3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*988వ నామ మంత్రము* 3.9.2021


*ఓం అద్భుత చారిత్రాయై నమః*


ఆశ్చర్యకరమైన, అద్భుతమైన చరిత్రలు గలిగిన లలితాంబికకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అద్భుత చారిత్రా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం అద్భుత చారిత్రాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు ఉపాసకులు కీర్తిప్రతిష్టలతో బాటు, భౌతికముగా శాంతిసౌఖ్యములు, పారమార్థికముగా భగవత్ చింతనతో వర్ధిల్లుదురు.


జగన్మాత అద్భుతమైన చరిత్ర గలిగినది. ఆ తల్లి భూకంపము, ఉపద్రవములనుండి అనంతకోటి జీవరాశులను కాపాడియున్నది. *దేవకార్య సముద్యతా* యను లలితా సహస్ర నామావళి యందలి నామ మంత్రమునందు చెప్పినటులు దేవతల కార్యములకై, ధర్మసంస్థాపనార్థము అద్భుతమైన కార్యక్రమములను చేయుటకు మరల మరల జన్మించినది. భండాసురుడు, మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరించుటలో తన రణతంత్ర వ్యూహములను రచించుటలో ఆమెకు ఆమెయే సాటి. ఆ తల్లి విశేషమైన పరాక్రమమును చూపి రాక్షససంహారము చేసినది. తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళసందుల నుండి నారాయణుని పది అవతారములను ఉద్భవింపజేసి దుష్ట శిక్షణకు మరింత దోహద పడినది. సృష్టి, స్థితి, లయ, తిరోదాన, అనుగ్రహములను పంచకృత్యములను నెఱపినది. తారకాసుర సంహారంలో దేవతలకు సరైన మార్గదర్శకత్వము అనుగ్రహించినది. ఈ విధంగా జగన్మాత ఆదిపరాశక్తిగా, పరమేశ్వరిగా ఎన్నో అద్భుత కృత్యములను ఒనర్చినది గనుకనే ఆ తల్లి *అద్భుత చారిత్రా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అద్భుతచారిత్రాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: