3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

సంస్కృత మహాభాగవతం

 *3.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.9 (తొమ్మిదవ శ్లోకము)*


*శ్రియా విభూత్యాభిజనేన విద్యయా త్యాగేన రూపేణ బలేన కర్మణా|*


*జాతస్మయేనాంధధియః సహేశ్వరాన్ సతోఽవమన్యంతి హరిప్రియాన్ ఖలాః॥12332॥*


ధనాదిసంపదలు, ఐశ్వర్యము (భూములు, గృహములు మొదలగునవి), అభిజాత్యము (గొప్ప వంశమున జన్మించుట), పాండిత్యము, దానము, దేహసౌష్ఠవము, బలము, కర్మలు మొదలగువానిని కలిగియుండుటవలన గర్వితులై వివేకహీనులై భగవంతుని, భగవద్భక్తులను, సత్పురుషులను అవమానింతురు.


*5.10 (పదియవ శ్లోకము)*


*సర్వేషు శశ్వత్తనుభృత్స్వవస్థితం యథాఖమాత్మానమభీష్టమీశ్వరమ్|*


*వేదోపగీతం చ న శృణ్వతేఽబుధా మనోరథానాం ప్రవదంతి వార్తయా॥12333॥*


ఆకాశమువలె పరమాత్మ సర్వవ్యాపియై, సకలదేహధారులలో (ప్రాణులలో) అంతర్యామిగా విలసిల్లుచు, వెలుపలగూడ వెలుగొందుచుండును. ఈ విషయములను వేదములు పదేపదే వక్కాణించి యుండెను. కాని అజ్ఞానులు వాటిని వినుటకు ఉత్సాహము చూపరు సరిగదా! వారు సర్వదా తమ ఐహికవాంఛలను గూర్చియే ముచ్చటించుకొనుచు సమయమును వృథా చేయుచుందురు.


*5.11 (పదకొండవ శ్లోకము)*


*లోకే వ్యవాయామిషమద్యసేవా నిత్యాస్తు జంతోర్న హి తత్ర చోదనా|*


*వ్యవస్థితిస్తేషు వివాహయజ్ఞసురాగ్రహైరాసు నివృత్తిరిష్టా॥12334॥*


ప్రాణులకు స్త్రీ సంగమము, మాంసభక్షణమ, మద్యసేవనము అను వానియెడ స్వాభావికముగా ప్రవృత్తి (ఆసక్తి) ఉండును. వీటికి ప్రేరణ-ప్రోత్సాహములతో పనిలేదు. కానీ ఇవి పతనహేతువులు. వివాహానంతరము ధర్మపత్నితో శాస్త్రసమ్మతమైన సంగమము ఉచితమైనది. యజ్ఞాచరణమునందు పశువులను స్పృశించవలెనేగాని, మాంసభక్షణము తప్పుకాదని శాస్త్రములందు నియమము చెప్పబడలేదు. అట్లే సౌత్రామణి యజ్ఞమునందు సురను ఆఘ్రాణించుటవరకే చెప్పబడినది కాని, సురాపానముచేయుటకు శాస్త్రనియమము ఏర్పడలేదు. కావున ఇందుకు వ్యతిరేకముగ వ్యవహరింపకుండుటయే శాస్త్రముల ముఖ్యతాత్పర్యము. అంతేగాక, పరస్త్రీ సంగమము, మాంసభక్షణము, సురాపానము అను వ్యసనప్రవృత్తి నుండి దూరముగ నుంచుటకై నివృత్తిని బోధించుటయే శాస్త్రముల నిశ్చితాభిప్రాయమని తెలియవలెను. ఈ విధముగా మానవుల లౌల్యప్రవృత్తికి శాస్త్రములు తగిన హద్దులను ఏర్పరచినవి.


*5.12 (పండ్రెండవ శ్లోకము)*


*ధనం చ ధర్మైకఫలం యతో వై జ్ఞానం సవిజ్ఞానమనుప్రశాంతి|*


*గృహేషు యుంజంతి కలేవరస్య మృత్యుం న పశ్యంతి దురంతవీర్యమ్॥12335॥*


ధనమును భగవత్ప్రీతికరమైన ధర్మకార్యముల యందు వినియోగింపవలెను. ధర్మకార్యములను చేయుటవలన విజ్ఞానసహితమైన జ్ఞానము కలుగును. దీనివలన ప్రశాంతి లభించును. ఈ సత్యమును ఎఱుగక కొందరు తమ ధనమును గృహనిర్మాణాదులకును, ఐహిక సుఖభోగములకును వ్యయము చేయుదురు. తిరుగులేనిశక్తిగల మృత్యువు తమను ఎప్పుడు కబళించునో అను సంగతిని వారు ఎఱుగరు కదా!


*5.13 (పదమూడవ శ్లోకము)*


*యద్ఘ్రాణభక్షో విహితః సురాయాస్తథా పశోరాలభనం న హింసా|*


*ఏవం వ్యవాయః ప్రజయా న రత్యా ఇమం విశుద్ధం న విదుః స్వధర్మమ్॥12336॥*


సౌత్రామణి యజ్ఞమునందు సురాఘ్రాణము (వాసన చూచుటయే భక్షణము) యుక్తము అని చెప్పబడినది. సురాపానము గాదు. యజ్ఞమునందు పశువును స్పృశించుటయే విధానము. దానిని హింసించుటగాదు. భార్యాసంగమము, పితృఋణమును దీర్చుటకై సత్సంతాన ప్రాప్తికై విధింపబడినది. రతిసుఖము కొరకుగాదు. ఈ విశుద్ధ ధర్మమును భక్తిహీనులు ఎరుగరు.


*5.14 (పదునాలుగవ శ్లోకము)*


*యే త్వనేవంవిదోఽసంతః స్తబ్ధాః సదభిమానినః|*


*పశూన్ ద్రుహ్యంతి విశ్రబ్ధాః ప్రేత్య ఖాదంతి తే చ తాన్॥12337॥*


అవినీతిపరులు, తమను తాము సాధువులుగా భావించుకొనువారు, ఐన దుష్టులు ఇట్టి విశుద్ధ ధర్మమును ఎరుగక, ఏ మాత్రమూ సంశయము లేకుండా పశువులను హింసింతురు. వారు చనిపోయిన పిమ్మట ఆ పశువులే వారిని భక్షించును.


*5.15 (పదునైదవ శ్లోకము)*


*ద్విషంతః పరకాయేషు స్వాత్మానం హరిమీశ్వరమ్|*


*మృతకే సానుబంధేఽస్మిన్ బద్ధస్నేహాః పతంత్యధః॥12338॥*


వారు నశ్వరమైన తమ దేహముమీదను, భార్యాపుత్రాది పరివారము పైనను ప్రగాఢమైన ప్రేమాను రాగములను కలిగియుందురు. వారు తమయందును, ఇతరుల (ఇతర ప్రాణుల) శరీరములలో అంతర్యామిగా ఉన్న భగవంతుని ద్వేషించుచుందురు. అట్ఠివారు అధోగతి పాలగుచుందురు.


*5.16 (పదహారవ శ్లోకము)*


*యే కైవల్యమసంప్రాప్తా యే చాతీతాశ్చ మూఢతామ్|*


*త్రైవర్గికా హ్యక్షణికా ఆత్మానం ఘాతయంతి తే॥12339॥*


జ్ఞాననిష్ఠ అబ్బనివారు, మూఢత్వముయొక్క పరాకాష్ఠకు చేరినవారు (పరమమూర్ఖులు) క్షణభంగురములైన ధర్మార్థకామములనే ప్రధానముగా భావించుచు, కామ్యకర్మల యందే నిమగ్నులై ఆత్మఘాతకులగుచుందురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: