🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ముగురమ్మల మూలపుటమ్మ*
*దుర్గ మాయమ్మ*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*'దుర్గా' నామానికి అర్థం:~*
*'దుర్గా' నామాన్ని ఒక మహా మంత్రంగా వేదవాఙ్మయం పేర్కొంది. ఈ నామానికి అర్థశక్తితో పాటు, మహిమాన్వితమైన శబ్దశక్తీ ఉంది. ఆ అర్థాలను సంభావించి, ఈ నామాన్ని ఉచ్చరిస్తే దివ్యఫలితాలను పొందవచ్చని మంత్ర శాస్త్రం స్పష్టం చేస్తోంది.*
*'దుర్గా' నామమే ఒక మహామంత్రం.*
*దుర్గమమైనది దుర్గ. మనసుకీ, మాటకీ అందని పరతత్త్వమే దుర్గమం (అందరూ తేలిగ్గా ప్రవేశించలేనిది). ఎంతో సాధనతో, యోగంతో పొందవలసిన తత్త్వమది. అందుకే 'దుర్గ' అంటే 'పరతత్త్వం' (పరబ్రహ్మ) అని ప్రధానార్ధం.*
*యస్యాః పరతరం నాస్తి*
*స్చైషా దుర్గా ప్రకీర్తితా*
*'దేన్ని మించి మరో తత్త్వం లేదో అదే 'దుర్గ', అని వైదిక నిర్వచనం.*
*దుః అనే శబ్దానికి వీలుకానిది. భరించలేనిది అని అర్ధం. దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దుఃఖం, దుఃస్థితి... ఇవన్నీ 'దుః' శబ్దంతో కుడిన పదాలు. వీటన్నింటిని సమూలంగా తొలగించే ఆనంద శక్తి దుర్గ.*
*"రాగం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, పరిగ్రహం మొదలైన దోషాలను హరించే దేవి" - అని శాస్త్రం వివరించింది.*
*వేద ధర్మానికి విఘాతం కలిగించి, దేవతలకు సైతం లొంగని దుర్గుడు అనే రాక్షసుని సంహరించడం చేత 'దుర్గా' నామం వచ్చినట్లు దేవీ భాగవతం చెబుతోంది.*
*దుర్గమాసురహంత్రీ త్వాత్*
*దుగ్గేరి మమ నామయః ౹౹*
*దుర్గము అంటే 'కోట' అని కూడా అర్ధం. పరుల బాధలేకుండా, మనలను రక్షించే ఆశ్రయం దుర్గం. అదేవిధంగా ఆశ్రయించిన భక్తులను అన్నివిధాల ఆదుకునే తల్లి దుర్గ.*
*త్వామాశ్రితానాం న విపన్నరాణాం*
*త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి ||*
*"నిన్ను ఆశ్రయించిన నరులకు విపత్తులుండవు. నిన్ను ఆశ్రయించినవాడే, సరియైన దాన్ని ఆశ్రయించినవాడు" (దేవీ మాహాత్మ్యం - మార్కండేయపురాణం).*
*ఈ భావనలో 'దుర్గా' అంటే 'ఆశ్రయశక్తి' అని అర్ధం.*
*వేదం దుర్గను 'తారిణీ శక్తి'గా పేర్కొంది. దాటించే శక్తి - దుర్గ. కష్టాల కడలినుండి తన భక్తులను దాటించి, ఒడ్డున చేర్చే నావగా వేదం దేవీని వర్ణించింది.*
*“నావేవ సింధుం దురితాత్యగ్నిః"*
*“దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే*
*సుతరసి తరసే నమః"* -
*వంటి వేదమంత్రాలు ఈ భావనను చెబుతున్నాయి.*
*తాం దుర్గాం దుర్గమాం దేవీం*
*దురాచార విఘాతినీం |*
*నమామి భవభీతోహం*
*సంసారార్ణవతారిణీమ్ ౹౹*
*"అంతుపట్టని తత్త్వంగల దుర్గాదేవి, దురాచారాలను నశింపజేసే తల్లి.*
*సంసార సముద్రాన్ని దాటించే ఆ దేవిని భవభీతుడనైన (సంసారం వల్ల భయపడే) నేను నమస్కరిస్తున్నాను" అని దేవ్యథర్వశీర్షం 'దుర్గ' నామానికి నిర్వచనాలిచ్చింది.*
*ఓం దుం దుర్గాయై నమః॥*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి