29, నవంబర్ 2024, శుక్రవారం

మొగిలిచెర్ల అవధూత

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్తోపదేశాలు - ఇరవయ్యో భాగం - భగవంతునితో బంధుత్వము


ఒక ప్రవచనములో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు, "సన్యసించడానికి కర్మను వదులుకోనవసరం లేదు, భగవంతుని దగ్గరకు వెళ్లే కొద్దీ కర్మ దానిఅంతట అదే వదిలిపోతుంది"  అని. నిజమే చాలా చక్కని ధర్మ సూక్ష్మం అది. మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర చుస్తే ఇది అక్షర సత్యం అని తెలుస్తుంది. శ్రీ స్వామి వారు చిన్ననాటి నుండి ఆ భగవంతునిలో లీనమయ్యేందుకు దానికి  అవసరమైన సాధన మరియు జ్ఞానాన్ని సంపాదించుకునే పనిలో వ్యాసాశ్రమంలో చేరడం అటుపైన మాలకొండ ఆ తరువాత మొగిలిచెర్ల చేరుకున్నారు. ఎప్పుడూ కానీ వారంతట వారు ఏ ఒక్క బంధాన్ని వదులుకోలేదు, వారి జీవన క్రమంలో వాటి అంతట అవే తొలగిపోయాయి. వారి మోక్ష సాధనలో ఆగిన ప్రతీ చోట ఒక మజిలీ మాత్రమే అనుకున్నారు కానీ, అదే వారి గమ్యము అనుకొని నిలిచిపోలేదు. అలానే, ఆయా మజిలీలలో వారికి ఎదురుపడిన వారందరినీ పరిచయస్తుల గానే చూసారు కానీ బంధువులలా కాదు.  శ్రీ స్వామి వారు, వారి జీవితముతో ముడిపడిన అన్ని రక్త సంబంధీకులతో సైతం తామరాకు మీద నీటిబొట్టు లాగా వ్యవహరించారే కానీ, ఎన్నడూ కూడా ఏ ఒక్క మనిషితో కూడా వారు చూపించే ధనము వలన కానీ, కలిగించిన సౌకర్యాల వలన కానీ, కరుణ లేదా ప్రేమ వలన కానీ, ఆశపడి, ఋణపడి మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల మధ్యలో ఇరుక్కుపోలేదు. 


ఆది శంకరాచార్యలు వారు చెప్పినట్టుగా : 


పునరపి జననం పునరపి మరణం ,

పునరపి జననీ జఠరే శయనం|

ఇహ సంసారే బహుదుస్తారే ,

కృపయాపారే పాహి మురారే ||


ఏ బంధుత్వాల మధ్యలో బిగుసుకుపోకుండా నిరంతరం ఆ భగవన్నామం స్మరిస్తూ, ఆ పరమాత్మలో లీనమవ్వటమే మార్గముగా భావిస్తూ మరియు వారి చుట్టువున్నవారికి మార్గదర్శకం చేస్తూ ముందుకు నడిచారు.


దానికి ఒక, శ్రీధరరావు దంపతులు ఒక దశలో వారి కుటుంబ సమస్యల వలన ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయములో, వారి బంధుత్వాలని ఆ పరమాత్మ ఒక్కొక్కటిని తీసేస్తూ, ఆ పరమాత్మ సేవకు ఆ దంపతులను వినియోగించుకోబోతున్నారని తెలిపి వారిని ఆ బాధలో నుంచి బయటకు లాగివేసి ఆనందాన్ని పంచారు. 


శ్రీ స్వామి వారు వారి జన్మజన్మాంతరాలలో నిలుపుకొని, పెంపొందించుకొని చివరికి వారికి ఆ గమ్యానికి అభేద్యమైన స్థితికి చేరుకుంది కేవలం ఆ పరమాత్మ అనే నిత్యబంధువు మరియు దీనబాంధవుడితోనే.


సర్వం,

శ్రీ దత్త కృప

ధన్యోస్మి

పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు : 

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699

----

ఇంతటి మహానుభావుని దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ

-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632


---

కామెంట్‌లు లేవు: