16, జూన్ 2023, శుక్రవారం

సుగుణాలకు మూలం

 *సుగుణాలకు మూలం సౌశీల్యం, సత్ స్వభావాలే*


మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తాయి. స్వయంకృతాపరాధాలు కొన్ని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని, మానసిక రుగ్మతల వల్ల కొన్ని, సామాజిక కుటుంబ ఆర్ధిక సమస్యల వల్ల కొన్ని... వీటికి - ఆసహజంగా పెరిగిపోతున్న దానవత్వం, తరిగిపోతున్న మానవత్వం, కరిగిపోతున్న దైవ చింతనలే కారణాలని శంకర భగవత్పాదులు అనేక సందర్భాల్లో బోధించారు. మనిషి తనలో మానవత్వం మీదుగా ఆధ్యాత్మికోన్నతి సాధించడానికి తన బుద్ధిని, జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి. ఇది అంత సులభమైనది కాదు. ఎందుకంటే అడుగడుగునా స్వార్ధం అడ్డుపడుతూనే ఉంటుంది.


బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయితో- మనిషి దేన్నైనా ప్రేమిస్తున్నాను అన్నాడంటే అది తన ఆనందం కోసం, కోరికలు తీరడం కోసమే అన్నాడు. తన స్వార్థానికి విఘాతం కలిగినప్పుడు మనిషిలోని దానవత్వం ప్రకోపిస్తుంది. స్వార్థాన్ని, అహాన్ని జయించలేనివారు తమతోపాటు ఇతరుల సుఖశాంతులను, సంతోషాన్ని హరిస్తారు.


కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన మత్స్య న్యాయం (చిన్న చేపను పెద్ద చేప మింగడం) ప్రబలిపోతోంది. బలవంతుడు బలహీనుణ్ని అణచివేస్తాడు. చివరికి లోకవినాశనానికి దారితీసే స్వార్ధప్రవృత్తికి తోడు హింసాప్రవృత్తి పెట్రోగిపోతోంది. ఎల్లలులేని స్వార్ధం, అహంకారాలు అంతం కావాలంటే సన్మార్గ దర్శనం కావాలి. అందుకే దైవం మానుష రూపంలో అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు. తన శక్తిసామర్ధ్యాలను కొందరు మహాపురుషుల్లో ప్రవేశపెట్టి ప్రక్షాళన కావిస్తుంటాడు.


సుగుణాలకు మూలం సౌశీల్యం, సత్ స్వభావాలేనని భర్తృహరిఅన్నాడు. సద్గుణాలను కలిగి ఉండటమే సచ్చీలత. అదే మనిషిని. సన్మార్గంలో నడిపిస్తుంది. సత్సాం గత్యం, సచ్చీలత, సద్ధంథ పఠనం, సద్వాక్కు సేవాతత్పరత, సత్ప్రవర్తన, సమత్వం, సమయపాలన... ఇవన్నీ సద్గుణ సంపదలు. ఆదికావ్యమైన రామాయణం, ధర్మశాస్త్రమైన మహాభారతం, భగ వద్గీత వంటి ఎన్నో ప్రామాణిక గ్రంథాల్లో విభిన్న పాత్రల ద్వారా రకరకాల మానవ నైజాలను వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. సద్గంధ పఠనం వల్ల మనిషి ఉత్తమ వ్యక్తిగా, కుటుంబంలో ఉత్తమ సభ్యుడిగా, మంచి కొడుకుగా, మంచి సోదరుడిగా, మంచి మిత్రుడిగా చివరకు మంచి శత్రువుగా కూడా ఎలా మెలగాలో తనను తాను తీర్చిదిద్దుకోగలుగుతాడు. సభ్రంధ పఠనం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, అనుక్షణం అండగా నిలిచే ఆప్తమిత్రుడు, విజయానికి దిక్సూచి, సన్మార్గపు రహదారి.


అమ్మ జన్మనిస్తుంది. నాన్న జీవితాన్నిస్తాడు. స్నేహితులు సంతోషాన్ని ఇస్తారు. కానీ సద్ధంథ పఠనం... వారెవరూ ఇవ్వలేని తరగని గనిలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్నా ఓటమిని, భయాన్ని దరిచేరనివ్వని సన్మార్గంలో నడిచే మనోధైర్యాన్నిస్తుంది.

కామెంట్‌లు లేవు: