18, అక్టోబర్ 2021, సోమవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*461వ నామ మంత్రము* 18.10.2021


*ఓం సుభ్రువే నమః* 


మంగళకరమైన మరియు సుందరమైన కనుబొమలతో భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సుభ్రూః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం సుభ్రువే నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి మంగళకరము, సుభప్రదమైన జీవనమును ప్రసాదించి శాంతిసౌఖ్యములు, ధనకనక వస్తువాహన సమృద్ధి, కీర్తి ప్రతిష్టలు లభించినవారిగా కరుణించును.


శ్రీమాత కనుబొమలు చక్కగా, మంగళకరముగా, అత్యంత సుందరమైన కనుబొమలు గలిగినదిగా భాసిల్లుచున్నది. మన్మథుని మాంగల్య గృహమును బోలిన వదనానికి, గృహతోరణాల మాదిరిగా ప్రకాశిస్తున్న కనుబొమలు గలిగినది *(వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా)* యని లలితా సహస్ర నామావళి యందు పదిహేడవ నామ మంత్రంలో అమ్మవారు కీర్తింపబడినది. ఇదే విషయాన్ని శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో నలుబది ఏడవ శ్లోకంలో ఇలా అన్నారు:-


*భ్రువౌ భుగ్నే కించి - ద్భువనభయభజ్గవ్యసనిని*

*త్వదీయే నేత్రాభ్యాం - మధుకరరుచిభ్యాం ధృతగుణమ్‌, |*

*ధను ర్మన్యే సవ్యే - తరకరగృహీతం రతిపతేః*

*ప్రకోష్ఠే ముష్టౌచ - స్థగయతి నిగూఢాంతర ముమే‌||47 ||*

 

దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి. 

 

పరమేశ్వరీ! సమస్త భువనమల యొక్క భయమును పోగొట్టు మాతా! నీ కనుబొమలను వాటి క్రింద ఉన్న కనులను కలిపి మన్మధుడు చేబూనిన కోదండంగా భావించుచున్నాను. ఎందుచేతననగా కొంచెం వంగి ఉండి తుమ్మెదల వరుస వలె నీలిరంగు తో ప్రకాశిస్తున్న నీ కనుబొమలు కోదండంలా (వింటి కర్రలా), వాటి క్రింద సౌందర్యవంతముగా, కాంతియుతమైన నీ కన్నులు ఆ వింటినారి లా (అల్లెత్రాడులా), ఆ కనుబొమల మధ్య ప్రదేశం (అచట కనుబొమలు లేకుండా ఖాళీగా ఉండుట) మన్మధుడు ఆ కోదండాన్ని తన ఎడమచేత్తో పట్టుకొనుటవలన ఆ ప్రదేశం కప్పబడినట్లుగా ఈ రీతిన నీ కనుబొమలను, కన్నులనూ కలిపి మన్మధుడు చేత పట్టిన ధనుస్సుగా భావించుచున్నాను. 

 

అమ్మా జగన్మాతా! ఉమాదేవీ! సకల భువనాలకు కలిగే ఉపద్రవాలను తొలగించటంలో ఆసక్తిగల ఓ జగజ్జననీ! కొంచెం చిట్లించిన నీ కనుబొమలు మన్మథుడి ధనుస్సును మరిపిస్తూ, తుమ్మెదల వంటి నీ కాటుక కన్నులు వింటినారి అయి శోభిల్లుతున్నవి. నీ ముక్కుపుడక ధనుస్సు మధ్య భాగాన్ని కప్పిపుచ్చుతూ స్మరహరుడి కుడిచేయి ముంజేయి పిడికిలా అన్నట్లు భాసిల్లుతున్నది.


ఆ పరమేశ్వరి కనుబొమలు మాత్రమే కాదు, ఆపాద మస్తకమూ దోషరహితముగా *(అనవద్యాంగిగా)* చక్కని అవయవ సౌష్ఠవముతో అలరారుచున్నది. అందుకే ఈ నామ మంత్రములో *సుభ్రూః* అని కనుబొమల సౌందర్యము విశేషించి చెప్పబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం సుభ్రువే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: