25, జులై 2020, శనివారం

అష్టమ స్కంధము - రెండవ అధ్యాయము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - రెండవ అధ్యాయము

మొసలి గజేంద్రుని పట్టుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఇచట ముందుగా

బమ్మెర పోతనగారి పద్యరత్నములు

8-47 మత్తేభ విక్రీడితము

ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా
రభటిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీన కర్కటముల న్బట్టెన్ సురల్ మ్రాన్పడన్.

తాత్పర్యము

ఆ సమయంలో, గజరాజు తొండంలోకి నీళ్ళు పీల్చు కొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి, నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పై కెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటకరాశిని పట్టుకొన్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్య చకితులు అయ్యారు.
రహస్యార్థం: ఇలా జీవుడు మానససరస్సులోని సంకల్పాలను పరిపక్వ స్థితిని కలచివేస్తుంటే, ఈశ్వరుడిలోని సూక్ష్మవృత్తులతో ఐక్యం అయ్యేడు.

8-49 సీస పద్యము

కరిణీకరోజ్ఝిత కంకణచ్ఛటఁ దోఁగి;
సెలయేటి నీలాద్రి చెలువుఁ దెగడు
హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల;
వేయిగన్నులవాని వెరవు చూపుఁ
గలభసముత్కీర్ణ కల్హార రజమునఁ;
గనకాచలేంద్రంబు ఘనతఁ దాల్చు
గుంజరీ పరిచిత కుముద కాండంబుల;
ఫణిరాజ మండన ప్రభ వహించు

8-49 ఆటవెలది

మదకరేణు ముక్త మౌక్తిక శుక్తుల
మెఱుఁగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు
వనజగేహకేళి వ్రాలునపుడు.

తాత్పర్యము

అలా గజరాజు ఎదురులేకుండా పద్మాల సరోవరంలో ఈదుతున్నాడు. అప్పుడు, ఆడ ఏనుగులు అతనిమీద నీళ్ళు చల్లాయి. ఆ నీటి లో తడిసిన అతడు సెలయేళ్ళతో ఒప్పిన నీలగిరిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని దేహం నిండా కలువపూలు నింపాయి. వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని పై కమలాల పుప్పొడి చల్లాయి. దానితో అతడు బంగారు కొండలా గొప్పగా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కలువ తూండ్లు పరిచాయి. వాటితో అతడు సర్పాలు ధరించిన శివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేభాలు అతనిమీద ముత్యాలచిప్పలు వేసాయి. దానితో అతడు మెరుపుతీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు.
రహస్యార్థం: ఆ జీవుడు, ప్రతిబంధాలు ఏవీ లేకుండా జ్ఞానంలో విహరిస్తూ, ఏనుగు నీలాద్రి మున్నగు రూపాలు పొందినట్లు, మూలాధారాది చక్రాలలో వాయువును బంధించి నపుడు, ఆయా దేవతా వర్ణాలను పొంది తుదకు పరమం అందు ఐక్యం అయ్యాడు.

8-50 వచనము

మఱియు నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహారవ్యాకులిత నూత లక్ష్మీవిభవయై యనంగ విద్యానిరూఢ పల్లవ ప్రబంధపరికంపిత శరీరాలంకార యగు కుసుమ కోమలియునుం బోలె వ్యాకీర్ణ చికుర మత్తమధుకర నికరయు; విగతరస వదనకమలయు; నిజస్థాన చలిత కుచరథాంగ యుగళయు; లంపటిత జఘనపులినతలయునై యుండె; అంత.

తాత్పర్యము

అంతేకాక ఆ గజరాజు చేసిన విశేషమైన సంచారాలతో ఆ మడుగు చక్కదనాలు చెదిరి కొత్తందాలు సంతరించుకొంది. గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్ళలో చిక్కి వణుకుతున్న కుసుమ సుకుమారిలా చక్కగా ఉంది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా, రసాన్ని కోల్పోయిన పద్మాలు ముఖంగా, చక్రవాకాలు తమ స్థానాలనుండి చెదిరిన స్తనాలుగా, నలిగిన ఇసుక తిన్నెలు అలసిన పిరుదులుగా కనిపిస్తున్నాయి.

2.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తం తత్ర కశ్చిన్నృప దైవచోదితో  గ్రాహో బలీయాంశ్చరణే రుషాగ్రహీత్|

యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథాబలం సోఽతిబలో విచక్రమే॥6385॥

రాజా! ఆ ఏనుగు ఉన్మత్తమైయున్న సమయమున ప్రారబ్ధవశమున ఒక బలిష్ఠమైన మొసలి క్రోధముతో దాని పాదమును పట్టుకొనెను. ఇట్లు అకస్మాత్తుగా ఆపదలో చిక్కుకొనిన ఆ ఏనుగు తన శక్తికొలదీ ఆ మొసలి పట్టునుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను. కాని, ఆ ఏనుగు ప్రయత్నము సఫలము కాకుండెను.

బమ్మెర పోతనగారి పద్యం

8-51-సీ.సీస పద్యము

భుగభుగాయితభూరి బుద్భుదచ్ఛటలతోఁ;
గదలుచు దివికి భంగంబు లెగయ;
భువన భయంకరఫూత్కార రవమున;
ఘోరనక్రగ్రాహకోటి బెగడ;
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల;
వశమున ఘమఘమావర్త మడరఁ;
గల్లోలజాల సంఘట్టనంబులఁ దటీ;
తరులమూలంబులై ధరణిఁ గూల;

8-51 తేటగీతము

సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె.

తాత్పర్యము

ఒక మొసలి రాజు ఆ మడుగులో ఒక మూల దాక్కొని గజరాజుని చూసాడు. భుగభుగ మని చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరాడు. మొసళ్ళు చేపలు భయపడేలా లోకానికి భీతి కలిగేలా ఫూత్కారం చేసాడు. వడికి లేచిన గాలికి ఘమఘమ అని సుడి గుండాలు లేచేలా తోక జాడించాడు. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు. రాహువు సూర్యుడిని పట్టుకొన్నట్లుగా ఆ మొసలిరాజు ఆ గజరాజుని ఒడిసిపట్టుకొన్నాడు.

2.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

తథాఽఽతురం యూథపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయసా|

విచుక్రుశుర్దీనధియోఽపరే గజాః   పార్ష్ణిగ్రహాస్తారయితుం న చాశకన్॥6386॥

ఇతర ఏనుగులు, ఆడ ఏనుగులు, వాటి పిల్లలు తమ స్వామిని బలిష్ఠమైన మొసలి పట్టుకొని బలముగా లాగుచున్నట్లు కనుగొని మిక్కిలి భయపడెను. అవి భయముతో గట్టి ఆక్రోశముతో ఘీంకరించసాగెను. పెక్కు ఏనుగులు ఆ గజేంద్రునకు తోడ్పడుటకై జలములనుండి దానిని బయటకు లాగుటకు పూనుకొనెను. ఐనను, అవి ఆ ప్రమాదమునుండి దానిని రక్షింపలేక పోయెను.

2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

నియుధ్యతోరేవమిభేంద్రనక్రయోర్వికర్షతోరంతరతో బహిర్మిథః|

సమాః సహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్రమమంసతామరాః॥6387॥

ఏనుగు, మొసలి తమ తమ శక్తినంతయును కూడ గట్టుకొని పోరాడసాగెను. ఒక్కొక్కసారి ఆ మకరము గజమును నీటిలోనికి లాగుచుండెను. మరొకసారి గజము, మకరిని బయటకు లాగుచుండెను. ఇట్లు అవి పోరాడుచుండగా వేయి సంవత్సరములు గడచిపోయెను. ఈ సంఘటనను చూచి, దేవతలు గూడ సంభ్రమాశ్చర్యములకు లోనైరి.

బమ్మెర పోతనగారి పద్యములు

8-55-వ.వచనము

ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండదండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై; యన్యోన్య విజయశ్రీ వశీకరంబులై; సంక్షోభిత కమలాకరంబులై; హరి హరియును; గిరి గిరియునుం దాఁకి పిఱుతివియక పెనంగు తెఱంగున నీరాటం బయిన పోరాటంబునం బట్టుచు వెలికి లోనికిం దిగుచుచుఁ గొలంకు గలంకంబొందఁ గడువడి నిట్టట్టుఁ బడి తడఁబడక బుడబుడానుకారంబులై బుగులు బుగు ల్లను చప్పుళ్ళతో నురువులుఁ గట్టుచు జలంబు లుప్పరం బెగయం జప్పరించుచుఁ దప్పక వదనగహ్వరంబుల నప్పళించుచు నిశితనితాంత దురంతదంత కుంతంబుల నింతింతలు తునియ లయి నెప్పళంబునం బునుక చిప్పలుఁ గుదుళ్ళుఁ దప్పి రక్తంబులుఁ గ్రమ్ముదేర హుమ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచు బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నొండొంటిం దాఁకు రభసంబున నిక్కలుబడ మ్రక్కం ద్రొక్కుచు మెండుచెడి బెండుపడి నాఁచు గుల్లచిప్ప తండంబులఁ బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు నోలమాసగొనక గెలుపు దలంపులు బెట్టిదంబులై రెట్టింప నహోరాత్రంబులుం బోలెఁ గ్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులయి నిర్గత నిద్రాహారంబులై యవక్రపరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున.

తాత్పర్యము

ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని మించి ఒకటి ఢీకొన్నాయి. వాటి పోరు అన్ని లోకాలకి భయంకరంగా సాగింది. అవి రెండు కూడ రెండవ దానిని ఓడించాలనే పట్టుదల తో మడుగునంతా కలచివేసాయి. సింహంతో సింహం, కొండతో కొండ వెనుదీయకుండ ఢీకొని పోరాడుతున్నట్లు అవి రెండు తీవ్రంగా పోరాడాయి. బయటికి లోపలికి లాగుతు, అటునిటు పడుతున్న తొట్రుపడలేదు. ఆ నీళ్ళలో బుడ బుడ బుగలు బుగలు మనే శబ్దాలు చెలరేగాయి. లేచిన నురగలు ఆకాశాన్ని తాకాయి. మొసలి ఏనుగులు రెండు ఎడతెరపి లేకుండ ముట్టెల తో తాకుతు, తలలు బద్ధలయ్యేలా, చిప్పల అమరికలుతప్పేలా, నెత్తుర్లు కారేలా హుమ్మంటు వాడి పండ్లతో పొడుచు కొన్నాయి. ఒకదానిని ఒకటి లాగేటప్పుడు కాళ్ళపట్టుతప్పిపోకుండ బలంగా నిలదొక్కుకున్నాయి. అప్పుడు సరస్సులోని నీళ్ళు వేగంగా సుళ్ళు తిరిగాయి. ఆ నీళ్ళ తాకిడికి మొసళ్ళు తాబేళ్ళు పీతలు చేపలు కప్పలు మొదలైనవి చచ్చిపోయాయి. బింకంతో వేగంగా మొసలి ఏనుగు ఒకదాని నొకటి అణగదొక్కతు చీకాకుపరచు కొంటు బాగా అలసిపోయాయి. ఒకదాని దెబ్బలనుండి ఒకటి నాచును ఆల్చిప్పలను అడ్డంవేసి తప్పించుకొసాగాయి. శరీరాల మీద ఆశలు వదలుకొన్నాయి. ఎలాగైనా గెలవాలనే కోరిక రెట్టింపు చేసుకొన్నాయి. క్రమక్రమంగా చెలరేగుతు రేయింబగళ్ళు తిండి నిద్ర లేకుండ అవి రెండు చాలా కాలం పోరాడాయి


2.30 (ముప్పదియవ శ్లోకము)

తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహానభూద్వ్యయః|

వికృష్యమాణస్య జలేఽవసీదతో  విపర్యయోఽభూత్సకలం జలౌకసః॥6388॥

ఇట్లు పెక్కు సంవత్సరములు గడచిపోగా గజేంద్రుని శరీరము శుష్కించి పోసాగెను. దాని శరీర బలము, మానసిక ఉత్సాహము సన్నగిల్లెను, శక్తియు క్షీణించెను. మొసలి జలచరమగుటచే దాని శక్తి క్షీణింపకపోగా ఇంకను వృద్ధియగుచుండెను. అది మిక్కిలి ఉత్సాహముతో బలము కొలది గజేంద్రుని నీళ్ళలోనికి లాగసాగెను.

2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

ఇత్థం గజేంద్రః స యదాఽఽప సంకటం ప్రాణస్య దేహీ వివశో యదృచ్ఛయా|

అపారయన్నాత్మవిమోక్షణే చిరం దధ్యావిమాం బుద్ధిమథాభ్యపద్యత॥6389॥

దేహాభిమానియై, తన శరీరబలమునే నమ్ముకొని యున్న గజేంద్రుడు హఠాత్తుగా ప్రాణసంకటములోబడి, తనను తాను రక్షించుకొనుటకు అన్నివిధముల అసమర్థుడాయెను. తనను కాపాడుకొనుటకు ఉపాయమును గూర్చి చాలకాలము  ఆలోచించెను. చివరకు అతడు ఒక నిశ్చయమునకు వచ్చెను.

బమ్మెర పోతనగారి పద్యములు

8-71 శార్దూల విక్రీడితము

ఏ రూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.

తాత్పర్యము

“ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏదేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పిలవాలి? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అటువంటి వారికి నమస్కారం చేస్తాను.

2.32 (ముప్పది రెండవ శ్లోకము)

న మామిమే జ్ఞాతయ ఆతురం గజాః కుతః కరిణ్యః ప్రభవంతి మోచితుమ్|

గ్రాహేణ పాశేన విధాతురావృతోఽప్యహం చ తం యామి పరం పరాయణమ్॥6390॥

2.33 (ముప్పది మూడవ శ్లోకము)

యః కశ్చనేశో బలినోఽన్తకోరగాత్ప్రచండవేగాదభిధావతో భృశమ్|

భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాన్మృత్యుః ప్రధావత్యరణం తమీమహి॥6391॥

"ఈ మొసలి తప్పక నా పాలిట మృత్యు పాశమయ్యెను. దీని చేతికి చిక్కి నేను మిక్కిలి వ్యాకులపాటునకు లోనైతిని. నాతో సమానబలముగల ఏనుగులు కూడ నన్ను ఈ పెను ఆపదనుండి రక్షింప లేక పోవుచున్నవి. ఇంక ఆడ ఏనుగులు ఎట్లు రక్షింపగలవు? కావున, ఇప్పుడు నేను సంపూర్ణ విశ్వమునకు పరమ ఆశ్రయుడైన పరమాత్మను శరణు వేడెదను. మృత్యువు ఎంతయు బలీయమైనది. అది సర్పమువలె ప్రచండ వేగముతో అందరినీ కబళించుటకు పరుగులుదీయుచుండును. దానికి భయపడి భగవంతుని శరణువేడిన వానిని ఆ పరమాత్మ తప్పక రక్షించును. అతనికి భయపడియే మృత్యువు గూడ తన పనిని చక్కగా నెరవేర్చును. అతడు అందరికిని పరమాశ్రయుడు. కావున ఆ దేవదేవుని నేను శరణుజొచ్చెదను" అని గజేంద్రుడు నిశ్చయమునకు వచ్చెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు రెండవ అధ్యాయము (2)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు: