3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

సంస్కృత మహాభాగవతం*

 *3.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.17 (పదిహేడవ శ్లోకము)*


*ఏత ఆత్మహనోఽశాంతా అజ్ఞానే జ్ఞానమానినః|*


*సీదంత్యకృతకృత్యా వై కాలధ్వస్తమనోరథాః॥12340॥*


ఇట్టి ఆత్మఘాతకులకు ఎన్నడునూ, ఏమాత్రమూ మనశ్శాంతియే యుండదు. అట్టివారు అజ్ఞానులేయైనను తమను తాము జ్ఞానులునుగా భావించుకొనుచుందురు. వారు పరమాత్మప్రాప్తికై లభించిన అమూల్యమైన ఈ మానరశరీరమును (మానవజన్మను) ఐహిక భోగములయందే వినియోగించుచు వ్యర్థము చేసికొనుచుందురు. అంతేగాక వారి కోర్కెలును తీరవు.


*5.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*హిత్వాత్యాయాసరచితా గృహాపత్యసుహృచ్ఛ్రియః|*


*తమో విశంత్యనిచ్ఛంతో వాసుదేవపరాఙ్ముఖాః॥12341॥*


వీరు భగవంతునియెడల విముఖులై (దైవభక్తి రహితులై) పెక్కు కష్టములకు ఓర్చుకొని సమకూర్చుకొనిన ఇండ్లువాకిండ్లను, భార్యాపుత్రులను, బంధుమిత్రులను, ధనధాన్యాది సంపదలను సైతము విధిలేని పరిస్థితులలో (తమ మనస్సు ఒప్పుకొనకున్నను) వదలిపెట్టయే పోవలసివచ్చును. కడకు వారు నరకముపాలే యగుదురు. రాజా! 'భగవంతుని సేవింపనివారిగతి ఏమగును?' అని నీవడిగిన ప్రశ్నకు నేను ఇట్లు వివరించితిని".


*రాజోవాచ*


*5.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*కస్మిన్ కాలే స భగవాన్ కిం వర్ణః కీదృశో నృభిః|*


*నామ్నా వా కేన విధినా పూజ్యతే తదిహోచ్యతామ్॥12342॥*


*అంతట నిమిమహారాజు ఇట్లు ప్రశ్నించెను* 'యోగిపుంగవులారా! పరమాత్ముడు ఏయేకాలములయందు, ఏయే వర్ణముల, ఆకారములను స్వీకరించు చుండును? మానవులు ఆ స్వామిని ఏ పేర్లతో, ఏయే రీతులలో పూజించుచుందురు? దయతో వివరింపుడు'.


*కరభాజన ఉవాచ*


*5.20 (ఇరువదియవ శ్లోకము)*


*కృతం త్రేతా ద్వాపరం చ కలిరిత్యేషు కేశవః|*


*నానావర్ణాభిధాకారో నానైవ విధినేజ్యతే॥12343॥*


*'కరభాజనుడు' అను తొమ్మిదవ యోగీశ్వరుడు ఇట్లు నుడివెను* "నిమిమహారాజా! కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను నాలుగు యుగములయందును భగవంతుడు పలు వర్ణములు, పెక్కు నామములు (పేర్లు), వివిధములగు ఆకారములు కలిగియుండును. అట్టి ప్రభువును జనులు అనేకవిధములుగా పూజించుచుందురు.


*5.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*కృతే శుక్లశ్చతుర్బాహుర్జటిలో వల్కలాంబరః|*


*కృష్ణాజినోపవీతాక్షాన్ బిభ్రద్దండకమండలూ॥12344॥*


కృతయుగమునందు భగవంతుడు శ్వేతవర్ణముగలిగి చతుర్బాహురూపమున విలసిల్లుచుండును. శిరస్సున జటాజూటముచే ఒప్పుచు, వల్కలములను వస్త్రములుగా దాల్చి, కృష్ణాజినాధారియై విరాజిల్లుచుండును. యజ్ఞోపవీతమును, రుద్రాక్షమాలలను, దండకమండలాదులను ధరించి అలరారుచుండును.


*5.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*మనుష్యాస్తు తదా శాంతా నిర్వైరాః సుహృదః సమాః|*


*యజంతి తపసా దేవం శమేన చ దమేన చ॥12345॥*


ఆ యుగమునందలి మానవులు భగవంతుని ఆరాధించుచు మిగుల శాంతస్వభావము గల్గియుందురు. వారి మధ్య ఎట్టి వైరభావములకును తావుండదు. సకల ప్రాణుల హితము కోరుతూ, సమదృష్టిని కలిగియుందురు. వారు ఇంద్రియ నిగ్రహమును, మనోనిగ్రహమును గలిగి ధ్యానరూప తపస్సుద్వారా పరమాత్మను సేవించుచుందురు.


*5.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*హంసః సుపర్ణో వైకుంఠో ధర్మో యోగేశ్వరోఽమలః|*


*ఈశ్వరః పురుషోఽవ్యక్తః పరమాత్మేతి గీయతే॥12346॥*


ఆ యుగములో హంస, సువర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, యోగేశ్వరుడు, అమలుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్మ - అను నామములతో జనులు ఆ స్వామిని కీర్తించుచుందురు.


*5.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*త్రేతాయాం రక్తవర్ణోఽసౌ చతుర్బాహుస్త్రిమేఖలః|*


*హిరణ్యకేశస్త్రయ్యాత్మా స్రుక్స్రువాద్యుపలక్షణః॥12347॥*


త్రేతాయుగము నందు భగవంతుడు ఎఱుపు వన్నెతో చతుర్బుజుడుగా శోభిల్లుచుండును. కటిభాగము త్రిమేఖలధారియై ఒప్పుచుండును. ఆ స్వామి కేశములు బంగారు వన్నెతో అలరారుచుండును. వేదప్రతిపాదితమైన యజ్ఞరూపమును దాల్చి స్రుక్కు, స్రువము మున్నగు హోమహాధనములతో శోభిల్లుచుండును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: