16, జూన్ 2023, శుక్రవారం

విజయవిలాసము

 తాసైరింపకపర్ణయుండఁగ,భవద్గర్భంబునందాల్చి, తే

జోసహ్యున్                               శరజన్ముఁగాంచి,యలనీహారక్షమాభృత్కుమారీ

సాపత్న్యముఁగన్న మోహపు పురంధ్రీరత్నమౌదీవ,కా

దేసర్వజ్ఙుఁడు నిన్ను నేల తలపైనెక్కించుకో? జాహ్నవీ!


           అనుపమానమైన ఈపద్యరత్నం 

చామకూరవేంకటకవిరచించిన "విజయవిలాసము"-అనుప్రబంధములోనిది.

         వేంకట కవిది ఒకవిలక్షణమైన కవితా శైలి.అచ్చతెనుగు మాటల మోహరింపుతో ప్రతిపద్యంలోను చమత్కారాన్ని రుచిచూపటం ఈకవిలోని ప్రత్యేకత!

           ప్రస్తుత పద్యం అర్జునతీర్థయాత్రారంభమున గంగానదీ తీరమునకు జేరిన సందర్భములోనిది.

గంగమ్మతల్లి విశిష్టతను దెలుపుట యిందలివిషయము.


           "అమ్మా!గంగమతల్లీ!తనతేజమును భరింపనోపక పార్వతియుండ.,నీవు పరమశివుని తేజమును కడుపునమోసి కుమారస్వామిని గని,పరమశివుని వంశమును నిల్పి యాతని ప్రేమను జూరగొన్నావు.లేకున్న హిమవత్పర్వత రాకుమారియగు పార్వతియుండగా సర్వజ్ఙుడగు శివుడు నిన్నేలతలపై కెక్కించుకొనును?సర్వథానీవుఆమెకన్నమిన్నవే!"-ననిపొగడుచున్నాడు.


           ఈపొగడ్తలో నొకతెగడ్త యున్నది.

గంగ పార్వతికన్నమిన్న యనిచెప్పుట.

మరిశంకరునిశరీరమున వామార్ధమునాక్రమించిన పార్వతిమాటయో? ఆమె పర్వత రాకుమారి.అంతేగాదు.తపస్సుచేసి శివునిభర్తగాచేసికొన్నది.అందుకేకవి"అపర్ణ"యనియు-నీహారక్షమాభృత్కుమారీ"-యనియు, పెద్దసమాసమునుపార్వతినిగురించిచెప్పి.ఆమెగొప్పతనమునువెల్లడించినాడు.గంగను "జాహ్నవి"-యని చిన్నమాటతో సరిపెట్టినాడు.అనగా నొకసామాన్యమైన వనితగాసూచనచేసినాడు.

                         కానీ యామె శివుని వంశమును నిలబెట్టినదౌట,శివునిదృష్టిలో పార్వతికన్న మిన్నయైనది.అందుచేతనే 

"సర్వజ్ఙుడైన"(అన్నియునెరిగినవాడు)శివుడు గంగను నెత్తినెక్కించు కొన్నాడనికవి సమర్ధింపు.

            లోకమున పురుషున కనేకమందిభార్యలున్నను,తనకు సంతతినిచ్చిన భార్యయెడనే యతనికభిమానము యెక్కువగా నుండుటమనముచూచుచున్నదేగదా!


అర్ధములు:-


అపర్ణ-పార్వతి, తేజోసహ్యుడు-పట్టరానితేజముగలవాడు.శరజన్ముడు-రెల్లుపొదలలోపుట్టినవాడు.సాపత్న్యము-సరిపత్నులగుట(సవతులగుట)

మోహపుపురంధ్రి-ముద్దులభార్య,

అలంకారము-కావ్యలింగము.🌷🌷🙏🙏👌

కామెంట్‌లు లేవు: