16, జూన్ 2023, శుక్రవారం

శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం

 🕉 మన గుడి : 








⚜ కడప జిల్లా : నిత్యపూజకోన


⚜ శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం



💠 కొండల్లో, అడవుల్లో వెలసిన శివాలయాలకు వెళ్ళాలంటే భక్తులు ఉత్సాహం చూపుతారు. 

అటువంటి కొండల్లో కోనల్లో వెలసినదే నిత్యపూజ కోన క్షేత్రం. 


💠 చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద పెద్ద కొండలు గుట్టల మధ్య ప్రయాణం ఇదీ నిత్యకోనకు వెళ్లే మార్గం లోని అనుభూతులు. 

దీనికి తోడు గలగల పారే జలపాతాలు, భారీ చెట్ల మధ్య లో సవ్వడులు చేసే సెలయెర్లు అక్కడి అందాలను మరింత పెంపొందించాయి.


💠 ఈ క్షేత్రానికి నిత్యపూజకోన అనే పేరు రావటానికి కారణం అక్కడ దేవతలు స్వామిని నిత్యం పూజిస్తుంటారు కాబట్టి. 

కోరిన కోర్కెలను తీర్చే నిజమైన స్వామిగా పూజలందుకుంటున్న నిత్య పూజ స్వామి (శివుడు) లీలలు అంతా ఇంతా కావు. 


💠 సాక్షాత్తూ శివుడే నిత్యానంద ఋషి అవతారమెత్తిన కొండ సొరంగ మార్గంలోని గుహలో తపస్సు చేస్తూ శివలింగం గా మారినట్లు స్థానిక పూజారులు చెబుతారు.


💠 ఉద్భవలింగంగా మారిన స్వామివారిని కొండ కింది భాగాన కొలువుదీరిన అక్కదేవతలు, ఉద్భవలింగంగా అహర్నిశలు పూజలు చేస్తూ ఆయన సేవలకు తమ జీవితాన్ని అంకింతం చేశారన్న వార్తలు కూడా పూర్వీకుల ప్రచారంలో ఉన్నాయి.


💠 ఈ క్షేత్రంలో వారంలో ఒకరోజు (సోమవారం) అన్నదానం నిర్వహిస్తారు. క్షేత్రంలోని పరిసర ప్రకృతి అందాలు పర్యాటకులను, భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వానాకాలం అయితే చెప్పాల్సిన పనే లేదు నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సివస్తుంది.


⚜ అక్కదేవతల కోన ⚜


💠 ఇక్కడ చెప్పవలసినది మరొకటుంది అదే అక్కదేవతల కోన. 

నిత్య పూజయ్య స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కదేవతల కోన వెళ్ళటానికి ఒక దారి కూడా ఉన్నది. ఈ ప్రదేశంలోని ఒక చిన్న గుడిలో అక్కదేవతలు కొలువై ఉంటారు. వీరు నిత్యం స్వామిని కొలుస్తుంటారని ప్రతీతి.


💠 సిద్దవటం కోట మధ్య యుగం నాటిది. పెన్నా నది ఒడ్డున ఈ కోట 36 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. కోటకు పశ్చిమం వైపున, తూర్పు వైపున రెండు ద్వారాలున్నాయి.

సిద్దవటం కోట ముఖద్వారానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పడమటి వైపు ఉన్న ద్వారానికి ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి.

 

💠 కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం, కామాక్షి ఆలయం ఉన్నాయి.


💠.ఇక్కడ ప్రతి ఏట శివరాత్రి ఉత్సవాల నాడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి , 

ఇక్కడ ప్రకృతి మహా సోయగంగ ఉంటుంది. పచ్చని చెట్లు, అందమైన జలపాతం ఈ పుణ్య క్షేత్రం ప్రత్యేకత. వరాన్ని సిద్దించే స్వామి కావున సిద్దేశ్వర స్వామి అని ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది.


💠 కడప నుండి సిద్దవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుండి దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాల వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. బస్సు మార్గంలో అయితే 12 కిలోమీటర్లు వెళ్ళవచ్చు. కడప నుండి ప్రతి సోమవారం ఒక ఆర్టీసీ బస్సు ఉన్నది.

కామెంట్‌లు లేవు: