3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఒప్పుకోలేము

 ఒప్పుకోలేము గానీ...

చింతచిగురు దెచ్చి రోట్లో దంచేసి 

వరి అన్నములోన వేసికొని తిన్నామా

విటమిన్ 'సి' అందడానికి...


ఒప్పుకోలేము గానీ....

ఎండు మిరపకాయ వెల్లుల్లి తొక్కేసి

జొన్నజావలోన నంజుకొని తిన్నామా

'యాంటీవైరస్' పెరగడానికి...


ఒప్పుకోలేము గానీ....

వేకువ జామునే లేచి

సూర్యకాంతి సోకేలా 

ఆరుబయట నిలచి

ఒళ్ళంతా కదిలేలా 

పదినిమిషాలు నడిచామా

విటమిన్ 'డి' పొందడానికి...


ఒప్పుకోలేము గానీ....

ఉట్టిమీద సద్ది సట్టిలోని 

చల్లపచ్చి ఉల్లిపాయ 

కలుపుకొని తిన్నామా

'ఇమ్యూనిటీ' అభివృద్ధి చెందడానికి...


ఒప్పుకోలేము గానీ...

గోవు పేడ దెచ్చి గొబ్బెమ్మలుబెట్టి

ఇండ్ల ముందు అంతా 

కళ్ళాపి చల్లారా

'శానిటైజర్' అవసరం 

లేకుండా పోవడానికి...


ఒప్పుకోలేము గానీ...

మండువేసవిలోన 

సెలయేటి సెలమల్లో

ఊరిన నీటిని తోడుకొని 

తాగామా

కడుపు చల్లబడి సలవజేయడానికి...


ఒప్పుకోలేము గానీ....

వెన్నెల్లో ఆడినారా 

పందిట్లో పాడినారా

పదిమంది కలసి 

ఒకచోట కూడినారా 

సామాజిక ఐక్యత పెంపొందడానికి.....


ఒప్పుకోలేము గానీ...

నానమ్మ కథలేవి? 

తాతయ్య మాటలేవి? 

బంధాలు పెరిగి 

బంధుత్వం నిలవడానికి...


ఒప్పుకోలేము తప్పుకుంటాము

సాకులెన్నెన్నో వెతుక్కుంటాము       

నిప్పులాంటి నిజాల్ని గుప్పిట దాస్తాము.

కామెంట్‌లు లేవు: