🕉 మన గుడి : నెం 968
⚜ కేరళ : గురువాయూర్
⚜ గురువాయురప్పన్ శ్రీ కృష్ణ ఆలయం
💠 స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం 3 లోకాలూ కలిసిన భూలోక వైకుంఠం, గురువాయూరులోని శ్రీ గురువాయూరప్పన్ కృష్ణ దేవాలయం.
అప్పన్ అంటే ప్రభువు లేదా తండ్రి కాబట్టి గురువాయూర్ ప్రభువు అని అర్థం.
💠 జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించవల్సిన క్షేత్రాలలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి గురువాయూర్.
5 వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని గురువాయరప్పన్ విగ్రహం ఎంతో పౌరాణిక ప్రాశస్త్యమైనది.
💠 గురువాయూర్ ఆకర్షణలలో ఈ కృష్ణుడి విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ.
విగ్రహానికి 4 చేతులలోను శంఖం, సుదర్శన చక్రం, కౌముదకి మరియు ఒక పద్మం ఉంటాయి. ఈ దేవాలయం అక్కడకు వచ్చే భక్తుల సంఖ్యను బట్టి దేశంలో 4వ పెద్ద దేవాలయంగా చెపుతారు.
ఈ దేవాలయం భూలోక వైకుంఠమని ఇక్కడ విష్ణుమూర్తి నివసిస్తాడని విశ్వసిస్తారు.
ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.
🔆 స్థల పురాణం
💠 ఈ ఆలయాన్ని గురించీ, ఆలయంలోని విగ్రహాన్ని గురించీ నారదపురాణంలో విచిత్రమైన వృత్తాంతం ఉంది.
పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశ రుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి.
💠 స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి.
ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి (గురువు)- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట.
అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట.
అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం.
ఆ కోనేరే నేటి రుద్రతీర్థం.
💠 గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది.
ఇప్పుడు మనం దర్శించే విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుఁడు స్వయంగా అర్చించిన అర్చామూర్తి, కాబట్టి ఈ గురువాయరప్పన్ మహిమలు వర్ణనాతీతం.
ప్రతినిత్యం వివధ అలంకారాలతో దర్శనమిస్తాడు గురువాయారప్పన్.
💠 ఇక్కడి శ్రీకృష్ణుడి చిన్న విగ్రహం ప్రత్యేక ఔషధ గుణాలు కలిగి ఉన్న అయస్కాంత రాయి.
ప్రతిరోజు ఉదయం స్వామికి నూనెతో అభిషేకం చేస్తారు. అప్పుడు అతను "వాకా" అని పిలవబడే మూలికలతో తయారు చేయబడిన ఒక ప్రత్యేక ప్రక్షాళన పొడితో చల్లబడుతుంది. ఈ పొడి లేత గోధుమ రంగులో ఉంటుంది మరియు విగ్రహానికి అదనపు రంగును ఇస్తుంది.
ఈ మనోహరమైన దృశ్యాన్ని చూసేందుకు జనాలు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయానికి వెళతారు. ఆ తర్వాత ఆలయంలోని నీటిని, మంత్రాలతో పవిత్రం చేసి, అతని కర్మ స్నానం కోసం విగ్రహంపై పోస్తారు. ఈ పవిత్ర జలాన్ని భక్తులు ఆసక్తిగా తాగుతారు, ఎందుకంటే విగ్రహం తయారు చేయబడిన రాయి యొక్క అద్భుత లక్షణాలను కలిగి ఉంటుంది.
💠 స్వామి విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుంది. శంఖ చక్ర గదా పద్మాలను నాలుగు చేతుల్లో ధరించి తులసిమాల మెడలో వేసుకుని భక్తుల కోరికలను కోరకుండానే తీర్చేందుకు సిద్ధంగా కూర్చున్న చిన్ని కృష్ణయ్యను చూస్తేనే పాపాలు పరిహరించినట్టు తోస్తుంది.
💠 తెల్లవారు జాము 3 గంటల నుండి రాత్రి పది గంటల వరకు పూజలు, సేవలు జరుగుతూనే ఉంటాయి.
మధ్యాహ్న సమయంలో వివాహ కార్యక్రమాలు బహుళంగా జరుగుతాయి.
ఇక్కడ వివాహం చేసుకుంటే గృహస్థు జీవితం మంగళకరంగా ఉంటుందని పెద్దలు చెప్పారు. చాలామంది 'తులాభారం' చేస్తామని మొక్కుకుంటారు.
తక్కెడలో ఒకవైపు తాము కూర్చుని, మరోవైపు తమతో సరితూగే వెండిగాని,బంగారం కానీ, మరేదయినా ఇష్టమైన పదార్థం కానీ పెట్టి స్వామికి సమర్పిస్తారు.
💠 స్వామికి ఎన్నో ఆభరణాలు భక్తులు సమర్పించినవి ఉన్నాయి. అన్నింటిని పదిలంగా భద్రపరిచేందుకు ఒక ప్రత్యేకమైన, గది ఉంది. దాని దగ్గరకు కూడా ఎవ్వరూ వెళ్ళరు. అందులో పంచ నాగులని ఐదు పాములు ఉన్నాయట.
💠 సంగీత, నృత్య కార్యక్రమాలు కూడా ఆలయంలో జరుగుతాయి. స్వామికి రుద్ర తీర్థంలో అభిషేకం చేయిస్తారు.
సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. జయదేవుని గీత గోవిందం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథం.
శ్రీ కృష్ణ జన్మాష్టమి ఇక్కడ వైభవోపేతంగా జరుగుతుంది. అంతే కాక ఏకాదశికి సంబంధించిన పండుగలు కూడా చాలా జరుగుతాయి.
💠 ఏనుగులకు ఈ ఆలయంలో చాలా ప్రాముఖ్యం ఉంది. ఏనుగు పందాలు (పోటీలు) కూడా చాలా ఉత్సాహంతో వేడుకగా జరుగుతాయి.
💠 గురువాయూరు చాలా మహిమగల క్షేత్రం. అందువల్ల ఇక్కడ నియమాలూ, ఆచారాలూ ఎక్కువ.
'శ్రీ కృష్ణ కర్ణామృతం' వ్రాసిన బిల్వమంగళ ఠాకూర్ ఈ ఆలయాన్ని పలుమూరులు దర్శించారు.
పారమార్ధిక వైభవం గల ఈ పుణ్యక్షేత్రం నిజంగా భూలోక వైకుంఠమే,
రచన
©️ Santosh Kumar
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి