18, అక్టోబర్ 2021, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మార్పు తెచ్చిన మూడురోజులు..*


అతని ముఖంలో దైన్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది..మనిషి తీవ్రమైన నిరాశ లో కూరుకుపోయినట్లు తోస్తున్నది..మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి ఉత్తరం వైపు ఉన్న అరుగు మీద దాదాపు ఐదారు గంటల నుంచీ కూర్చుని..తనలో తానే కుమిలిపోతున్నాడు..ఆరోజు గురువారం..శ్రీ స్వామివారి మందిరం వద్ద మండల దీక్ష లో ఉన్న భక్తులూ మరి కొద్దిమంది ఇతరులూ తప్ప, పెద్దగా సంచారం లేదు..అరుగు మీద కూర్చుని ఉన్న ఆ మనిషి ఉదయం మొదటి బస్ లో శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చి..కనీసం మందిరం లోపలికి వచ్చి దర్శనం కూడా చేసుకోకుండా..బైట వైపే ఉన్న అరుగు వద్ద కూర్చుండిపోయాడు..


సాయంత్రం నాలుగు గంటల వేళ.."అయ్యా..ఉదయం నుంచీ ఒకాయన వచ్చి..అరుగు మీద కూర్చుని ఉన్నాడు..లోపలికి రాలేదు..మధ్యాహ్నం భోజనం చేసినట్టు లేడు.." అని మా సిబ్బంది నాకు చెప్పారు..పిలుచుకుని రమ్మన్నాను..మా వాళ్ళు వెళ్లి అతనిని లోపలికి రమ్మని చెప్పారు..వచ్చాడు..నా వద్దకు రాగానే..కూర్చోమని చెప్పి.."మీ పేరేమిటి?..ఎక్కడనుండి వచ్చారు?.." అన్నాను..


కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ వున్నాడు..తరువాత..

"నా పేరు శ్రీమన్నారాయణ..ఈ క్షేత్రం గురించి విని..ఇక్కడికి వచ్చాను.." అన్నాడు..


"మరి స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారా?.." అన్నాను..


"లేదు.." అన్నాడు..


అతను నాతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడటం లేదని నాకు అర్ధం అయింది..ముక్తసరిగా సమాధానం చెపుతున్నాడు..

కొంచెం సేపు మౌనంగా వుండి.."మీతో కొంచెం విడిగా మాట్లాడాలి.." అన్నాడు..


ప్రక్కనే ఉన్న గది లోకి తీసుకెళ్ళాను..

అక్కడ కుర్చీ లో కూర్చోగానే..ముఖాన్ని చేతులతో కప్పుకొని..ఏడవసాగాడు.. కొద్దిసేపటికి కోలుకుని..


"నేను అన్ని విధాలా నష్టపోయానండీ..ఆర్థికంగా చితికి పోయాను..కుటుంబాన్ని పోషించడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నాను..ఈ క్షేత్రం మారుమూల ప్రాంతం లో ఉందని తెలిసి..ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను..ఎవ్వరికీ తెలీకుండా ఉంటుందని ఈ ఆలోచన చేసాను..కానీ ఈ ఉదయం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచీ..నాకు ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన తప్పని అనిపిస్తోంది..ఏదో తెలీని శక్తి నన్ను ఆపుతున్నట్లు గా ఉంది..బ్రతికి వుంటే..నా సమస్యలు ఎదుర్కోలేనేమో అనే భావన.. చచ్చిపోతే ఏమి సాధిస్తాను అనే ఆలోచన..ఎటూ తేల్చుకోలేక పోతున్నాను.." అన్నాడు..


ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని..అది పిచ్చి ఆలోచన అనీ..మరెన్నడూ అటువంటి ఊహే రానీయొద్దనీ..బాగా అనునయంగా చెప్పి..ఒక మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడే వుండి.. శ్రీ స్వామివారి ని శరణు వేడమని చెప్పాను..అంతకంటే నాకు పరిష్కారం కనబడలేదు..సరే అని తలూపాడు..బైటకు వెళ్ళిపోయాడు..


అతను మందిరం వద్ద ఉన్నన్ని రోజులూ రెండుపూటలా ఆహారం పెట్టమని మా సిబ్బందికి చెప్పాను..గది లో ఉండటానికి ఇష్టపడలేదు..ఆరుబయట వుంటాననీ..అంతగా ఇబ్బందిగా ఉంటే మంటపంలో ఉంటానని చెప్పాడు..సరే అన్నాను.


ఆ సాయంత్రమే బావి వద్దకు వెళ్లి స్నానం చేసి..శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసాడు..ఆ ప్రక్కరోజు కూడా రెండు పూటలా ప్రదక్షిణాలు చేసాడు..శనివారం సాయంత్రానికి అతని ముఖం లో చాలా మార్పు వచ్చింది..ఇంతకు ముందున్న దైన్యం లేదు..పైగా ముఖంలో ఏదో తెలీని ఆనందం కనబడుతున్నది..మా సిబ్బందిని నవ్వుతూ పలకరించుకున్నాడు..ఆరోజు పల్లకీ సేవలో పాల్గొని..పల్లకీ మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యేదాకా తానే మోశాడు.. 


ఆదివారం ఉదయానికి అతని భార్యా..పిల్లలూ మందిరానికి వచ్చారు..అతనే వాళ్లకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు.. వాళ్ళు వచ్చిన తరువాత..అందరూ కలిసి..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చారు..నేరుగా నా దగ్గరకు వచ్చి..


"చాలా చెడ్డ ఆలోచన చేసి..ఇక్కడకు వచ్చానండీ..కానీ శ్రీ స్వామివారి వద్ద ప్రదక్షిణాలు చేసి..దర్శనం చేసుకున్న తరువాత..నాకు ధైర్యం వచ్చిందండీ..స్వామివారు సాక్షాత్తూ నా వెనకే నిలబడి ఉన్నట్లు తోచింది..ఈ మూడు రోజుల్లోనే..నాకు చాలా మార్పు కనబడింది..అప్పుల వాళ్ళు ఇంకొన్నాళ్లు నాకు సమయం ఇచ్చారు..స్థిరాస్తి లో నేను చాలా డబ్బు పెట్టాను..ఆ స్థలాలు అమ్ముడుపోక..డబ్బులన్నీ ఇరుక్కుపోయి వున్నాను.. నిన్ననే ఆ స్థలాలు కొంటామని బేరం వచ్చింది..నన్ను రేపు రమ్మన్నారు..ఇది నేను ఊహించలేదు..అందుకే మా వాళ్లకు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి..పిలిపించుకున్నాను..వాళ్ళూ నా గురించి ఆందోళన చెంది వున్నారు..ఇప్పుడు సంతోషంగా ఉంది..ధైర్యం వచ్చింది..నా కుటుంబం నాకు అండగా ఉంది.. శ్రీ స్వామివారు నా బ్రతుక్కు ఒక దారి చూపారు..సాక్షాత్తూ ఆయనే నా వెనకే వుండి, ఈ మార్పు తీసుకొచ్చారు..నా ఆర్ధిక పరిస్థితి ఇంకొద్దిగా బాగు పడగానే..ఇక్కడకు మళ్లీ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని..మొక్కు చెల్లించుకుంటాను.." అన్నాడు..


మూడు రోజుల్లో ఎంత తేడా?..అనుకున్నాను..


మూడురోజుల క్రిందట ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనతో వచ్చిన ఆ మనిషిలో మార్పు తెచ్చి..ఆ కుటుంబాన్ని ఆదుకున్న శ్రీ స్వామివారు మాత్రం మౌనంగా సమాధిలోనే నిశ్చలంగా వున్నారు..


(ఈ అనుభవం ఇంతకుముందు పోస్ట్ చేసివున్నాను..పోయిన సంవత్సరం దత్తదీక్షా కాలంలో దీక్ష స్వీకరించిన స్వాములకు ఒకరోజు అన్నదానానికి అయ్యే వ్యయాన్ని ఈ భక్తుడే భరించాడు.."ఆరోజు స్వామివారు నాకిచ్చిన ధైర్యం తో ఈనాడు తానూ, తన కుటుంబము లక్షణంగా ఉన్నామనీ..త్వరలో తన కుటుంబం తోసహా శ్రీ స్వామివారి దర్శనానికి వస్తామనీ.." చెప్పాడు..).


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: