🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-21🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందిస్తూ ‘‘మాతా! ఈనాడు నీకొక రహస్యము చెప్పగలవాడను వినుము. పూర్వకాలములో నేను శ్రీరామావతారము ధరించినప్పుడు నేను లేని సమయము చూసి, రావణుడు సీతను యెత్తుకుపోయాడు.
మార్గ మధ్యములో అగ్నిదేవుడు రావణునకు అడ్డుపడినాడట. అడ్డుపడి నేను అసలు సీతను అగ్నిచెంత దాచి, ఆశ్రమమున మాయ సీతను వుంచితిననియూ, అతడు తీసుకుపోతున్న సీత మాయసీతే ననియు నమ్మించాడు. మాయసీత నాకేలనని రావణుడు అగ్నిదేవునకిచ్చి వేసినాడు. ‘అసలు సీత యిదిగో ఈమె’ యని చెప్పి, తనవద్దనున్న వేదవతినిరావణున కిచ్చినాడట.
నాకు యీ విషయము తెలియదు, రావణుని నేను సంహరించిన అనంతరం సీతను ఒకవేళ లోకము శంకిస్తుందేమో యని అగ్నిప్రవేశము చేయించాను.
అప్పుడు అగ్నిదేవుడు వచ్చి విషయము చెప్పి వేదవతినీ కూడా సీతాదేవితో పాటు ఏలుకోవలసినదని కోరాడు. అప్పుడతనితో నేను వేదవతినికలియుగములో వివాహమాడెదనని మాట నిచ్చివేయుటము జరిగినది. ఆ వేదవతియే యీ పద్మావతి. కనుకనే పద్మావతిని నేను వివాహమాడవలసి యున్నది. అన్ని వకుళతో వివరముగా చెప్పినాడు.
శృంగార వనములో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపములో వున్న శ్రీనివాసుని చూచినదో అప్పటినుంచీ యామెకు ఆ పురుషుని గూర్చిన ఆలోచనలే మనసులోమెదలడము ప్రారంభించినాయి.
కన్ను మూసినా, తెరచినా అతడే కనిపిస్తున్నాడు. అతడు తన హృదయముపై చెరగని ముద్రవేసినాడు. అతనిని వివాహము చేసుకొన్న బాగుండునని పద్మావతి భావించినది. అయితే తల్లికికానీ, తండ్రికి కానీ విషయము చెప్పలేదు, చెలికత్తెలకి చెప్పడానికి గూడా సిగ్గేసింది.
‘బోయవాడు, బికిరివాడు నీకు భర్తగా రావడమేమిటి?’ అని తల్లిదండ్రులు తనను చీవాట్లు పెట్టవచ్చు. అందువలన ఆమె సరిగా తినడము సరిగా నిద్రపోవడము మానేసి చాలా కాలమైనది. సింగారించుకోవడము మానినది.
వనవిహారము మానినది, చివరకు చెలికత్తెలతో సరిగా మాట్లాడడము కూడా మానివేసినది. ప్రేమ జ్వరము ఆమెను క్రుంగదీయడము ప్రారంభించినది.
పద్మావతి వనోవ్యాధితో మంచమెక్కినది, ఆకాశరాజు, ధరణీదేవి విప్రవర్యులచే పద్మావతి ఆరోగ్యమునకై పూజలూ, అభిషేకములూ జరిపించారు. రాజవైద్యులు కూడా వైద్యము చేశారు. ఏమి చేయించినా ఆమె వ్యాధి కుదటపడదని ప్రారంభించనే లేదు పైగా ఆ వ్యాధి ఆ రోజు కారోజు పెరిగిపోసాగినది. ఇక్కడ పద్మావతియిలా వుంటేఅక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని కాల పరిణామము తెలియకుండా అదే పనిగా పద్మావతిని గూర్చి ఆలోచించసాగాడు.
శ్రీనివాసుని దిగులు వకుళాదేవికి విచార కారణమయినది. వకుళ పరిష్కారమును గూర్చి ఆలోచించసాగినది.
శ్రీనివాసునితో ఆమె ’’నాయనా! నీ దిగులు చూస్తే నాకు మతిపోతోంది. బాధపడకు, ఆకాశరాజుగారి వద్దకు ఇంక నేనే స్వయముగా వెళతాను వెళ్ళి అన్నీ మాట్లాడుతాను మాట్లాడి, ఈ నీ వివాహము ఎలాగైనా జరిపించాలని అర్ధిస్తాను. శాయశక్తులా కృషిచేసి రాయబారము సాగించి వస్తాను
నీవు బాధపడడము మాత్రము మానుకో! అని నారాయణపురానికి బయలుదేరినది. పాపం వకుళాదేవి శ్రమపడి వెళుతోంది కానీ, ఆకాశరాజా వాళ్ళూ అంగీకరిస్తారో లేదో? అందుచేత ఈ లోపున దానికి బలముగా ఒక పధకం వేయవలసి వుంది అని అనుకున్నాడు శ్రీనివాసుడు.
వజ్ర కవచ ధర గోవిందా, వసుదేవ తనయ గోవిందా, వైజయంతి ధర గోవిందా, వేంకట నాయక గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||21||
శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం .
*ఓం నమో వెంకటేశాయ*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి