29, నవంబర్ 2024, శుక్రవారం

అరుదైన అమావాస్య

 *అరుదైన అమావాస్య వస్తోంది!*


అమావాస్య యదా మైత్ర  విశాఖా  స్వాతి యోగినీ|

శ్రాద్ధైః పితృగణస్తృప్తిం తదాప్నోత్యష్టవార్షికీమ్||

స్వాతి విశాఖ అనూరాధ నక్షత్రాలు అమావాస్యతో కలసి వచ్చిన ప్పుడు పితృదేవతలను అర్చిస్తే వారు ఎనిమిది సంవత్సరాలు సంతోషిస్తారని విష్ణుపురాణంలోని మూడవ అంశంలోని 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం అంటోంది.

ఇటువంటి అరుదైన సంగమం డిసెంబర్ 1వ తేదీన వస్తోంది. ఆదివారం, అమావాస్య రావడమే మహాసంగమం అయితే అనూరాధతో కూడి ఉండడం అందరి అదృష్టంగా భావించాలి. అమావాస్య 10.43 వరకూ ఉంటోంది. అనూరాధ మధ్యాహ్నం 2.10 వరకూ ఉంటుంది. నిజానికి ఈ సంగమం శనివారమే ప్రారంభం అవుతుంది. శనివారం ఉదయం 9.16 తరువాత అమావాస్య ప్రవేశిస్తుంది. మధ్యాహ్నపరివ్యాప్తమై ఉంటుంది. విశాఖ 12.17 వరకూ ఉంటుంది. తదుపరి అనూరాధ ప్రవేశిస్తుంది. విష్ణుపురాణం ప్రకారం విశాఖ, అనూరాధలతో అమావాస్య కలిసి రావడం మహత్తరం కనుక ఈ దివ్యమైన సంయోగం శనివారం ఉదయం 9.16 నుంచీ ప్రారంభమై ఆదివారం ఉదయం 10.43 వరకూ ఉంటుంది. ఇది మహదవకాశంగా అందరూ భావించాలి. కార్తీక మాసం చివరి రోజు అరుదైన పితృదేవతార్చనను ఇస్తోంది. 

ఎవరైతే భయంకరమైన జన్మదోష, గ్రహదోష, నక్షత్రదోష, జాతకదోషాదులతో బాధపడుతున్నారో వారు వీటి అన్నింటికీ కారణమైన పితరుల శాపం నుంచీ విముక్తిపొందడానికి అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా కంటితో చూస్తుండగానే ధనం, ఆస్తులు, బంగారం, సంపదలు, వాహనాలు, వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు నష్టమైపోతున్నాయో వారు శనివారం, ఆదివారం పెద్దలను అర్చించడం మంచిది.

కామెంట్‌లు లేవు: