*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*
*242 వ రోజు*
విరాటుడు, ఉపపాండవులు, అభిమన్యుడు అక్కడకు చేరుకుని భీష్మునికి తోడుగా ఉన్న వారిపై లంఘించారు. భీష్ముడు ఏభై బాణాలతో అర్జునిని బాధించాడు. ఆ బాణములను లక్ష్య పెట్టక అర్జునుడు కౌరవ సేనలపై విజృంభించి వారిని తరిమి తరిమి కొట్టాడు. అర్జునుడు తన రధాన్ని కౌరవ సేనల మధ్యకు నడిపి వారిని విచక్షణా రహితంగా చీల్చి చెండాడాడు. రధికులను సారధూలను హయములను తెగ నరికాడు. అర్జునిని పరాక్రమానికి కౌరవ సేనలు భయపడ్డాయి. ఇది చూసిన దుర్యోధనుడు " అర్జునుడు మన సేనలను విచక్షణా రహితంగా చంపుతున్నాడు అతడిని ఎదుర్కొన గలిగిన కర్ణుని యుద్ధానికి రానివ్వక మీరూ ఇలా చూస్తూ ఊరు కోవడం ఏమన్నా బాగా ఉందా " అన్నాడు. భీష్ముడు " నా శాయ శక్తులా యుద్ధంచేస్తున్నా ఇలా అంటున్నాడేమిటి " అని అనుకుని అర్జునుని వైపు రథం మళ్ళించి వికర్ణుడు, అశ్వధ్ధామ వెంట రాగా అర్జునిపై ఒక్క సారిగా లంఘించి బాణ వర్షం కురిపించాడు. అర్జునునికి సాయంగా నకుల సహదేవులు, భీముడు, ధర్మరాజు వచ్చారు. అర్జునినికి గాంగేయునకు మధ్య పోరు లోకభీకరంగా జరిగింది. భీష్ముడు శ్రీకృష్ణుని గుండెలకు తాకేలా బాణప్రయోగం చేసాడు. అది శ్రీకృష్ణుని గుండెను చీల్చి రక్తం పైకి చిమ్మింది. అది చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోతూ భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. ఆ బాణములను తిప్పికొట్టడమే కాక అర్జునుని రథాన్ని శరములతో ముంచెత్తాడు. ఇలా ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుండగా మధ్యాహ్నం అయింది.
*పాంచాల సేనలు ద్రోణుల మధ్య సమరం*
మధ్యాహ్నసమయం వరకు యుద్ధం సాగిన పిదప ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రథాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు. ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారథిని కొట్టి, తరువాత నాలుగు బణాలు వేసి అశ్వాలను చంపాడు. అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు అయినా ధృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు. ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు. ద్రోణాచార్యుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ధృష్టద్యుమ్నునిపై శరపరంపర కురిపించాడు. ధృష్టద్యుమ్నుడు వాటిని సర్ధవంతంగా ఎదుర్కొని ద్రోణిపై శరపరంపర కురిపించాడు. ఇలా ఇరువురి నడుమ భంయంకరమైన పోరు కొనసాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపై గదాయుధం ప్రయోగించాడు ద్రోణుడు దానిని పొడి చేసాడు. ధృష్టద్యుమ్నుడు బల్లెం విసిరాడు. ద్రోణుడు దానిని కూడా విరిచాడు. మరొక విల్లు తీసుకుని ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపైన శరపరంపర కురిపించాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారథిని, హయములను చంపి విల్లును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు రథము దిగి గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణుని పై విసిరాడు. ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేసాడు. ధృష్టద్యుమ్నుడు కరవాలంతో విజంభించాడు. ఇలా ఇరువురి నడుమ ఘోర యుద్ధం కొనసాగింది. ద్రోణుని శరపరంపరకు ధృష్టద్యుమ్నుడు తట్టుకోలేక పోయాడు. ఇది చూసిన భీముడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ద్రోణునిపై ఏడు బాణములు వేసి ధృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగ రాజుకు సైగ చేసి భీముని ఎదుర్కొనమని చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి