*18.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*
*పరమాత్ముని విభూతుల వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*16.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*గత్యుక్త్యుత్సర్గోపాదానమానందస్పర్శలక్షణమ్|*
*ఆస్వాదశ్రుత్యవఘ్రాణమహం సర్వేంద్రియేంద్రియమ్॥12846॥*
*16.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిరహం మహాన్|*
*వికారః పురుషోఽవ్యక్తం రజః సత్త్వం తమః పరమ్॥12847॥*
*16.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*అహమేతత్ప్రసంఖ్యానం జ్ఞానం తత్త్వవినిశ్చయః|*
*మయేశ్వరేణ జీవేన గుణేన గుణినా వినా|*
*సర్వాత్మనాపి సర్వేణ న భావో విద్యతే క్వచిత్॥12848॥*
పాదములయందు చలనశక్తి, వాక్కునందు భాషణశక్తి, పాయువునందలి మలవిసర్జనశక్తి, హస్తములయందలి గ్రహించుశక్తి, జననేంద్రియములయొక్కఆనందోపభోగశక్తి - ఈ విధమగు కర్మేంద్రియములకుగల శక్తులన్నియును నేనే! చర్మము యొక్క స్పర్శశక్తి, నేత్రములయొక్క దర్శనశక్తి, నాలుకయొక్క ఆస్వాదనశక్తి, చెవులయొక్క శ్రవణశక్తి, నాసికయొక్క ఆఘ్రాణశక్తి, అనగా సకల జ్ఞానేంద్రియ శక్తులు నేనే. పృథివి, వాయువు, ఆకాశము, జలము, తేజస్సుల తన్మాత్ర శక్తులు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములును) నేనే. అహంకారము, మహత్తత్త్వము, జీవుడు, మూలప్రకృతి, సత్త్వరజస్తమో గుణముల వికారములు నేనే. అంతేగాదు వీటి యన్నింటికిని అతీతమైన పరబ్రహ్మమును నేనే. ఈ తత్త్వములయొక్క గణనము, లక్షణములద్వారా వాటి జ్ఞానము, అట్లే తత్త్వజ్ఞానరూపములైన వాటి ఫలములుగూడ నేనే. నేనే ఈశ్వరుడను, జీవుడను, సత్త్వాది గుణములను, ఆ గుణములకు ఆశ్రయుడను. సమిష్టి, వ్యష్టి రూపముల సకల కార్యములకును నేనే ఆధారము. నేను లేకుండా ఏ పదార్థమునకును ఉనికియే లేదు. ఇంతయేల? చిదచిదాత్మకమైన సమస్త జగత్తునకును నేనే ఆధారము.
*16.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*సంఖ్యానం పరమాణూనాం కాలేన క్రియతే మయా|*
*న తథా మే విభూతీనాం సృజతోఽణ్డాని కోటిశః॥12849॥*
వివిధముగనైన పరమాణువులయొక్క సంఖ్యను గణింపవచ్చునేమోగాని, నా విభూతులను లెక్కించుట ఎట్లు వీలగును?
*16.40 (నలుబదియవ శ్లోకము)*
*తేజః శ్రీః కీర్తిరైశ్వర్యం హ్రీస్త్యాగః సౌభగం భగః|*
*వీర్యం తితిక్షా విజ్ఞానం యత్ర యత్ర స మేంఽశకః॥12850॥*
ఈ జగత్తునగల వర్చస్సు, కాంతి, కీర్తి, సంపదలు, లజ్జ, త్యాగము, సౌందర్యము, భాగ్యము, పరాక్రమము, క్షమ, విజ్ఞానము మొదలగు శ్రేష్ఠములగు గుణములు అన్నియును నా అంశలే.
*16.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*ఏతాస్తే కీర్తితాః సర్వాః సంక్షేపేణ విభూతయః|*
*మనోవికారా ఏవైతే యథా వాచాభిధీయతే॥12851॥*
ఉద్ధవా! నీ ప్రశ్నకు సమాధానముగా నా విభూతులను సంక్షిప్తముగా వర్ణించితిని. ఇవి అన్నియును పరమార్థ వస్తువులు కావు. కేవలము మనోవికారములే. ఏలయన మనస్సుచే ఆలోచింపబడుననియు, వాక్కుద్వారా చెప్పబడునది ఏదియును పరమార్థము (వాస్తవము)గాదు. అవి అన్నియును కల్పనలే.
*16.42 (నలుబది రెండవ శ్లోకము)*
*వాచం యచ్ఛ మనో యచ్ఛ ప్రాణాన్ యచ్ఛేద్రియాణి చ|*
*ఆత్మానమాత్మనా యచ్ఛ న భూయః కల్పసేఽధ్వనే॥12852॥*
కావున వాక్కును వశమునందుంచు కొనుము. మనస్సు యొక్క సంకల్పవికల్పములను నిరోధింపుము. ప్రాణములను అదుపులో నుంచుకొనుము. ఇంద్రియములను జయింపుము. సాత్త్వికబుద్ధి ద్వారా ప్రపంచాభిముఖమైన బుద్ధిని శాంతపరచుము. అప్పుడు దుఃఖభూయిష్టమైన ఈ జననమరణ చక్రమునుండి విముక్తు డవు కాగలవు.
*16.43 (నలుబది మూడవ శ్లోకము)*
*యో వై వాఙ్మనసీ సంయగసంయచ్ఛన్ ధియా యతిః|*
.
*తస్య వ్రతం తపో దానం స్రవత్యామఘటాంబువత్॥12853॥*
సాధకుడు బుద్ధిద్వారా తన వాక్కును, మనస్సును పూర్తిగా వశపరచుకొననిచో, అతని వ్రతములు, తపస్సులు, దానములు మున్నగునవి అన్నియును పచ్చికుండలోని నీరు కారిపోయినట్లుగా వ్యర్థమగును.
*16.44 (నలుబది నాలుగవ శ్లోకము)*
*తస్మాద్వచో మనః ప్రాణాన్ నియచ్ఛేన్మత్పరాయణః|*
*మద్భక్తియుక్తయా బుద్ధ్యా తతః పరిసమాప్యతే॥12854॥*
ఉద్ధవా! అందువలన నా భక్తుడు నన్నే సర్వస్వముగా భావించి భక్తియుక్తమైన బుద్ధిద్వారా వాక్కును, మనస్సును, ప్రాణములను నియంత్రించవలెను. అట్లు చేసినచో, మోక్షప్రాప్తికై అతడు చేయవలసినది ఏమియు మిగిలియుండదు. అనగా అన్నివిధములుగా అతడు కృతార్థుడైనట్లే.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే షోడశోఽధ్యాయః (16)*
ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *పరమాత్ముని విభూతుల వర్ణనము* అను పదహారవ అధ్యాయము (16)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి