☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(ఆరవ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*మనువడు పరీక్షిత్తుని చూసి ధర్మరాజు ఉప్పొంగిపోయాడు. ఆ సందర్భంగా అనేక దానధర్మాలు చేశాడు. జోస్యులను రప్పించి, పరీక్షితుని జాతకాన్ని పరీక్షించి చెప్పమన్నాడు. పరీక్షించి వారిలా చెప్పారు. ‘‘పరీక్షిత్తు పరమ భాగవతోత్తముడు అవుతాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందుతాడు.’’ ధర్మరాజు ఆ మాటలకి ఎంతగానో ఆనందించాడు.‘ ‘ఇంకా వినండి మహారాజా! ఈ పరీక్షిత్తు ప్రహ్లాదునిలా మహా భక్తుడై మీ వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు తెస్తాడు. ఇక్ష్వాకులా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. శ్రీరాముడిలా పుణ్య పురుషుడవుతాడు. శిబిచక్రవర్తిలా మహాదాత అవుతాడు. పరాక్రమంలో సాటిలేని వాడయి, అనేక అశ్వమేధాలు చేస్తాడు. శుకయోగితో తత్త్వోపదేశం పొంది, గంగానదిలో దేహాన్ని త్యజించి, చివరికి విష్ణుపదం చేరుకుంటాడు.’’ అన్నారు జోస్యులు.*
*వారు చెప్పినట్టుగానే, ధర్మరాజు అనంతరం, పరీక్షిత్తు హస్తినాపురానికి రాజయ్యాడు. సమస్త భూమండలాన్నీ అనేక సంవత్సరాలు పాలించాడు. జగత్ప్రసిద్ధుడయ్యాడు. పరీక్షిత్తు భార్య ఉత్తరుని కుమార్తె ఇరావతి. వారికి జనమేజయుడు సహా నలుగురు కుమారులు జన్మించారు.*
*ద్వాపరయుగం ముగిసిపోయింది. కలియుగం ప్రవేశించింది. తన రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలుసుకున్నాడు పరీక్షిత్తు. అతన్ని నిలువరించేందుకు చతురంగ బలాలతో, శస్త్రాస్త్రాలు పూని బయల్దేరాడు. అవక్ర విక్రమంతో భద్రాశ్వకేతుమాల భారతోత్తర కురుకింపురుషాది వర్షాలన్నీ జయించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. హరి భక్తులకు అపరిమితంగా దానధర్మాలు చేశాడు. భగవద్భక్తితో రాజ్యపాలన చేస్తూ పూర్వీకుల కథలు వినసాగాడు. రోజులు గడుస్తున్నాయి.*
*ధర్మదేవత వృషభరూపం ధరించింది. ఒంటికాలిపై తిరగసాగింది. భూమాత గోవు రూపం ధరించింది. దూడను పోగొట్టుకున్నదానిలా దుఃఖించసాగింది. రెండూ కలుసుకున్నాయి ఓ రోజు. ఏడుస్తున్న గోవుని చూసి వృషభం అడిగిందిలా.‘ ‘ఎందుకు ఏడుస్తున్నావు?’’*
*‘‘ఏం చెప్పమంటావు? శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆ వియోగాన్ని భరించలేకుండా ఉన్నాను. ఈ బాధ చాలదన్నట్టుగా ఇప్పుడు కలి ప్రవేశించింది.’’ అన్నది గోవు.*
*అవునవునన్నట్టుగా తలూచింది వృషభం. గోవును బాధగా చూసింది.‘ ‘అయినా నీకు తెలియనిది ఏముంది ధర్మమూర్తీ? మూడు పాదాలు పోగొట్టుకున్నావు. ఒంటి పాదం మీద నడుస్తున్నావు. ఎంత బాధ పడుతున్నావో! లోకంలో అవినీతి, అధర్మం పెచ్చు పెరిగిపోయాయి. ఇక దిక్కెవరు మనకి? అందుకే ఈ కన్నీరు.’’ అంది గోవు.*
*అప్పుడు ఆ రెండూ కురుక్షేత్ర ప్రాంతంలో సరస్వతినదీ తీరాన నిలిచి ఉన్నాయి. పరీక్షిన్మహారాజు అటుగా రాసాగాడు. వస్తున్న అతనికి ఓ దృశ్యం కనిపించింది. అబ్రాహ్మణుడొకడు, రాజులా వేషం వేసుకుని, కొరడా పట్టుకుని కొడుతూ, నిలిచి ఉన్న గోవునీ, వృషభాన్నీ కాళ్ళతో తంతున్నాడు. వృషభం చాలా తెల్లగా ఉంది. దానికి ఒకటే కాలు. అబ్రాహ్మణుడు హింసకి అది తట్టుకోలేక ఒంటి కాలితో పడుతూ లేస్తూ ఉన్నది. భయంతో మలమూత్రాలు విసర్జిస్తూంది. గోవు కూడా అతని హింసను భరించలేక ‘అంబా’ అని గగ్గోలు పెడుతూ కన్నీరు కారుస్తూంది.ఆ దృశ్యాన్ని తట్టుకోలేకపోయాడు పరీక్షన్మహారాజు.*
*పరుగున వచ్చాడక్కడికి.‘‘పాపాత్ముడా! ఎవడ్రా నువ్వు? చూస్తే రాజులా ఉన్నావు. చేసే పనేమో మూగజీవాల్ని హింసిస్తున్నావు. నిన్ను క్షమించ కూడదు. నీకు చావు తప్పదు.’’ అన్నాడు పరీక్షిన్మహారాజు. తెల్లగా వెలుగులీనుతున్న వృషభాన్ని చూశాడు. సాలోచనగా అన్నాడిలా.‘‘వృషభరాజా! ఎవరు నువ్వు? నిజం చెప్పు. నాకేమో నువ్వు వృషభరూపాన్ని ధరించిన ధర్మదేవతలా ఉన్నావు. మూడు కాళ్ళు ఎలా పోగొట్టుకున్నావు. ఒంటికాలి మీద ఈ కుంటి నడక ఎందుకు ప్రాప్తించింది? నిన్నిలా చేసింది ఎవరు? ఈ అబ్రాహ్మణుడా? చెప్పు, వెంటనే ఇతన్ని హత మారుస్తాను.’’ ‘‘మహారాజా! ధర్మాధర్మ విచక్షణ చేయగల మహనీయుడవు నువ్వు. నాకీ కష్టాన్ని కలిగించిందెవరో నీకు తెలియదా? తెలియకపోతే తెలుసుకో, తెలుసుకుని ఏం చేయాలో కూడా నువ్వే నిర్ణయించుకో.’’ అన్నది వృషభం.*
*ఆలోచించాడు పరీక్షిత్తు. సర్వం తెలుసుకోగలిగాడు. అనుమానం లేదు, ధర్మదేవతే ఈ వృషభం అనుకున్నాడు.*
*ధర్మదేవతకు నాలుగు పాదాలు. అవి: ఒకటి తపస్సు, రెండు శౌచం, మూడు దయ, నాలుగు సత్యం. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. త్రేతాయుగంలో మూడుపాదాలతో నడిచింది. ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడిచి, ఇప్పుడీ కలియుగంలో మూడు కాళ్ళు పోగొట్టుకుని, సత్యం అనే ఒంటికాలితో కుంటుతోంది. ఆ కాలుని కూడా తెగ నరికేందుకు ప్రయత్నిస్తున్నాడు కలిపురుషుడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి