*2090*
*కం*
విధులను తప్పించుకొనగ
విధి నిన్నిల వేరు విధుల వేధించునయా,
విధులను నిర్వర్తించగ
విధి నీవెంబడి సహకరించు వివిధము(వితతము) సుజనా.
*భావం*:-- ఓ సుజనా! విధులను(కర్తవ్యాలను అంటే తప్పకుండా చేయవలసిన పనులను) తప్పించుకుంటే విధి(బ్రహ్మ) నిన్ను వేరే రకరకాలుగా బాధపెడుతుంది. అదే విధులను నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తే ఆ విధి (బ్రహ్మ) యే నీకు తోడుగా ఉండి పలువిధాలుగా సహాయం చేస్తుంది.
*సందేశం*:-- కర్తవ్యాలను ఎన్నడూ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయవద్దు, దాని వలన ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. చెడ్డ పేరు కూడా వస్తుంది. అదే కర్తవ్య నిర్వహణ చేస్తే కష్టాలు తగ్గుతాయి, మంచి పేరు కూడా వస్తుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి