*18.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*
*పరమాత్ముని విభూతుల వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*16.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*ధర్మాణామస్మి సన్న్యాసః క్షేమాణామబహిర్మతిః|*
*గుహ్యానాం సూనృతం మౌనం మిథునానామజస్త్వహమ్॥12836॥*
*16.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*సంవత్సరోఽస్మ్యనిమిషాం ఋతూనాం మధుమాధవౌ|*
*మాసానాం మార్గశీర్షోఽహం నక్షత్రాణాం తథాభిజిత్॥12837॥*
అలౌకిక శ్రేయస్సాధన ధర్మములలో నేను సన్న్యాసధర్మమును. భయరాహిత్యమును గలిగించునట్టి (నిర్మయత్వమును గూర్చునట్టి) ప్రత్యగాత్మ స్వరూపాను సంధానమును నేను. గుహ్యముగా (గోప్యముగా) ఉంచదగిన విషయములలో ప్రియవచనమును, మౌనమును నేను. స్త్రీ, పురుషులలో ఉత్పత్తికి కారణమైన బ్రహ్మను నేను. సర్వదా అప్రమత్తముగా నుండునట్టి సంవత్సరరూపమైన కాలమును నేను. ఋతువులలో వసంతఋతువును. మాసములలో మార్గశిరమాసమును. నక్షత్రములలో అభిజిత్తును నేను.
*16.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*అహం యుగానాం చ కృతం ధీరాణాం దేవలోఽసితః|*
*ద్వైపాయనోఽస్మి వ్యాసానాం కవీనాం కావ్య ఆత్మవాన్॥12838॥*
యుగములలో కృతయుగమును నేను. సుఖదుఃఖాది ద్వంద్వములను సహించువారిలో నేను దేవలుడను, అసితుడను. వేదవిభాగకర్తలలో పరాశరుని కుమారుడగు వ్యాసుడను నేను. దీర్ఘదర్శనులలో సూక్ష్మబుద్ధిగల శుక్రాచార్యుడను నేను.
*16.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*వాసుదేవో భగవతాం త్వం తు భాగవతేష్వహమ్|*
*కింపురుషాణాం హనుమాన్ విద్యాధ్రాణాం సుదర్శనః॥12839॥*
షడ్గుణైశ్వర్యసంపన్నులలో వాసుదేవుడను నేను. భాగవతోత్తములలో నీవే (ఉద్ధవుడను) నేను. కింపురుషులలో హనుమంతుడను. విద్యాధరులలో సుదర్శనుడను నేనే.
*16.30 (ముప్పదియవ శ్లోకము)*
*రత్నానాం పద్మరాగోఽస్మి పద్మకోశః సుపేశసామ్|*
*కుశోఽస్మి దర్భజాతీనాం గవ్యమాజ్యం హవిఃష్వహమ్॥12840॥*
*16.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*వ్యవసాయినామహం లక్ష్మీః కితవానాం ఛలగ్రహః|*
*తితిక్షాస్మి తితిక్షూణాం సత్త్వం సత్త్వవతామహమ్॥12841॥*
రత్నములలో నేను పద్మరాగమును. సుందరమైన వస్తువులలో నేను పద్మపుమొగ్గను. తృణములలో (దర్భలలో) నేను కుశమును. పురోడాశాది హోమద్రవ్యములలో ఆవునేతిని (గోఘృతమును) నేను. ధనార్జనశీలులలో నేను లక్ష్మీస్వరూపుడను. వంచకులలో జూదమును నేను. సహనమూర్తులలో సహనస్వభావమును నేను. సాత్త్వికపురుషులలో నేను సత్త్వగుణమును.
*16.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*ఓజః సహో బలవతాం కర్మాహం విద్ధి సాత్వతామ్|*
*సాత్వతాం నవమూర్తీనామాదిమూర్తిరహం పరా॥12842॥*
*16.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*విశ్వావసుః పూర్వచిత్తిర్గంధర్వాప్సరసామహమ్|*
*భూధరాణామహం స్థైర్యం గంధమాత్రమహం భువః॥12843॥*
శక్తిశాలులలో నేను ఇంద్రియ పటుత్వమును. ఓర్పుగలవారిలో ధారణ సామర్థ్యమును నేను. బలవంతులలో బలమును నేను. భగవద్భక్తులలోని భక్తిభరిత నిష్కామకర్మను నేను. శ్రీమహావిష్ణువుయొక్క అవతారములగు భాగవతోత్తములకు పూజ్యములైన వాసుదేవ, సంరక్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, హయగ్రీవ, వరాహ, నృసింహ, బ్రహ్మ అను నవమూర్తులలో ఆద్యుడు, శ్రేష్ఠుడు ఐన వాసుదేవుడను నేను. గంధర్వులలో నేను విశ్వావసువును. బ్రహ్మసభలలోని అప్సరసలలో నేను పూర్వచిత్తిని. పర్వతములలో నేను స్థిరత్వమును. పృథ్వియందు గంధతన్మాత్రను.
*16.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*అపాం రసశ్చ పరమస్తేజిష్ఠానాం విభావసుః|*
*ప్రభా సూర్యేందుతారాణాం శబ్దోఽహం నభసః పరః॥12844॥*
జలములలో నేను రసతన్మాత్రను. తేజశ్శాలురలో నేను అగ్నిని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో నేను కాంతిని. ఆకాశమునందలి శబ్దతన్మాత్రను నేనే.
*16.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*బ్రహ్మణ్యానాం బలిరహం వీరాణామహమర్జునః|*
*భూతానాం స్థితిరుత్పత్తిరహం వై ప్రతిసంక్రమః॥12845॥*
బ్రాహ్మణ భక్తులలో నేను బలిచక్రవర్తిని. వీరులలో నేను అర్జునుడను. ప్రాణులయొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు నేనే ఆధారము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి