31, డిసెంబర్ 2024, మంగళవారం

⚜ *శ్రీ ఇమాయవరప్ప పెరుమాళ్ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 548*


⚜ *కేరళ  : కన్నూర్* 


⚜ *శ్రీ ఇమాయవరప్ప పెరుమాళ్ ఆలయం*



💠 ఇది 108 శ్రీవైష్ణవ దివ్య దేశాలలో 64వ దివ్యదేశము.

శ్రీ ఇమాయవరప్ప పెరుమాళ్ ఆలయం కేరళలోని చెంగన్నూర్‌లోని 5 పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది


💠 శ్రీ ఇమాయవరప్ప పెరుమాళ్ దేవాలయం మహాభారత ఇతిహాసానికి సంబంధించినది కాబట్టి, విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణునికి అంకితం చేయబడిందని నమ్ముతారు. 


🌀 *స్థలపురాణం* 🌀


💠 ఈ దివ్యదేశము ఉన్న స్థలము

 " తిరుచిత్రారు " అని పిలువబడుచున్నది . 

భస్మాసురుని చరిత్రము సుపరిచితమే కదా ! 


💠 పద్మాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి మెప్పించెను . 

శివుడు ప్రత్యక్ష మిచ్చి వరము కోరుకొనుమనగా , తాను ఎవరి తలపై చేయి ఉంచునో అతడు భస్మమై పోవునట్లు వరమీయ వలయునని కోరినంత , శివుడు చేయునది లేక అట్లే వరమిచ్చెను .

 అందుచేతనే ఆ పద్మాసురునికి భస్మాసురుడు అని పేరు వచ్చినది .


💠 వరము పొందిన ఆ అసురుడు పరమశివుని తలపైననే చేయి ఉంచి పరీక్షించబోయెను . 

శివుడు ఉపాయము తోచక పరుగెత్త నారంభించెను . 

అంతట శ్రీమహావిష్ణువు శివుని అవస్థ తెలుసుకొని చతుర్దశ భువన మోహనమైన తన మోహినీ రూపమున ఆ అసురుని కంటబడునట్లు పోయెను . 


💠 పద్మాసురుడు మోహిని రూప లావణ్యములను చూచి , సర్వమును మరచి , తనను వరించి తనతో సుఖింపుము అని మోహినిని కోరెను . మోహిని రూపమున ఉన్న విష్ణువు అట్లే అని అంగీకరించి , తనతో సుఖము పొందుటకై ముందు సుగంధమునిచ్చు తైలమును ఆపాదమస్తకము మర్దించుకొని అభ్యంగస్నానము చేసిరావలయునని కోరగా , మహా ఆనందముతో ఆ అసురుడు తైలమును తలపై మర్దించుకొనుటకై చేయి ఉంచు కొనినంతనే భస్మమై పోయెను . 

 

💠 ఈ పురాణమును మరియొక విధముగా కూడ చెప్పుదురు . మోహిని , అసురుడు తనతో సుఖించుటకు ముందు తన వలెనే నాట్యముచేయ వలయునని కోరి , 

ఆ నాట్యములో తన్మయుడైన సమయమున తలపై చేయి ఉంచుకొనునట్లు చేయగా అసురుడు భస్మమై పోయెను . 

ఏది ఏమయినను శివుని రక్షించుటకై శ్రీమహావిష్ణువు తన మోహిని అవతారము గ్రహించిన తరుణమున ఆ రూపమును చూచి మతిచంచలుడైన శివుడు పరవశుడై అయ్యప్పస్వామి జన్మమునకు కారణ భూతుడయ్యెను . 


💠 ఆ విధముగా పద్మాసురుని వధ నిమిత్తమై శ్రీమన్నారాయణుడు పరమేశ్వరునికి ప్రత్యక్షము నిచ్చిన స్థలమిది . 

 

💠 పురాణాల ప్రకారం, పాండవ యువరాజులు, పరీక్షిత్తును హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత తీర్థయాత్రకు బయలుదేరారు. 

పంబా నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు , ప్రతి ఒక్కరు కృష్ణుడి యొక్కవిగ్రహం ఏర్పాటు చేసినట్లు నమ్ముతారు; 


💠 యుధిష్ఠిరునిచే త్రిచిట్టట్ మహావిష్ణు దేవాలయం , 

భీమునిచే పులియూర్ మహావిష్ణు దేవాలయం , 

అర్జునుడిచే అరన్ముల పార్థసారథి దేవాలయం , 

నకులచే తిరువన్వండూర్ మహావిష్ణు దేవాలయం మరియు సహదేవునిచే త్రికోడితానం మహావిష్ణు దేవాలయం . 


💠 మహాభారత యుద్ధమున పాండవ అగ్రజుడైన యుధిష్ఠిరుడు ( ధర్మరాజు ) ఎల్లప్పుడు సత్యవర్తనుడు , ధర్మమును ఆచరించు వాడు అయి కూడ సమయావసరమున అశ్వత్థామ చనిపోయెనని బిగ్గరగా అరచెను . 

నిజముగా అశ్వత్థామ అను ఒక ఏనుగు హతమైనది . 

ఆ విధముగా ధర్మరాజు పలికినది నిజమే కాని ఉద్దేశ్యము వేరుగా నుండినది . 


💠 అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. అది నమ్మి , ధర్మరాజు అసత్యములు చెప్పడు అను నమ్మిక వలన , తన కుమారుడు మరణించెనని దుఃఖముతో  ద్రోణుడు అస్త్రములను వదలి వెంటనే చనిపోయెను . 

ధర్మరాజు అశ్వత్థామ అను పేరుగల ఏనుగు చనిపోయి తన ఉచ్చారణాను సారము సత్యమునే వచించినను , ఉద్దేశ్యము వేరొకటి కావున , తనను అపరాధిగానే భావించుకొని పరిహారార్థమై ఈ దివ్యదేశమున పెరుమాళ్ ను పూజించి , గొప్ప ధ్యానము చేసి , పెరుమాళ్ కు గొప్ప మందిరమును నిర్మించెను . 


💠 ఆ విధముగా ఈ దివ్యదేశము మహాభారత యుద్ధమునకు ముందే వెలసినది అని తెలియు చున్నది .


💠 శివుడు మరియు శ్రీమన్నారాయణన్ సమానమని వివరించడానికి, ఈ స్థలంలో చాలా పెద్ద శివాలయం కూడా ఉంది. 


💠 పశ్చాత్తాపం, గందరగోళం మరియు వారు చేసిన తప్పుడు పనుల గురించి ఆలోచిస్తూ మనశ్శాంతిని కోరుకునే వారు ఈ దేవాలయానికి వచ్చి భగవంతుడిని పూజించి, మనశ్శాంతి మరియు ప్రశాంతతను పొందవచ్చు. ఇవే కాకుండా, భక్తులు భయాన్ని వదిలించుకోవడానికి, రోగాల నుండి విముక్తి పొందడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మరియు అడ్డంకులను తొలగించడానికి పూజ కోసం కూడా ఆలయానికి వస్తారు. 

ఈ ఆలయంలో భక్తులకు పాలను సమర్పిస్తారు.



💠 రోడ్డు మార్గంలో- 

జాతీయ రహదారి NH 47 నగరం గుండా వెళుతుంది, కోయంబత్తూర్, ఎర్నాకులం, త్రిస్సూర్, కొల్లాం, త్రివేండ్రం మొదలైన ఇతర ప్రధాన నగరాలకు నగరాన్ని కలుపుతుంది. 

రాష్ట్రం అన్ని ఇతర ప్రధాన నగరాల నుండి నగరాన్ని కలుపుతూ KSRTC బస్సులను నడుపుతుంది.

కామెంట్‌లు లేవు: