3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

చాణుక్యుడు అర్థశాస్త్రం

 చాణుక్యుడు అర్థశాస్త్రం వ్రాసాడని 19వ శతాబ్దము దాకా అందరికీ తెలుసు, కానీ ఆ పుస్తకప్రతి ఎవరి వద్దా దొరకలేదట. ఆశ్చర్యంగా ఉంది కదూ!! 


భరధ్వాజముని వైమానిక శాస్త్రం కూడా అంతే. వీటి ప్రస్తావనలు కథలలో పురాణాలలో ఉంటాయేమో కానీ, ఆ పుస్తకాలు ఎక్కడా దొరికేవి కావు. 


అలాగే భోజరాజు వ్రాసిన సమరాంగణ సూత్రధార కూడా దొరకదు. చెప్పుకుంటూ పోతే ఇటువంటి వైజ్ఞానిక గ్రంథాలు ఎన్నో. ఎన్నెన్నో. 


ప్రస్తుతానికి చాణిక్యుని అర్థశాస్త్రం ఎలా దొరికిందో అన్న విషయాన్ని పరిశీలిద్దాము.

అందరూ అర్థశాస్త్రం ఉండేదని చెప్పేవారే కానీ, అందులో ఏముందో తెలిసిన వారు అసలు ఎవరూ 19వ శతాబ్ది నాటిదాకా ఎవరూ లేరట. భరతావని పైన ఇస్లాముక్రైస్తవ మతస్తుల దాడులలో మన ఆర్షవిజ్ఞాన ప్రతులను నాశనం చేయడమే కాదు, అవి నేర్చుకున్నవారిని కూడా చంపేసారు (ఇలా చంపడం, నాశనం చేయడం వంటి దుర్మార్గాలు కేవలం భారతదేశంలోనే కాదు, ఈ దుష్టులు వెళ్ళిన ప్రతి దేశంలోనూ ఇలాగే చేసారు). చివరికి మన ఆర్షవిజ్ఞానం నేర్చుకున్నవారు కూడా అది తమకు తెలుసునని చెప్పుకోవడానికి కూడా జంకే పరిస్థితిని ఏర్పరచారు.


 అలా కాలక్రమేణా హిందువులకి విజ్ఞానమన్నదే లేదని, అలా మనవారి చేతనే నమ్మించారు. హిందువులకు దేవుడి గురించి మూఢనమ్మకాలే తప్ప వారికి విజ్ఞానశాస్త్రాలేవీ తెలియవు అని మనచేతే నమ్మబలికించారు. దానితో ఆర్షవిజ్ఞానాన్ని నేర్చుకున్నవారు, కనీసము వాటి పట్ల ఆసక్తి కనబరచినవారు కూడా కరువైపోయారు ఆరోజుల్లో. 


తరువాత బ్రాహ్మణులు మీ విజ్ఞానాన్ని ఎవరికీ నేర్పలేదు, అందుకే అవి మీకు అందలేదు అని అబద్దాలను కూడా వ్రాయిపించి, మిగితా కులాల వారిని బ్రాహ్మణులపైకి రెచ్చగొట్టి, "డివైడ్ అండ్ రూలు" అన్న కుయుక్తిని ప్రయోగించారు. దీనితో బ్రాహ్మణులపైన కొద్ది పాటి గౌరవమైనా మిగిలి వుంటే, అది కూడా తుడిచి పెట్టుకు పోయింది. ఇదే సమయాన్ని కొంతమంది బ్రాహ్మణకులస్టులు వారికి అనువుగా మార్చుకున్న పరిస్థితులుగూడా అవగతమే.


 ఇంత అకృత్యాలు చేసినా హిందూ ధర్మం ఇంకా నిలబడే ఉంటోందన్న కసితో, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఎందరో బ్రాహ్మణులను ఇస్లాముక్రైస్తవ పాలకులు ఊచకోత కోసి చంపేసారు.(టిప్పు సుల్తాన్ & ఆయన తండ్రి హైదారలి పరిపాలనలో 10000 మంది వేద పండితులు ఊచకోత కోయబడ్డారు).


వారి వైజ్ఞానిక పుస్తకాలను నాశనం చేసారు. అయినా సరే కొందరు బ్రాహ్మణులు ప్రాణాలకు తెగించి, రహస్యంగా వేదవిద్యలను, ఆర్షవిజ్ఞానాన్ని నేర్చుకుని, వాటిని తమలోనే బ్రతికించుకుంటూ వచ్చారు. పైన చెప్పిన అర్థశాస్త్రము, సమరాంగణ సూత్రధార, వైమానిక శాస్త్రము వంటి గ్రంథాలు నేడు మనకు అందుతూ వున్నాయీ అంటే అది వీరి చలువే. వీరి బలిదానము వల్లనే అలనాటి విజ్ఞానము కొంతమటుకు ఐనా ఇంకా దొరుకుతూనే వుంది. వేదాలు కూడా ఇంకా దొరుకుతూ ఉన్నాయి అంటే అవి వీరు మౌఖికముగా తరువాతి తరాలుకు అందించుకుంటూ రావడమే కారణము. 


పుస్తకాలలో కనుక వేదాలను భద్రపరిస్తే అవి ఎప్పుడో తగులబెట్టేసి వుండేవారు ఆ దుర్మార్గమతస్తులు. 

  

బ్రాహ్మణులు తాళపత్రాలపైన ఈ గ్రంథాలను వ్రాసి, దాచి పెట్టుకుని, ఆ తాటాకులు కాలక్రమంలో పాడైపోతూ వుంటే వాటిని తిరిగి మళ్ళీ క్రొత్త తాటాకులపైన వ్రాసి దాచుకునేవారు. తరువాతి తరాలవారు ఇవి తమకు అర్థమయినా కాకపోయినా సరే, వాటిని తిరిగి కొత్త తాటాకులపైన మళ్ళీ వ్రాసి భద్రపరచుకుని భావితరాలకు అందించాలనే నిష్ఠతో జీవించారు. నిజానికి ఇది ఎవరిచేతా గ్రుర్తింపబడని సామాజిక సేవే. ఇలా దాచుకున్నవి కూడా కొన్ని పాశ్చాత్యమతస్తుల చేతుల్లో దొరికి నాశనము చేయబడ్డాయి.


కానీ కాలక్రమంలో మన అదృష్టం బాగుండి, ఒక మంచి బ్రిటీషు అధికారి వచ్చి, తనకు దొరికిన కొన్ని పురాతన తాళపత్రాలని నాశనం చేయకుండా, అవి ఏమిటో అని పరిశీలించడానికి ప్రయత్నించాడట. బ్రిటీషువారిలో కూడా అప్పుడప్పుడు కొందరు మంచి వారు వస్తూవుండేవారు. వారు ఈ తాళపత్రాలని పరిశీలించి అందులో ఏముందో చెప్పమని, రుద్రపట్నం శ్యామాశాస్త్రి అనే ఒక సంస్కృత పండితుడిని నియమించారట. అందులో ఎన్నో పాడైపోయిన తాళపత్రాలు .... ... ఒక్కో తాళపత్రం ఒక్కో గ్రంథంలోనివి, ... ఒక్కో తాళపత్రం ఒక్కోలిపిలో ఉన్నవి, ... కొన్ని మంచి వ్రాతలు, కొన్ని పిచ్చివ్రాతలు, ... .. ఇలా ఇటువంటివన్నీ ముందేసుకుని ఆయన తన పరిశోధనలు సాగిస్తూవుంటే, అనుకోకుండా ఒక అద్భుతం జరిగిందట. 


ఒక అజ్ఞాత బ్రాహ్మణ రైతు తనవద్ద ఒక తాళపత్రాలకట్ట వున్నాయి అని, అవి శ్యామాశాస్త్రికి ఇచ్చాడట. మీరు ఏదోమంచి పని చేస్తున్నారు అని విన్నాను, ఈ తాళపత్రాలు కూడా మీకు పనికొస్తాయేమో చూడండి, అని ఇచ్చి వెళ్ళిపోయాడట ఆ గుర్తు తెలుపని పేద బ్రాహ్మణుడు. తరువాత ఎప్పుడో శ్యామశాస్త్రి ఈ బ్రాహ్మణుడిచ్చిన గ్రంథమేమిటో చూద్దామని చూస్తే, అది గ్రంథాలిపిలో ఉంది అని నిర్థారించాడట, కానీ ఆ గ్రంథాలిపిని చదువలేక పోయాడట.


 ఒక కథనం ప్రకారం అది చదవటానికి కావలసిన జ్ఞానము శ్యామశాస్త్రిగారికి స్వప్నావస్థలో దైవానుగ్రహం వల్ల కలిగిందట. వెంటనే నిద్రలేచి చదవటం మొదలు పెడితే అది మొత్తం చదివేయగలిగాడట. అదే చాణిక్యుని అర్థశాస్త్రంగా ఆయన అప్పుడు గుర్తించాడట. ఇలా ఇది 1905వ సంవత్సరములో అనుకోకుండా జరిగింది. అప్పటినుంచీ అంటే 1905వ సంవత్సరము నుంచీ మళ్ళీ మనకు మన చాణిక్యుని అర్థశాస్త్రం దొరుకుతూ వచ్చింది. ఎప్పటి చాణిక్యుడు,ఎప్పటి అర్థ శాస్త్రము? దాదాపు రెండువేల సంవత్సరాల తరువాత మళ్ళీ పునర్దర్శనం కలిగింది భారతీయులకు.  


అలాగే, 1918–1923 సంవత్సరాల మద్య పండిత్ సుబ్బరాయ శాస్త్రి అనే ఒక పండితుడు, తనకు భరధ్వాజముని స్వప్నంలో దర్శనం కలిగించి, వైమానిక శాస్త్రాన్ని బోధించారని చెప్పాడు. అలా సుబ్బరాయ శాస్త్రి నేర్చుకుని చెబుతుంటే విని, ఆయన శిష్యులు వ్రాసుకున్నదే నేడు మనకు లభించే భరధ్వాజముని విరచిత వైమానిక శాస్త్రము. 


ఇది నమ్మలేని వారికి సుబ్బరాయ శాస్త్రిగారి వంశస్తులు గుప్తంగా అనేక వేల సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు ఒర్చి గుప్తంగా దాచుకుని, మౌఖికముగా వంశపారపర్యముగా అభ్యసించి భద్రపరచి, మనకు అందించిన అసలు విషయమే ఈ భరద్వాజ వైమానిక శాస్త్రము.


 ఏదైతేనేమి 19వ శతాబ్దిదాకా ఈ పుస్తకం కూడా మరుగున పడాల్సివచ్చింది. శాస్త్రిగారి వంటివారి కృపచేత మళ్ళీ మనకు లభించింది.  


అలాగే భోజరాజు వ్రాసిన సమరాంగణ సూత్రధార భారతదేశంలో ఎక్కడా దొరకదు. కానీ అమెరికాలోని వాషింగ్టన్ లైబ్రరిలో ఒక ప్రతి లభ్యమవుతుంది అని వినికిడి. బ్రిటిషువారి ద్వారా వారి కాలంలో ఎలాగో అలాగ అమెరికావారు దీన్ని సంపాదించుకుని వుంటారు. ఈ మన విజ్ఞానం మళ్ళీ మనకెప్పుడు దొరుకుతుందో మరి. దొరికినా వీటిని మన యూనివర్సిటీలు ఎప్పటికి నేర్పుతాయో?? 


మొన్న భారతీయ వైమానికశాస్త్రం గురించి ఒక సైన్సు కాంఫరెన్సులో ఒక మినిస్టరుగారు మాట్లాడినందుకే మన హిందూ వ్యతిరేక మేధవులు సెక్యులరులంతా పిచ్చిగా అరచి గగ్గోలు పెట్టారు. ఆత్మాభిమానమే లేని ఈ కుహనా మేధావులు, ఇది సైన్సు సభా లేక హిందూ సభా అని కాకిగోల చేసారు.


 ఇక ఆర్షవిజ్ఞానాన్ని యూనివర్సిటీల ద్వారా ప్రపంచానికి అందనిస్తారా? వీటిని ప్రాచుర్యం లోకి రానిస్తారా? చూద్దాం.

(శ్రీమాన్ అవధానుల శ్రీనివాస శాస్త్రి గారి సంకలనం నుండి)

కామెంట్‌లు లేవు: