31, డిసెంబర్ 2024, మంగళవారం

తిరుమల సర్వస్వం -104*

 *తిరుమల సర్వస్వం -104*

*బంగారుబావి* 

వంటశాల మెట్లను ఆనుకొని, భూమి ఉపరితలం నుండి బంగారు తాపడం చేయబడి ఉన్న బావిని *"బంగారుబావి"* గా పిలుస్తారు. మహామణిమండపం నుండి బయటకు రాగానే, మన ఎదురుగా ఉన్న కటాంజనాలలో (లోహపు ఊచల పంజరం) దీనిని చూడవచ్చు. శ్రీవారి బోజనావసరాల నిమిత్తం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. అందువలన దీనికి *"శ్రీతీర్థం"* లేదా *"లక్ష్మీతీర్థం"* అనే నామాంతరాలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఆ బావి శిథిలం చెందగా, తొండమాన్ చక్రవర్తిగా పునర్జన్మించిన రంగదాసు అనే శ్రీవారి భక్తుడు,, స్వామివారి ఆనతి మేరకు దీనిని పునరుద్ధరించాడు. శ్రీవారి అభిషేకానికి కావలసిన శుధోదకాన్ని వెయ్యేళ్ళ క్రితం వరకు పాపనాశన తీర్థం నుండి, ఆ తరువాత ఆకాశగంగాతీర్థం నుండి "తిరుమలనంబి" అనే భక్తుడు తీసుకు వచ్చేవారు. తరువాతి కాలంలో తిరుమలనంబి గురువుగారైన యామునాచార్యులవారు, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిచే నిర్మించబడిన తీర్థం స్వామివారి చెంతనే ఉండగా, వేరే తీర్థాలనుండి అభిషేకజలం తీసుకు రావాలసిన అవసరం లేదని భావించినప్పటినుండి, ఈ బంగారుబావి లోని పవిత్రజలాలను శ్రీవారి వంటకాలు, అభిషేక, అర్చనాదుల నిమిత్తం ఉపయోగిస్తున్నారు. ఈ బావిలోని నీరు "సుందరుడైన " స్వామివారికి ఉపయోగపడుతుంది కనుక దీనిని *"సుందరస్వామి కూపం"* లేదా *"సుందరబావి"* అని కూడా పిలుస్తారు. ఆ రోజుల్లో స్వామివారిని *"సుందరస్వామి"* గా కూడా కీర్తించేవారు. అయితే, శుక్రవార అభిషేకానికి మాత్రం ఆకాశగంగాతీర్థం నుండి మూడు బిందెల అభిషేకజలాన్ని "తోళప్పాచార్యులు" గా పిలువబడే తిరుమలనంబి వంశీయులు తెచ్చే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. పూర్వకాలంలో ఈ బావి నుండి అమర్చిన రాతి కాలువ ద్వారా నీరు వంటశాల లోనికి నేరుగా చేరుకునేది. తరువాతికాలంలో నీటికుండలతో చేదటం ద్వారా, ప్రస్తుతం విద్యుత్ ద్వారా ఈ బావిలోని నీటిని తోడుతూ వంటలకు ఉపయోగిస్తున్నారు. వేలాది సంవత్సరాల క్రిత నిర్మించబడ్డ ఈ బావి ఇప్పటికీ పానయోగ్యమైన జలాన్ని ప్రసాదించటం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి మహాత్మ్యమే! ఈ మధ్యకాలంలో, కొండపై గుడి చుట్టూ అనేక నివాసగృహాలు రావడంతో నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉండటంవల్ల, సిమెంటు తాపడంతో ఆ అవకాశం లేకుండా చేసి పాపనాశన తీర్థంలోని నీటితో ఈ బావిని నింపుతున్నారు. 





*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

కామెంట్‌లు లేవు: