోతే రాయడానికని నూనె సిద్ధం చేసుకునేది. పళ్లన్నీ ఏరికోరి తెంపుకొచ్చేది. పువ్వులైతే సరేసరి. 


రాత్రిపూట దీపం కొడిగట్టకుండా చమురేస్తూ తడిపేది. 

రాముడెంతకూ రాడేమని కన్నులు చెమరిస్తూ గడిపేది.


ఒకటికాదు, రెండుకాదు. పదమూడేళ్లు ఎదురుచూసింది.


కైక కోరిన విధంగా అడవుల పాలైన రాముడు అనతికాలంలోనే భార్యను పోగొట్టుకున్నాడు. ఎక్కడుందో తెలియక అడివంతా గాలిస్తూ ‘కబంధ’ హస్తాల్లో చిక్కుకున్నాడు. వాడొక గంధర్వుడు. శాపవశాత్తూ వికృతరూపంతో, దొరికిన జంతువుల్ని చంపితింటూ బతుకుతున్నాడు. శాపవిమోచనం కొరకై ఎదురుచూస్తూ వేల వత్సరాలుగా అక్కడ పడున్నాడు. 


వాడి భుజాలు కోసిపడేసిన రామలక్ష్మణులు తదుపరి అతడికి అగ్నిసంస్కారం కూడా జరిపించారు. ఆనక నిజరూపం పొందిన నవ మన్మథాకారుడైన కబంధుడు శబరి గురించి రాముడికి చెప్పాడు. వెళ్లి కలవమన్నాడు.


‘నీకోసమై ఎదురుచూసే ఆ కళ్లు గాజుగోళాల్లా మారిపోయాయి. మళ్లీ నీ దర్శనంతో నీలాలుగా మారతాయి. నీకొరకై కోసితెచ్చిన ఫలాలు నీవారగిస్తే ఆమె కలలు సఫలాలవుతాయి. అంచేత నువ్వు వెళ్లు. నీకు చాలా విషయాలలో సాయమొనరిస్తుంది. నీ సీత జాడ కూడా చెప్పగలదు! శుభం!’ అంటూ విమానమెక్కి నిష్క్రమించాడు.


దారిపొడవునా ఎందరో మునులు వారిని ఆహ్వానించారు. తమ ఆశ్రమాల్లో సేదతీరమన్నారు.  నీకేలోటూ రానివ్వమన్నారు. ‘సీతమ్మను మనం కలిసి వెదుకుదాం!’ అనీ అన్నారు. కానీ రాముడికి తెలుసు. నిజభక్తికి నిలువెత్తు నిదర్శనం ఎవరో??


అనేక జంతువులను, సరస్సులను చూశారు. ఎన్నడూ కనని పక్షుల్ని చూశారు.  కూతలు విన్నారు. నడుస్తూనే వున్నారు. 


ఆశ్రమ మార్గం దగ్గరవుతున్న సమయాన శబరికి ఎడమ కన్నదిరింది. ఊతకర్ర సాయంతో పక్షుల కూతలొచ్చిన దిశగా నడుస్తోంది. కళ్లలో కటకాలు సంకటకాలంలో సహకరించట్లేదు. ఏమీ కనబడదాయె!


ఎదురుగా ఏనుగు నిలబడినా తాకి తెలుసుకోవలసిందే! వెలుగుండగానైతే ఫరవాలేదు.


ఎవరో వస్తున్నారు. అడుగుల సడికి ఆకులు నలిగిన శబ్దం రాగయుక్తంగా వినబడుతోంది. 


ఇవాళెందుకో ఈ నీటికోళ్లకి, క్రౌంచ పక్షులకీ అరుపులు ఎక్కువయ్యాయి. రోజూలా లేవు. ఆ అరుపులో బాధ వినబట్టం లేదు. ఎదురుచూస్తున్న ముహూర్తం దగ్గరవుతుందన్న ఆనందమో, ఎద చిందులేస్తున్న సంబరమో...??


ఆ వచ్చేది రాముడేనా? ఎదురుపడి స్వాగతం పలకాలనుంది.


పుష్పాలన్నీ గుదిగుచ్చి మాలచేసి మెడలో వెయ్యాలనుంది!


ఒళ్లంతా పన్నీరు చల్లి, కన్నీరు మున్నీరవ్వాలనుంది!!


మనసు వాయువేగంతో పరుగెడుతోంటే తనువు మాత్రం వయోభారంతో పడిలేస్తోంది. దగ్గరకొచ్చేశారు వాళ్లు. ఎవరో? ఇద్దరని తెలిసింది. నిద్దర వదిలింది. రామలక్ష్మణులని ముద్దరేసుకుంది. 


దగ్గరగా వెళ్లి అరచేతిని నుదుటనుంచుకుని పరికించింది. వెలుగుంటే చక్కగా కనబడుతుంది తనకి. రాముడొచ్చిన వేళావిశేషం, అక్కడంతా వెలుగే! ఆ రాముడి ముఖవర్చస్సుతో ‘అడవిని వెన్నెల కాచిన’ట్లయింది. సీత కనబడలేదన్న అంత విషాదంలోనూ సహజమైన సౌందర్యం మాత్రం ఎప్పటిలానే ప్రకాశిస్తోంది.


‘రామా! నువ్వేనా? నాకుతెలుసు నువ్వొస్తావని. మతంగుని మాట ఊరికే పోతుందా? దా! కూర్చో! ఇదుగో, ఈ రాళ్లమీద కూర్చోండి. బండలేలే! అయినా చల్లగా వుంటాయి. నీకోసం సుఖాసనాలు, సింహాసనాలు తేలేను. భక్ష్యభోజ్యాలు వడ్డించలేను. ఎప్పుడు తిన్నారో, ఉండండి, పళ్లున్నాయి. మాకిక్కడ చాలా పళ్లు దొరుకుతాయి. కానీ వాటిలో నీమాటలా తియ్యటివి కొన్నే వుంటాయి. నేనిస్తాగా? ఏరికోరి నీకందిస్తాను. కడుపారా తిను. ఆనక పంపలో నీళ్లు తాగుదురుగాని. అవైతే సువర్ణజలాలే! మాలిన్యమెరుగని మంచినీరు!’


అంటూ వణికిపోతోంది. లోపలికెళ్లి ఒక బుట్టనిండుగా చాలా పళ్లు తెచ్చిపెట్టింది. రాముడొకటి కొరకబోయాడు. శబరి వద్దని వారించింది. ఒక్కొక్కటీ తీసి కొరికి చూడసాగింది. అందులో చేదున్నవాటిని, పులుపైన వాటిని విసిరికొట్టింది. తియ్యనైనవన్నీ తినమని అరచేతిలో పోసింది.


దాశరథి నిస్సంకోచంగా ఆ ఎంగిలి పళ్లను తినసాగాడు. లక్ష్మణుడు నివారించాలని అన్న భుజమ్మీద చెయ్యేశాడు. కనులు పైకెత్తి తమ్ముడి కళ్లలోకి చూసిన రాముడు చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండగనే అవగతమయ్యేలా చేశాడు.


శబరిది నిష్కళంకమైన భక్తి. నిజమైన సేవ. నిరాడంబరమైన ఆదరణ. అదే భగవంతుడు కోరుకునేది. 


అంతకాలమూ రాముణ్ణి తనకంటే వేరెవరూ అంతలా ప్రేమించలేరన్న అహంతో అలమటించే సౌమిత్రికి శబరిని చూసి కన్నులు తడిశాయి. 


ఎందరో అడుగులకు మడుగులొత్తుతామని పిలిచినా వెళ్లకుండా ఆ బడుగుకి  ప్రసాదించిన ఆ దర్శనంలో రాముడి ఆదర్శం గోచరమైంది. 


నవవిధ భక్తిమార్గాలన్నీ సాధించిన శబరిదే పుణ్యం.


సజ్జనులైన మునులతో సహజీవనం చేసింది.

నిరతమూ హరికథలను వింటూ గడిపింది.

అహర్నిశలూ గురువులకు సేవలొనరించింది.

భగవంతుని గాధలను గానమొనరించింది.

నిత్యమూ ఆతడి నామస్మరణ గావించింది.

తనకోసమని ఏదీ ఆశించని నిస్వార్ధ తత్త్వం కలది.

సకలజీవరాశులయందూ సమాన దృష్టి కలిగివుంది.

కలిగిన దానితోనే సంతృప్తి చెందింది.

కష్టసుఖాలన్నిటినీ ఒకేలా భావించే నిర్వికార స్థితి చేరుకుంది.


రాముణ్ణి దర్శించినంతనే జన్మ చరితార్ధమై సద్గతులకేగింది!


రాముడు మన జీవితానికి మార్గదర్శనం చేసినవాడు. నువ్వు కష్టాల్లో వున్నప్పుడు అరణ్యకాండనీ, స్నేహితుల కోసం సుందరకాండనీ జ్ఞప్తికి తెచ్చుకో! 


తాకడానికే తటపటాయించే జటాయువుని పసిపాపలా సాకాడు. 


అత్యల్పమైన ప్రాణిని సైతం ‘ఉడతాభక్తి’గా ప్రశంసించాడు. 


నిజమైన భక్తి గుళ్లోదీపంలాంటిదని నమ్మాడు. ఎంగిలంటని ఆ వెలుగే హరికి నిక్కమైన ఆరాధనంటూ తెలిపాడు. 


సాధుజనుల సత్కార్యాలలో లోకకల్యాణమే పరమార్ధమని ఎరిగినవాడు. అందుకే అడ్డొచ్చిన దానవుల్ని దారితొలగించాడు. 


అన్నదమ్ములందు అల్పుని చేరదీశాడు. అన్యాయాన్ని అణగద్రొక్కాడు. 


ఎలా జీవించాలో జీవించి చూపాడే తప్ప సూక్తులు, సూక్ష్మాలూ బోధించలేదు. 


మనకు మార్గాన్ని చూపించి తప్పుకోలేదు. ముందు నడుస్తూ నిరూపించాడు.


అందాల రాముడు...

అందువలన దేవుడు!


శుభాకాంక్షలు!


చిత్రకారులు: *స్వర్గీయ బాపు* 


 *జ గ దీ శ్  కొ చ్చె ర్ల కో ట*

కామెంట్‌లు లేవు: