17, ఆగస్టు 2023, గురువారం

గోవిందరాజు సుబ్బారావు

 గోవిందరాజు సుబ్బారావు (1895 -1959 )



తెర మీద అయన కనబడితే అయన కనబడరు  అయన పాత్ర తప్ప . సహజ సంభాషణలు , అర్థవంతమైన అభినయం వాచికం ఆయన సొంతం. 


అయన సినిమాల్లో అడుగు పెట్టేనాటికి ఆయన నడివయసులో ఉన్నా అయన ప్రజ్ఞ చూసి చాలా ప్రధాన పాత్రలే వచ్చాయి. అయన వృత్తి రీత్యా వైద్యుడు . ఇటు హోమియోపతి  లో కూడా అందెవేసిన చేయి . 


ఆంగ్లం , సంగీతములో కేవలం సప లు మాత్రమే కాక అనేక రాగాల మీద ఆయనకు మంచి పట్టుంది . సంగీతం, సాహిత్యం, సైన్స్ ఇలా ఏది పట్టుకున్నా ఆయనకు అన్ని విషయాలు కరతలామలకాలే  .  


ఐన్ స్టీన్ కి   ఉత్తరాలు వ్రాసి  అణుశాస్త్రం, ఆర్గానిక్ శాస్త్రం మీద  చర్చలు జరిపినంత పట్టు ఆయనకు ఉంది . కానీ ఆయనకు వీటన్నింటిని మించి నాటకాలు సంగీతం సాహిత్యం ఇవే అమిత ఇష్టం . తొలినాళ్లలో నాటకాలు ఆ తరువాత సినిమాలు మరో వైపు వైద్యం . అటు సాత్విక పాత్రలు ఇటు క్రూర పాత్రలు ఏవైనా వేయగల దిట్ట . 


గోవిందరాజు సుబ్బారావు గారి ప్రతిభ చూసే మొదట మాలపిల్ల 1939  లో ఛాందసుడిగా ఉండే సుందర రామ  శాస్త్రి పాత్రకు ఆయన్ని  ఎంపిక చేసారు గూడవల్లి  రామబ్రహ్మం  గారు. ఆయనకు   వీరు సముద్రాల గారి ద్వారా  పరిచయం. 


మాలపిల్ల చిత్రంలో సుందర రామ శాస్త్రిగా ఆ చిత్రములో వేసినందుకు ఆయన సంఘం నుండి కొన్నాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన పట్టించుకోలేదు. అది కేవలం పాత్ర .. నేనూ సదాచార బ్రాహ్మణుణ్ణి .. ఎక్కడ ఏ రోజు ఆచారం తప్పలేదు . అది కేవలం ప్రవృత్తి అని చెప్పుకునేవారు . 


మాలపిల్ల  తరువాత ఆయన గృహలక్ష్మి లో నటించినా ఆయనకు పెద్ద పేరు తెచ్చిన చిత్రం జెమినీ వారి బాల నాగమ్మ . అందులో మంత్రాల మరాఠీ గా ఆయన చూపిన హావ భావాలూ చూసి ఆనాటి పిల్లలూ, పెద్దలూ జడుసుకున్నారట . అందుకని కన్నాంబ గారిని ఆయన్ని బూచాడు అని పిలిచేవారు . 


బాలనాగమ్మ  1942  తరువాత ఆయనకు అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిన చిత్రాలు శారదా వారి పల్నాటియుద్ధము లో బ్రహ్మనాయడు పాత్రలో, ఆ తరువాత వచ్చిన గుణసుందరి 1949   కథలో మహారాజు పాత్ర, షావుకారు 1950   చిత్రములో     షావుకారు చంగయ్య పాత్ర , 1955  లో వచ్చిన వినోదా వారి  కన్యాశుల్కములో లుబ్దావధానులు పాత్ర . 


ఆయన చివరిగా కనబడిన చిత్రాల్లో చిరంజీవులు, చరణదాసి, భాగ్యరేఖ , పాండురంగ మహాత్మ్యం. ఆయన నాగయ్య గారి భక్త రామదాసులో నటించేప్పుడు మరణించారు. ప్రఖ్యాత నర్తకుడు ఉదయశంకర్ తీసిన  చిత్రము కల్పన 1948 లో ఆయన కూడా ఉన్నారు.


ఆయన అనేవారు నాటకములో ఒన్స్  మోర్ అన్నట్టు జీవితములో కూడా జరిగే మధుర స్మృతులను ఎవరన్నా ఒన్స్ మోర్ అంటే బాగుంటుంది . కానీ దైవం అనేవాడు దీనికి వీలు లేకుండా చేసాడు . భగవంతుని సృష్టి విలాసాలు ఎవరు అర్థం చేసుకోలేరు . ఆయన విశ్వ నిర్మాణమే కడుంగడు విచిత్రం . మనలో మనం ఎంత తన్నుకున్న తిట్టుకున్నా మళ్ళీ ఏదో రోజు ఒరేయ్ చలపాయ్ , ఒరేయ్ నరసింహులు , ఒరేయ్ రాముడూ, కుటుంబరావు అని ఆప్యాయంగా పిలుచుకునే రోజులు . ఉప్పిండి చేశాను కాస్త అయినా నోటిలో వేసుకోరా అని   మా వెంకమ్మత్తయ్య   అంటుండే వారు . ఆరోజులు మళ్ళీ  వస్తాయా అసలు . 


అందరూ అంటారు మీరు చేసిన సుందరరామయ్య పాత్ర, షావుకారు  చంగయ్య పాత్ర  మాకు బాగా నచ్చాయని . నాకు మాత్రం ఇంకెవరైనా తల పండిన వారు ఆ పాత్రల్లో ఉండి ఇంకా భేషుగ్గా చేసేవారని అనిపిస్తుంది . ఒక వేళ ప్రేక్షకులు బాగుందన్నా నేనూ సంతోషముతో ఎగిరిపోను .. బాగో లేదన్నా కృంగిపోను. 

నటుడుని కాబట్టి ఒక్కోసారి ఆ పాత్రలో ఇలా చేసి ఉంటే ఇంకాస్త బాగుండేమో అనిపిస్తుంది నాకు .   


నాకు సినిమా , నాటకం , మరో పక్క వైద్యకం .. మాత్రమే కాక రేడియో లో చేయడం కూడా ఇష్టమే . ఇక్కడ కనబడకుండా కేవలం మాటతోనే మన హావ భావాలూ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ముందు మూడింటి కన్నా ఇది కత్తి మీద సాము వంటిది .మొదట్లో నాటకం కంటే సినిమా నటనం కష్టం అని భయపెట్టారు. కానీ అవి రెండూ నాకు  పెద్ద గొప్పగా అనిపించలేదు గానీ .. ఈ రేడియో మాత్రం నాకు చాల సరదా ని  తెచ్చి పెట్టింది. 


మాలపిల్ల సినిమా లో చేసేప్పుడు ఓ సన్నివేశములో ఇల్లు తగలబడేప్పుడు ఆ తగులపెట్టిన పెట్రోల్ కిరోసిన్ వాసనా మరియు ఆ సెగకు , రెండూ మూడు మార్లు రి టేక్  వల్ల నా ఆరోగ్యం బాగా దెబ్బ  తింది . ఆ వాసనకు వేడికి నా ఊపిరి తిత్తులు దెబ్బ తిన్నాయి . సారథి వారు దయ తలచి వాళ్ల మేడ మీద నాకు బస ఏర్పాటు చేసారు.  మహానుభావుడు డాక్టర్ కేశవ పాయి గారి హస్తవాసి వల్ల బ్రతికి బయటపడ్డాను. ఆరోజుల్లో నేను పోయాను అని పేపర్ లో కూడా వచ్చిందిట . 


ఎవరో రామ బ్రహ్మం గారికి ఫోన్ చేసి ఎందరికో రోగాలు కుదిర్చిన మహానుభావుడికి ఈ రోగం వచ్చి పోవడం ఏమిటి అని  అడిగితే మా ఇంటిలో మేడ మీద గదిలో భేషుగ్గా ఉంటేనూ అని చెబితే గానీ లోకానికి తెలియరాలేదు .అందుకే  ఏదో వచ్చిన పాత్రలన్నీ చేసేయాలని నాకు లేదు . పాత్ర పది కాలాలు నిలబడగలుగుతుందా అని అనిపిస్తే మాత్రమే చేశాను. పిన్న వయసులోనే వృద్ధుడను అయిపోయాను అనిపిస్తుంది కానీ అంతా భగవంతుని లీల కదా అనిపించినపుడల్లా మనసు కుదుటపడుతుంది   .

కామెంట్‌లు లేవు: