11-37-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే |
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్ ||
తా:- మహాత్మా! అనంతరూపా! దేవదేవా! జగదాశ్రయా! సత్, అసత్తులకు (స్థూలసూక్ష్మజగత్తుల రెండింటికిని) పరమైనట్టి అక్షర (నాశరహిత) పరబ్రహ్మ స్వరూపులు మీరే అయియున్నారు. బ్రహ్మదేవునకుగూడ ఆదికారణరూపులును, కనుకనే సర్వోత్కృష్టులు నగు మీకేల నమస్కరింపకుందురు? (వారి నమస్కారములకు మీరు తగుదురు అని భావము).
వ్యాఖ్య:- ‘సదసత్తత్పరమ్’ - పరమాత్మ సత్, అసత్తులకు పరమైనవాడు. సత్ అనగా - స్థూలపదార్థము (లేక స్థూలజగత్తు). అసత్ అనగా సూక్ష్మపదార్థము, (లేక సూక్ష్మజగత్తు). ఆ రెండింటికిని పరమాత్మ విలక్షణమై పరమై వర్తించునని భావము. లేక ‘సత్’ అనగా మనస్సనియు, ‘అసత్’ అనగా దేహమనియు చెప్పవచ్చును. అపుడును ఇదియే అర్థమిచ్చును. స్థూలమగు భౌతికప్రపంచమైనను, సూక్ష్మమగు మనఃప్రపంచమైనను రెండును పరమార్థదృష్టిలో మిథ్యాభూతములే యగును. పరమాత్మయొకడే సత్యవస్తువు. కావుననే మిథ్యాభూతములగు ఆ దృశ్యజగత్తులకంటె ఆతడు పరమైనవాడని యిట పేర్కొనబడినది.
ప్ర:- పరమాత్మ యెట్టివాడు?
ఉ:- (1) సర్వశ్రేష్ఠుడు (2) బ్రహ్మదేవునకున్ను ఆదికారణుడు (3) అనంతుడు (4) దేవతలకును ప్రభువు (5) జగదాశ్రయుడు (6) నాశరహితుడు (7) సదసత్తులకు పరమైనవాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి