24, డిసెంబర్ 2024, మంగళవారం

తిరుమల సర్వస్వం -97*

 *తిరుమల సర్వస్వం -97* 


*పురాణేతిహాసాల ననుసరించి:* 

*శ్రీరంగనాథుడు* 

*తిరుమల వేంకటేశుడు* 

*కంచి వరదరాజస్వామి* 

ఈ ముగ్గురి మూర్తులు మూడుకోణాలుగా ఏర్పడే త్రిభుజాకారంలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మనం వెండివాకిలి దాటినది మొదలు, శ్రీవారి దర్శనం పూర్తయ్యేంత వరకూ ఈ త్రిభుజాకారం లోనే గడుపుతాం. ఎంతో దూరాలోచనతో, మన పూర్వీకులు ఆలయ సందర్శనార్ధం వచ్చే భక్తులకు అపారమైన దైవికశక్తిని ప్రసాదించడం కోసం ఈ మూర్తులను ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన ఆ ద్రష్టలను మనసులోనే స్మరించుకొని శ్రీవారి దర్శనార్థం ముందుకు సాగుదాం.

*గరుడాళ్వార్ సన్నిధి*

శ్రీరంగనాథస్వామి కుడ్యప్రతిమకు ఎడంప్రక్కన ఉన్న కటాంజన ద్వారంలో ప్రవేశించి, క్యూ మార్గంలో కుడిప్రక్కకు తిరగగానే, కొన్ని అడుగుల దూరంలో మనకు తూర్పుదిశగా, పంచభూతాల సమ్మేళనం గా భావించబడే *"గరుడు"* ని ఆలయం కనబడుతుంది. అదే *"గరుడాళ్వార్ సన్నిధి".* 

1512వ సం. లో ఎవరో అజ్ఞాతభక్తుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింప జేశాడు. శ్రీమహావిష్ణువు పరివారదేవత, వారి సేవకులలో ముఖ్యుడైన గరుత్మంతుని గురించి ఇంతకుముందే *"శ్రీవారి బ్రహ్మోత్సవాలు – గరుడవాహనం"* ప్రకరణంలో విస్తారంగా తెలుసుకున్నాం.

 సరిగ్గా శ్రీవారి బంగారువాకిలికి ఎదురుగా, శ్రీవారిని సతతం దర్శించుకుంటూ, నమస్కారభంగిమలో, రెక్కలు విప్పార్చుకున్నట్టి ఆరు అడుగుల గరుత్మంతుని విగ్రహం నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. ఈ సన్నిధి గోపురంపైన ఉన్న మూడు బంగారు కలశాలను మనం విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే, శ్రీరంగనాథుని మూర్తి ఉపరితలభాగంపై చూడవచ్చు. శ్రీవారి ముల్లోకవిహారానికి ఎల్లవేళలా సన్నద్ధుడై, అబద్ధునిగా ఉండే గరుత్మంతుణ్ణి మనఃపూర్వకంగా నమస్కరించుకుని, ఆ తరువాతే తన దర్శనం చేసుకోవడం శ్రీనివాసునికి సంతోషదాయక మని చెప్పబడుతుంది

. *మహామణి మండపం లేదా, తిరుమామణిమండపం* 

క్యూ మార్గంలో నడుస్తూనే గరుత్మంతుని దర్శనం చేసుకుని, ఆనందనిలయానికి ప్రధాన ద్వారమైన బంగారువాకిలి ఎదురుగా ఉన్న *"ఘంటామండపం"* లేదా *"మహామణిమండపం"* లోనికి ప్రవేశించాము. ఈ మంటపం ఈ క్రింది విధంగా అనుసంధానిస్తూ, దాదాపుగా చతురస్రాకారంలో ఉంటుంది. తూర్పుదిక్కున గరుడాళ్వార్ సన్నిధిని, పడమరదిక్కున బంగారువాకిలిని, ఉత్తరదిక్కున హుండీని, 

తూర్పుదిక్కున విమానప్రదక్షిణాపథాన్ని. 

ఈ మండపం పైకప్పుకు ఆధారంగా ఉన్న 16 శిలా స్తంభాలపై శ్రీమహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరుడు, వరదరాజస్వామి, ఆదివరాహస్వామి యొక్క ఆకృతులు కడు రమణీయంగా చెక్కబడి ఉంటాయి. పైకప్పు అంతా అత్యద్భుతమైన పౌరాణిక ఘట్టాలు మలచబడి, బంగారు తాపడంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. 15వ శతాబ్దం ప్రారంభంలో, చంద్రగిరికి చెందిన ఓ విజయనగర పాలకుని ద్వారా నిర్మింపబడ్డ ఈ మండపంలోనే, ప్రతిరోజు సుప్రభాత సమయంలో స్వామివారికి మేలుకొలుపులు పాడుతారు. ప్రతి బుధవారం, ఈ మంటపంలోనే, ఆర్జిత సేవయైన *"సహస్రకలశాభిషేకం"* కూడా జరుగుతుంది. ఈ మండపంలో, బంగారువాకిలికి ఎడమప్రక్కగా రెండు పెద్ద ఘంటలు వ్రేలాడదీయబడి ఉంటాయి. తమిళంలో *"మహామణి"* అంటే *"పెద్దఘంట"* అని అర్థం. అందువల్లనే ఈ మంటపానికి ఆ పేర్లు వచ్చాయి. ఈ ఘంటలను మ్రోగించే ఆలయ పరిచారకులను *"ఘంటాపాణి"* గా పిలుస్తారు. ఈ ఘంటానాదం విన్న తరువాతనే, చంద్రగిరిలో నివసించే స్వామివారి వీరభక్తులైన విజయనగర రాజులు ఆహారాన్ని స్వీకరించేవారట. ఆ సాంప్రదాయం చాలామంది తిరుమల వాసులు నేటికీ కొనసాగిస్తున్నారు. 

ఈ రెండు ఘంటలలో ఒక దానిని *"నారాయణఘంట"* గానూ, రెండవ దానిని *"గోవిందునిఘంట"* గానూ వ్యవహరిస్తారు. ఒకప్పుడు బంగారువాకిలికి ఇరు ప్రక్కలా ఉండే ఈ రెండు ఘంటలను ప్రస్తుతం ఒక పార్శ్వానికి చేర్చి, రెండింటిని ప్రక్క- ప్రక్కనే అమర్చారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

కామెంట్‌లు లేవు: