3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీ దత్తాత్రేయ స్వామివారు

 *దండము..కమండలము..పాదుకలు..*


శ్రీ దత్తాత్రేయ స్వామివారు, తమ తపోసాధనలో భాగంగా కొన్నాళ్ల పాటు ఏర్పేడు వ్యాసాశ్రమంలో గడిపారు..(వ్యాసాశ్రమ విశేషాలను ఇంతకు ముందు శ్రీ స్వామివారి చరిత్ర లో చదువుకొని వున్నాము..పాఠకులకు గుర్తువుండి ఉంటుంది..) సాధన చేసే క్రమంలో దండ కమండలాలు చేత బూనడం, పాదుకలు ధరించడం మున్నగు అలవాట్లు శ్రీ స్వామివారికి వ్యాసాశ్రమం లో ఉన్నప్పుడే అలవడ్డాయి..వ్యాసాశ్రమం నుంచి బైటకు వచ్చిన తరువాత..తనతో పాటు దండ కమండలాలు, పాదుకలను కూడా తనతో పాటే తీసుకొని వచ్చారు..


చిత్తూరు జిల్లా పాపానాయుడుపేట లో శ్రీ బాలబ్రహ్మాచారి వద్ద గురుబోధ పొంది, ప్రకాశం జిల్లా లోని పుణ్యక్షేత్రం మాలకొండ లో తపోసాధన కొనసాగించడానికి శ్రీ స్వామివారు నిశ్చయం చేసుకొని..మాలకొండ లో గల శ్రీ పార్వతీదేవి మఠాన్ని తన ఆవాసంగా మలచుకున్నారు..శ్రీ పార్వతీదేవి మఠం పై భాగం లో ఉన్న శివాలయం లో సాధన చేసుకునే వారు..జన సంచారం ఎక్కువగా వున్న సమయాల్లో..శివాలయం కు పై భాగాన ఉన్న గుహల్లో కి వెళ్లిపోయేవారు..మాలకొండ చేరిన తరువాత దండ కమండలాలు మాత్రం తపోసాధనలో వినియోగించారు కానీ..పాదుకలను మాత్రం ధరించేవారు కాదు..వట్టి కాళ్ళతోనే సంచరిస్తూ వుండేవారు..


మొగలిచెర్ల గ్రామం శివార్ల లో ఉన్న ఫకీరు మాన్యం లో ఆశ్రమ నిర్మాణానికి ముందు కొద్దీ రోజుల పాటు శ్రీధరరావు ప్రభావతి గార్ల గృహం లో శ్రీ స్వామివారు వున్నారు.. ఆ సమయం లోనూ పాదుకలను ధరించలేదు..ఆశ్రమ నిర్మాణం జరిగే రోజుల్లోనూ ఆ ప్రదేశమంతా అలానే తిరిగేవారు కానీ..పాదుకలు ధరించలేదు..తనతో తెచ్చుకున్న వస్తువులలో పాదుకలు మాత్రం భద్రంగా ఉంచుకునేవారు..


ఆశ్రమ నిర్మాణం పూర్తయిన పిదప..ఆశ్రమంలో తన తపోసాధన కొనసాగించే రోజుల్లో మళ్లీ ఆ పాదుకలు వాడటం మొదలు పెట్టారు..అప్పటి నుంచీ చివరి వరకూ అంటే..తాను కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందే రోజు దాకా..ఆశ్రమ ప్రాంగణం లో తిరిగినా..లేదా..ఆశ్రమం బైట వ్యాహ్యాళికి వచ్చినా ఖచ్చితంగా పాదుకలు ధరించే వుండేవారు..


మొగలిచెర్ల గ్రామానికి చెందిన శ్రీ తాళ్ళూరి నరసింహారావు అనే భక్తుడు, శ్రీ స్వామివారికి వెండి పూతతో చేసిన పాదుకలు బహూకరించి, వాటిని ధరించమని ప్రాధేయపడ్డారు..శ్రీ స్వామివారు నవ్వి..ఆ భక్తుడి తృప్తి కోసం ఒక్కసారి తన కాళ్లకు ధరించి.."ఇవి బాగా బరువుగా ఉన్నాయి నాయనా!.." అని చెప్పి ప్రక్కన పెట్టేసారు..ఆ వెండి పూతతో ఉన్న పాదుకలను ఆశ్రమం లోనే వుంచమని చెప్పి, నరసింహారావు వెళ్లిపోయారు..ప్రస్తుతం పల్లకీ సేవలో ఆ పాదుకులనే శ్రీ స్వామివారి విగ్రహం తో పాటు ఊరేగిస్తున్నాము..ఒక్కసారి శ్రీ స్వామివారి పదస్పర్శ తగిలిన ఆ పాదుకులకు చిరస్థాయిగా పల్లకీ సేవలో ఊరేగే భాగ్యం కలిగింది!..


వ్యాసాశ్రమం వీడిన రోజునుంచీ..మళ్లీ మొగలిచెర్ల లో తాను నిర్మించుకున్న ఆశ్రమం లో చేరేదాకా పాదుకలను ఎందుకు వాడకుండా ఉన్నారో ఇప్పటికీ అంతుచిక్కని విషయం..


శ్రీ స్వామివారు వాడుకున్న దండము, కమండలము, పాదుకలు..భద్రంగా శ్రీ స్వామివారి సమాధి వద్ద భద్రపరచబడి ఉన్నాయి..ఒక మహనీయుడి తపోసాధనకు ఉపయోగపడిన ఆ వస్తువులు.. అత్యంత పవిత్రమైనవిగా మేము భావిస్తాము..శ్రీ స్వామివారి సమాధిని దర్శించే భక్తులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్లకద్దుకుంటారు..తమ తమ కోర్కెలు నెరవేరాలని ఆ పాదుకలకు శిరస్సు ఆనించి మ్రొక్కుకుంటారు..


ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఈ వస్తువుల భద్రత గురించి ఆలోచించాల్సి వస్తోంది..ఎందుకంటే కొన్ని తరాలపాటు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉన్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం...ప్రకాశం జిల్లా.. పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: