29, నవంబర్ 2024, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*210 వ రోజు*

*సంజయుని రాయబారం*

సంజయుడు ఉపప్లావ్యం చేరి అర్జునినితో కూడి ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. మరునాడు సభలో ధర్మజునితో " ధర్మజా ! నిన్ను కలుసుకోవడం నా అదృష్టం. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నందుకు ఆనందించాడు. మీ యోగ క్షేమం కనుక్కు రమ్మని నన్ను పంపాడు " అన్నాడు. ధర్మరాజు " మా పెదనాన్న దయ వలన మేము క్షేమంగా ఉన్నాము. మా క్షేమం కొరకు పెదనాన్న మిమ్ము పంపడం మా అదృష్టం. నిన్ను చూస్తూ వుంటే సాక్షాత్తూ మా పెదనాన్నను చుసినట్లున్నది. వారు క్షేమమా , వారి పుత్రులు క్షేమమా, మనుమలు క్షేమమా, భీష్మ ద్రోణ, కృప అశ్వథామలు క్షేమమా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? బ్రాహ్మణులను కౌరవులు ఆదరిస్తున్నారా? వారికి మేమిచ్చిన గ్రామాలను దుర్యోధనుడు లాగుకొన లేదు గదా ? గురు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మా విషయంగా దోషములను ఎంచడం లేదు కదా! ఒక్కసారిగా పిడుగులవంటి అరవై తీష్ణ బాణములను ప్రయోగింప గల అర్జునుడి బాహుబలమును స్మరిస్తున్నారా! గద చేత ధరించి దట్టమైన అడవులలో సంచరించే మదపుటేనుగులాగా యుద్ధరంగంలో సంచరించే భీమసేనుడిని స్మరిస్తున్నారు గదా! మునుపు రాజసుయయాగ సందర్భంగా తన కెదురైన కళింగ రాజును జయించిన సహదేవుని, శిబిని, త్రిగర్త రాజులను జయించిన నకులుడిని స్మరిస్తున్నారా! దురాలోచనతో ద్వైత వనంలోకి ఘోషయాత్రకు వచ్చి బందీలైన ధృతరాష్ట్ర కుమారులను బంధ విముక్తి చేసిన భీమార్జునులను, ఆ సంగతిని స్మరిస్తున్నారా!" అన్నాడు. సంజయుడు దానిలోని అంతరార్ధం అర్ధం చేసుకుని తన వాదన వినిపించడం మొదలు పెట్టాడు " ధర్మజా! నీవు అడిగినట్లే అందరు కుశలంగా వున్నారు. సుయోధనుని చుట్టూ అవినీతి పరులు, దూరంహంకారులు, నీతి మంతులు, సత్వసంపన్నులు ఇలా అనేక ప్రవృత్తులు కలవారు ఉన్నారు.వారు ఒకరి మాట ఒకరు వినరు. కౌరవులు యుద్ధ ప్రసంగంలో మీ గురుంచి, వీరాగ్రేసరులైన భీమార్జునుల గురుంచి స్మరిస్తున్నారు. ధర్మజా! నీవు మంచి మనసుతో సంధి ప్రయత్నం చేసావు కాని వృద్ధుడైన దృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు. కొడుకుల మాట కాదన లేక పోతున్నాడు. మనసులో మధన పడుతున్నాడు. కనుక అజాత శత్రువైన నీవు పెద్ద మనసు వహిస్తే బాగుంటుంది. ఇచ్చిన దానం తిరిగి స్వీకరించడం ధర్మమా? హస్థినాపుర ప్రజలు శత్రువులను ఎదుర్కొన్నప్పుడు మిమ్ములను తలచుకుంటున్నారు. పగవారికి కూడా హాని తలపెట్టరని మిమ్ము కీర్తిస్తున్నారు. ధర్మజా! శ్రీకృష్ణుని సమక్షంలో నిండు సభలో నీతమ్ములు వింటుండగా నాకు తోచినది చెప్తాను " అనగానే ధర్మరాజు " సంజయా నీవు చెప్పదలచినది చెప్పవచ్చు " అన్నాడు.


*సంజయుడి దౌత్యం*

సంజయుడు అందరిని ఒక్క సారి పరికించి " మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ సంధి చేయమని శాంతి సందేశంతో నన్ను పంపాడు. ఇది పాండవులకు కూడా రుచిస్తే శాంతి ఏర్పడుతుంది. ఇది సంయమనం పాటించ వలసిన సమయం. మీరు ధర్మస్వరూపులు, శాంత స్వభావులూ. మీరు ఓ చిన్న దోషం చేసినా అది తెల్లని వస్త్రం మీద నల్లని మరకలా స్పష్టంగా కనినిపిస్తుంది. మీకు సుయోధనుని వలన కష్టం కలిగింది.. దానిని నీవు తుడిచి వేయాలి. యుద్ధం వలన జన నష్టం జరుగుతుంది. జయాపజయములు సుఖాన్ని ఇవ్వవు. బంధువులు, మిత్రులు, బాలలు, వృద్ధులు నశిస్తారు. అందరిని పోగొట్టుకుని ఎవరు మాత్రం సుఖ పడతారు. మీకు శ్రీకృష్ణుడు పెట్టనికోట, దృపదుడు, సాత్యకి మేరు పర్వతాలు. భీమార్జునులు అరివీర భయంకరులు ఇక నిన్ను గురించి చెప్పనవసరం లేదు. మిమ్ము దేవతలైనా జయించ లేరు. సుయోధనుని పక్షాన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, శల్యులు అతని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సుయోధనుని తమ్ములూ, కుమారులు అజేయులు. సోమదత్త, బాహ్లికులను శివుడు కూడా జయించ లేరు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడితే వినాశనం కాక ఇంకేమి మిగులుతుంది. కృష్ణార్జునలారా! మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మిగిలిన పాండవులు వారి బంధు మిత్రులందరికి సవినయంగా మనవి చేస్తున్నాను. పాండవులారా! శాంతించండి. ఆగ్రహమును వీడండి. మిమ్ము శరణు వేడుతున్నాను. ఇది సర్వలోక సమ్మతం. ఇందుకు భీష్మాదులు సంతసిస్తారు " అని పలికి కూర్చున్నాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: