2, సెప్టెంబర్ 2021, గురువారం

ఈశ్వరుడు సాక్షి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*ఈశ్వరుడు సాక్షి ...🙏🙏🙏* 


అంతా ఈశ్వరేచ్ఛ అని అంటూ ఉంటాం అంటే... "ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు.

ఈశ్వరుడు నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది... అది "ఈశ్వరేచ్ఛ".


🌷ఎవరు ఏ కర్మ చేస్తే వారికి ఆ ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం. ఈ కర్మకి ఇది ఫలితం వస్తుంది అని నిర్దేశించాడు... అది వస్తున్నది.


🌷ఎప్పుడూ కూడా ప్రతి మనిషికీ ఒక సంఘటనలో తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. భక్తుడే కావచ్చు , జ్ఞాని కావచ్చు , యోగి కూడా కావచ్చు.. తన అంతస్థును పరిథిని మాత్రం అతిక్రమించకూడదు.

(ఇక్కడ అంతస్థు అంటే ధనం, ఐశ్వర్య రూపం లోది కాదు)


🌷ఉద్యోగం చేస్తున్నాం, మనతో కలిసి పని చేసే వ్యక్తిని తక్కువగా చూడడం ధర్మమేనా? 

అవతల వ్యక్తి సేవకా వృత్తిలో ఉంటే మాత్రం అలా చేయవచ్చా.? ఒకరు సేవ్యుడు.. ఒకరు సేవకుడు... అంతవరకే... ఆ హద్దు మీరరాదు. 


🌷ఏ అంతస్థులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్ని దాటిన, అతిక్రమించిన దోషం కలుగుతుంది.


🌷 శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు.. మానవుడుగా జీవించాడు. యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే, ఆ "ఈశ్వర" అంశ అని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా... లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడు గానే ఉన్నాడు.. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిథి దాటలేదు. తన అంతస్థు పరిథి అతిక్రమించలేదు.


🌷అలానే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో తెలియవచ్చేలా చేసాడు. భీష్ముడు దైవీ శక్తులు కలవాడు. దైవాంశ సంభూతుడు. వసువులలో ఒకడు.

కురుక్షేత్రం లో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళు మరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు.


🌷భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీ శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆయుధం పట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు. భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు.


🌷సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిథిని మీరలేదు... గీతలో "నీ కర్తవ్యం యుద్ధం చేయడం.. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం , ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప.., ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతా" అని చెప్పలేదు.


🌷నువ్వు చేయవలసింది, నీ అంతస్థులో నీ పరిథిలో చేయమని చెప్పాడు. "ధర్మం పాటించమన్నాడు" అంతే. "కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు".. ఈ కర్మకు ఈ ఫలితం అని నిర్దేశించాడు.


🌷కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు... "నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు, నువ్వు యుద్ధం చేయబోతున్నావు. .

మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు.. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడు తప్ప... "నేను మీకిచ్చేస్తున్నాను" అని చెప్పలేదు

అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు.. అలా చేయలేదు. 


🌷అంటే... మనం చేసే కర్మలకు ఫలితం మనకు వస్తుంది. అదే ఈశ్వరేచ్ఛ"..

            

ఈశ్వరం శరణం యామి

 క్రోధమోహాదిపీడితః | 

 అనాథం పతితం దీనం

పాహిమాం పరమేశ్వరః ...

కామెంట్‌లు లేవు: