🌹🌹🌹🌷🌷🌹🌹🌹
*నాకు నచ్చిన శివరాం మోహన్ గారి మరో కథనం.*
🌷🌷🌷
ప్రక్కన కూర్చున్నాయన్ని చూసి పలకరింపుగా నవ్వాను .... ఆయన కూడ ముందు కొంచెం ఆశ్చర్యపోయినా మొహమాటంగా నవ్వారు .... కాకినాడేనా సార్ ... అన్నాను మాట కలుపుతూ... నాన్ స్టాప్ దొరకలేదు ... ఈ వెధవ ఎర్ర బస్సు దొరికింది .... ఎప్పటికి తీసుకెళ్తాడో ఏంటో ... ఆయన విసుగ్గా అంటుంటే ... నేను నవ్వుతూ.... ఏదైనా అర్జన్టు పనుందా సార్ కాకినాడలో ... అన్నాను... అదేం లేదండి ....పాసింజర్ బస్సు అన్ని స్టాపుల్లో ఆగి వెళ్తుంటే చిరాకు ...అంటుంటే ... ఎంత సార్ .... యానాం దాటితే తాళ్లరేవు తర్వాత రెండు దెబ్బల్లో జగన్నాధపురం ... ఇంక కాకినాడ ఊళ్ళో కెళ్లిన తర్వాత ఎర్రబస్ అయినా ఎక్సప్రెస్ అయినా ఒక్కటే... రాత్రయ్యేకొద్దీ బస్టాండ్ లో ఒంటరిగా కూర్చొని ఎక్సప్రెస్ గురించి ఎదురు చూట్టం కన్నా దొరికిన ఎర్ర బస్సు ఎక్కేస్తే .... జనాలు ఉంటారు ..జర్నీ తెమిలిపోద్ది .అన్నాను..
ఆ పెద్దాయన ఈ సారి నా వంక తేరిపార చూశారు ... ఏం చేస్తుంటారు మీరు .... అన్నారు... కొంచెం ఆసక్తిగా .... నేను చెప్పాను .... అదేంటండి... మీకు వెహికల్ ఇస్తారేమో .. అన్నారు... అది ఇక్కడ ఉండిపోద్దండి... నన్ను కాకినాడ బస్సు ఎక్కించి... అన్నాను నవ్వుతూ ... ఆయన కూడా నవ్వుతూ మీరు భలే మాటాడుతున్నారే అంటుంటే ....
చెప్పానా ... అప్పుడే యానాం బ్రిడ్జి వచ్చేసింది చూశారా ....వృద్ధ గౌతమికి ఆఖరి మజిలీ ఇదే... సముద్రుడు ఎదురొచ్చి మరీ తీసుకుపోతాడు గోదారమ్మని ..... తాపం తట్టుకోలేక .... అంటుంటే...ఆ పెద్దాయన నవ్వుతూ .... నా భుజంమీద చరిచాడు...పావుగంట లోనే ఆయనకు చనువు పెరిగిందని నవ్వుకుంటూ .. ... ఈ బ్రిడ్జి కట్టాక సుఖంగా ఉంది గానీ ... రేవులు దాటి కాకినాడ వెళ్లాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది ... రాత్రి పూటయితే ఇంక చెప్పక్కర్లేదు ..
.అన్నంపల్లి దాకా బస్సు ....అక్కడ గోదారి పాయ దాటి మురమళ్ళ .... అక్కడ్నుంచి అద్దె సైకిల్ తీసుకుని ఎదుర్లంక రేవుకొచ్చి .... అద్దె సైకిల్ అక్కడ అప్పజెప్పేసి .... నావెక్కి యానాం చేరుకొని అక్కడ్నుంచి వీరభద్ర ట్రావెల్సోడి కిక్కిరిసిపోయిన బస్సెక్కి పడతా లేస్తా కాకినాడ చేరేసరికి భోజనం టైం కూడా మించిపోయేది ... మనల్ని చూసి .... అదేంరా బాబు ఉత్తరం ముక్కయినా రాసావుకాదు ... అని ముక్కు చీదుకుంటూ పొయ్యేలిగించేవాళ్ళు అక్కలో మేనత్తలొ ....
మనకు తెలీకుండానే చాపకింద నీరులా అభివృద్ధి కూడా జరిగింది ఈ అరవై డెబ్బై ఏళ్లలో .... దీనికి మన వయసు వాళ్లే ప్రత్యక్ష సాక్షులు ... ప్రతి దానికి బ్రిటీషోళ్ళని మెచ్చుకుంటారు మనోళ్లు కొందరు మన ప్రభుత్వాన్ని ఈసడిస్తూ ...అంకినకాడికి దోచుకుని పీల్చి పిప్పి జేసి అప్పగించి వెళ్లారని ఇంకా బతికున్న అప్పటి వాళ్ళని అడిగితే చెబుతారు... . అభివృద్ధి చెందిన యూరప్ అమెరికాలతో పోల్చి ఎద్దేవా చేస్తుంటారు నవతరం .... ఆ దేశాలకు స్వతంత్రం వచ్చి వందల ఏళ్ళు గడిచాయని మాత్రం మర్చిపోతారు ....వాళ్ళు ఇతర దేశాల్ని దోపిడీ చేసి పెంచుకున్న సంగతి కూడా మర్చిపోయారు ... 1947 లో మన జనాభా 39 కోట్లు ... మరిప్పుడు 130 కోట్లు ...ఇది అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం .... మన పల్లెటూర్లలో ఇప్పటికి కనిపించే ఉమ్మడి కుటుంభాల్లాంటిది ... ఎవర్నీ నొప్పించకుండా చక్కపెడుతూ వెళ్ళాలి ..... నియంతృత్వ దేశాల్లో ప్రజల భావోద్వేగాలను పట్టించుకోరు కాబట్టి అభివృద్ధి పెరుగుదల స్పీడ్ గా ఉంటుంది .... మానవ సంబంధాలు మాత్రం మరోలా ఉంటాయి ... మనం అమెరికానో బ్రిటనో మన పిల్లల దగ్గరకెళ్ళి ఒక్క రెండు నెలలు ఉంటే .. కొత్తలో భలేగా ఉంది అనిపిస్తాది ....వారం రోజులకే మాట్లాడేవాడు కనిపించక మన దేశమ్మీద బెంగొస్తాది ... అభివృద్ధి మెల్లగా జరిగినా పర్లేదు ... అభిమానాలు తగ్గకుండా ఉంటె అదే పదివేలు .... అనిపిస్తది .....
మాటల్లో పడి కాకినాడ కల్పనా సెంటర్ ఒచ్చేసింది ..... అదేంటి సార్ మీరెక్కడ దిగాలి .... అంటుంటే.... నేను జిల్లా పరిషద్ దగ్గిరే దిగాలి ... కానీ దిగబుద్ధి కాలేదు ... మీతో మాట్లాడుతుంటే ... మీరెక్కడ ... కాంప్లెక్స్ లో దిగాలా ... నేనూ అక్కడే దిగుతాను .... అక్కడ్నుంచి ఆటో ఎదో పట్టుకుని వెనక్కు వెళ్తాను ... ఆయన మనస్ఫూర్తిగా అలా అంటుంటే నాకు నోటంట మాట రాలేదు ....
*"సం"మోహనం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి