*2.09.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*
*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*రాజోవాచ*
*5.1 (ప్రథమ శ్లోకము)*
*భగవంతం హరిం ప్రాయో న భజంత్యాత్మవిత్తమాః|*
*తేషామశాంతకామానాం కా నిష్ఠావిజితాత్మనామ్॥12324॥*
*నిమి మహారాజు ఇట్లనెను* యోగిపుంగవులారా! మీరు ఆత్మజ్ఞానసంపన్నులు, భగవద్భక్తులలో శ్రేష్ఠులు. కొందరు జితేంద్రియులు కానివారు భోగలాలసులై, చిత్తశాంతి కరవై భగవత్సేవకు దూరమగుదురు. వారిగతి ఎట్టిది?
*చమస ఉవాచ*
*5.2 (రెండవ శ్లోకము)*
*ముఖబాహూరుపాదేభ్యః పురుషస్యాశ్రమైః సహ|*
*చత్వారో జజ్ఞిరే వర్ణా గుణైర్విప్రాదయః పృథక్॥12325॥*
*అప్పుడు తొమ్మండుగురులో ఒకడైన 'చమనుడు' అను పేరుగల యోగిపుంగవుడు ఇట్లు నుడివెను* "మహారాజా! విరాట్ పురుషుడైన పరమాత్మయొక్క ముఖము నుండి సత్త్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులు, బాహువులు నుండి సత్త్వరజో గుణమిశ్రిత స్వభావులైన క్షత్రియులు, ఊరువులనుండి రజస్తమోమిశ్రిత స్వభావము గల వైశ్యులు, పాదములనుండి తమోగుణ ప్రధానులైస శూద్రులు - అను నాలుగు వర్ణములవారు జన్మించిరి. వారితోపాటు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసాశ్రమములు ఏర్పడినవి.
*5.3 (మూడవ శ్లోకము)*
*య ఏషాం పురుషం సాక్షాదాత్మప్రభవమీశ్వరమ్|*
*న భజంత్యవజానంతి స్థానాద్భ్రష్టాః పతంత్యధః॥12326॥*
ఈ నాలుగు వర్ణములవారిలో తమ జన్మలకు కారణమైస పరమపురుషుని భజింపక, ఆ స్వామిపై అనాదరభావమును కలిగియుండువారు తమ తమ స్థానములనుండి భ్రష్టులగుదురు. పతితులై అథోగతి పాలగుదురు.
*5.4 (నాలుగవ శ్లోకము)*
*దూరే హరికథాః కేచిద్దూరే చాచ్యుతకీర్తనాః|*
*స్త్రియః శూద్రాదయశ్చైవ తేఽనుకంప్యా భవాదృశామ్॥12327॥*
నిమిమహారాజా! స్త్రీలు, శూద్రులు భగవంతుని గాథలను, నామకీర్తనమునకు దూరమైనారు. వారందరు మీవంటి భాగవతోత్తముల దయకు పాత్రులు. కావున, మీవంటివారు వారికి భగవత్కథామృతమును వినుటకు, నామగుణాదులను కీర్తించుటకు తగిన సౌకర్యమును కలిగించి, వారిని ఉద్ధరింపవలెను.
*మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః|*
*స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేఽపి యాంతి పరాం గతిమ్॥*
ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును నన్నే శరణుపొంది పరమగతినే పొందుదురు. (గీత 9/32)
*5.5 (ఐదవ శ్లోకము)*
*విప్రో రాజన్యవైశ్యౌ చ హరేః ప్రాప్తాః పదాంతికమ్|*
*శ్రౌతేన జన్మనాఽథాపి ముహ్యంత్యామ్నాయవాదినః॥12328॥*
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ద్విజులగుటవలన వేదాధ్యయనాది సంస్కారములకు అర్హులు. తద్ద్వారా వారు భగవత్సన్నిధికి చేరుటకు యోగ్యులే. అట్టి సదవకాశమును కలిగియున్నప్పటికిని వారు వేదములలో తెలుపబడిన కామ్యకర్మలకును, వాటియొక్క తాత్కాలిక ఫలములకును ఆకర్షితులై, వాటి మోహములోబడి భగవత్సేవలకు దూరమగుదురు.
*5.6 (ఆరవ శ్లోకము)*
*కర్మణ్యకోవిదాః స్తబ్ధా మూర్ఖాః పండితమానినః|*
*వదంతి చాటుకాన్ మూఢా యయా మాధ్వ్యా గిరోత్సుకాః॥12329॥*
ముక్తిసాధన మార్గములను ఎఱుగనివారు, జ్ఞానులయెడ నమ్రతలేనివారు, తాము సర్వజ్ఞులమని మిడిసిపడుచుండు వారు మూర్ఖులు. అట్టి మూఢులు వినుటకు ఇంపైన మాటలకు ఉత్సుకత చూపుచు స్వర్గసుఖములకు సంబంధించిన మధుర వచనములను పలుకుచుందురు. వాటిని విని అజ్ఞానులు మోహములో పడుచుందురు.
*5.7 (ఏడవ శ్లోకము)*
*రజసా ఘోరసంకల్పాః కాముకా అహిమన్యవః|*
*దాంభికా మానినః పాపా విహసంత్యచ్యుతప్రియాన్॥12330॥*
ఇట్టి మూర్ఖులు, రజోగుణ ప్రభావముచే, అభిచార హోమములకు సంకల్పము చేయుచుందురు. వారి కోరికలకు అంతేయుండదు. వారు క్రోధస్వభావము గలవారు, దురహంకారులు, డంబాచారముగలవారు, పాపాత్ములు. అట్టివారు భగవద్భక్తులనుగూర్చి పరిహాసోక్తులను పలుకుచుందురు.
*5.8 (ఎనిమిదవ శ్లోకము)*
*వదంతి తేఽన్యోన్యముపాసితస్త్రియో గృహేషు మైథున్యపరేషు చాశిషః|*
*యజంత్యసృష్టాన్నవిధానదక్షిణం వృత్త్యై పరం ఘ్నంతి పశూనతద్విదః॥12331॥*
వారు స్త్రీలోలురై, పరస్పరము సాంసారిక విషయ చర్చలలో మునిగి సమయమును వ్యర్థముగా గడుపుచుందురు. స్త్రీ సాహచర్యమువలననే అత్యంత సుఖములు లభించు చుండునని భావించుచుందురు. అట్టి అజ్ఞానులు అన్నదానములు, దక్షిణలులేని యజ్ఞములను అవిధిపూర్వకముగా (శాస్త్రవిరుద్ధముగా) ఆచరించుచుందురు. తమ జీవనోపాధికొరకై యజ్ఞములను నిర్వహించు నెపముతో పశుహింసకు పాల్పడుచు పాపములను మూటగట్టుకొనుచుందురు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి