29, నవంబర్ 2024, శుక్రవారం

తిరుమల సర్వస్వం -73*

 **తిరుమల సర్వస్వం -73* 

*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 12*

స్వర్ణ రథోత్సవం* 

ఆరవరోజు సాయంసంధ్యా సమయంలో అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు ప్రసరిస్తుండగా, దివ్యకాంతులీనుతున్న స్వర్ణరథంలో ఇరువురు దేవేరులతో కలిసి మలయప్పస్వామి వారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు నేత్రానందం కలిగిస్తారు. పోయిన బ్రహ్మోత్సవాల్లో తన ప్రియభక్తుడు వాయిపుత్రునిపై, ధనుర్బాణాలు ధరించి, అయోధ్యాదీశునిగా, కటి-వరద హస్తాలతో, కలియుగ దైవంగా స్వామి దర్శనమిచ్చారు. 

‌ బ్రహ్మదేవుని శూన్యరథం, గజ-అశ్వ-వృషభాదులు యధావిధిగా స్వర్ణరథోత్సవంలో కూడా పాల్గొంటాయి. దాసభక్తులనృత్యాలతో, భజనబృందాల కోలాహలంతో మాడవీధులు కడురమణీయతను సంతరించుకుంటాయి.

స్వర్ణం అంటే, "మిక్కిలి ప్రకాశించేది" అని వ్యుత్పత్తి. బంగారం మహా శక్తివంతమైన లోహం. ఈలోహం శరీరాన్ని తాకుతుంటే దేహంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. అనేకానేక ఔషధోత్పత్తుల్లో స్వర్ణం వినియోగించ బడుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంలో యుగయుగాల నుంచి ఈనాటివరకూ, స్వర్ణం పాత్ర వెలకట్టలేనిది. బంగారాన్ని తాకట్టు పెట్టో లేదా తెగనమ్మో, కష్టాల కడలి నుండి గట్టెక్కడం సత్యహరిశ్చంద్రునికాలం నుండి, ఆధునిక జగత్తులో కూడా మనం చూస్తూనే ఉన్నాం. వర్తక, వాణిజ్య, వినిమయాలకు సువర్ణ నాణాలను వినియోగించే సాంప్రదాయం, కలియుగారంభం నుండి, ఈ మధ్యకాలం వరకూ ఉండేది. పద్మావతీ పరిణయం సందర్భంగా శ్రీనివాసుడు కుబేరుణ్ణించి అప్పుగా తీసుకుంది సువర్ణముద్రికలే! 

స్వర్ణం లభ్యమయ్యేది భూమి నుంచే! భూదేవి సాక్షాత్తు శ్రీవారిలో భాగం. శ్రీవారి ఇల్లు బంగారం. ఆనందనిలయ గోపురం బంగారుమయం. ధ్వజస్తంభం బంగారు తాపడం చేయబడింది. ఇంటిలోని పాత్రలు బంగారువి. సింహాసనం బంగారుది. ధరించేది మేలిమి బంగారు నగలు. రాజాధిరాజుల నుండి సామాన్యుల వరకూ భక్తులందరూ స్వామివారికి హుండీలో సమర్పించుకునేది కనకమే! 

సకల సంపదలకు, ధనకనకాదులకు ఆధిపత్యం వహించేది శ్రీదేవిగా పిలువబడే లక్ష్మీదేవి. ఆమె కూడా శ్రీవారిలో భాగమే. బంగారంతో ఇంత ప్రగాఢమైన అనుబంధం కలిగిన శ్రీవారు ఇరువురు దేవేరులతో కలసి స్వర్ణరథంలో ఊరేగుతుండగా చూచి తరించటం ఓ అలౌకిక, ఆధ్యాత్మికానుభూతి. 

దేవేరులతో స్వామివారు స్వర్ణరథంపై ఊరేగే ఈ స్వర్ణరథోత్సవం శ్రీవారి మహోన్నతిని, సార్వభౌమత్వాన్ని, శ్రీపతిత్వాన్ని, భూదేవీనాథత్వాన్ని సూచిస్తుంది. 

స్వర్ణరథోత్సవంలో, కళ్యాణకట్ట సంఘంవారు సమర్పించిన బంగారు గొడుగును రథంపై అలంకరిస్తారు. కేవలం మహిళా భక్తులు మాత్రమే తేరును లాగటం ఈ స్వర్ణరథోత్సవ ప్రత్యేకత. 

ఈ రథోత్సవాన్ని *"సువర్ణరంగ డోలోత్సవం"* అని కూడా వ్యవహరిస్తారు. 

ఉయ్యాలసేవ ఈ రథోత్సవంలో అంతర్భాగం కావడం వల్ల, బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం జరిగే ఉయ్యాల సేవ స్వర్ణరథవాహనం నాడు జరగదు. 

స్వర్ణరథోత్సవ దర్శనం ద్వారా శ్రీదేవి కరుణతో సమస్త భోగభాగ్యాలు, అప్లైశ్వర్యాలు; భూదేవి కరుణతో భూసంపద, కనక, మణిమయాదులు, నవరత్నాలు, ధాన్యసంపద, పశుసంపద; శ్రీవారి కరుణతో సర్వ సుఖాలూ, శుభాలు చేకూరుతాయి.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

కామెంట్‌లు లేవు: