17, ఆగస్టు 2023, గురువారం

తథాస్తు దేవతలు

 తథాస్తు దేవతలు అంటూ పెద్దలు ఉపయోగిస్తారు కదా! తధాస్తు దేవతలు ఎవరు? వారి ప్రస్తావన ఎక్కడైనా ఉన్నదా?

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు అని చెప్పగా విన్నా.

దీనిమీద కొంచెం శోధించా ..వివరాలు ఇవి.. మీ ప్రశ్న ద్వారా నూతన విషయాలు తెలుసుకున్నా. ధన్యవాదాలు.

వేదాలలో 'అనుమతి' అనే ఒక దేవత ఉన్నారట. శుభ కార్యాలు యజ్ఞ యాగాదులలో ఈ దేవతని స్మరిస్తే కార్య ఫలం లభిస్తుందంట.

ఆ అనుమతి దేవతలనే తధాస్తు దేవతలు అని అంటారంట. శుభ కార్యాలు జరిగే ప్రదేశం వారి నివాసస్థానం.

ముఖ్యంగా సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. అందుకే స్వగతంగా చెడు మాటలు పదే పదే అనుకోవద్దని పెద్దలు చెబుతారు.

మధ్యాన్న వేళకి ముందుగా అనికూడా ఎవరో ఎప్పుడో అంటే విన్నట్టు గుర్తు.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. పదే పదే చెడు మాటలు అంటూ ఉంటే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వ విషయంలోనే వర్తిస్తుంది. పరులకి కాదు.

తెలుసుకున్న పురాణ వర్ణన:

వీరి ప్రస్తావన ఋగ్వేదము 1 వ మండలంలోని 16వ అనువాకము 112 మొదలు 117 వరకు గల సూక్తములలో ఉన్నదట.

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కవల కుమారులు..

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు.

ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు.

వీరి సోదరి ఉష. ఆమె ప్రతి రోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని, మూడు చక్రాలు వుండి, అద్వరాశ్వాలనే మూడు శ్వేత అశ్వాలు నడిపే, వేయి పతాకాలుండే హిరణ్య రధాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు హిరణ్యయానమనే దారిలో వాయువేగ మనోవేగాలతో ఈ దేవతలు సంచరిస్తుంటారు.

ఆ రథంలో ఒకవైపుధనం మరొకవైపు తేనె మరియూ సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి, వారి కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది , వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.

ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.

వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారు. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.

ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు

కామెంట్‌లు లేవు: