25, జులై 2020, శనివారం

ప్రాత:స్మరణీయులు ‘నడిచే దైవం’

మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యము వహించిన ప్రాత:స్మరణీయులు ‘నడిచే దైవం’ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు. ఆయనకి పరమాచార్యని దగ్గరగా చూడాలి అని కోరిక. రెండు రోజులు ఆయన విడిది చేసిన చోటుకి వెళ్ళాడు. విపరీతమైన జనము వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. దూరమునుండి చూసి ఆయన దగ్గరకి ఎలా వెడతాను ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు. వెళ్ళడము అనవసరము అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడనుండే ఒక నమస్కారము అని పడుకున్నాడు.

పరమాచార్యస్వామి తెల్లవారుఝామున రెండు గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలు దేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు. ఆయన పరబ్రహ్మ స్వరూపులు, త్రికాల వేది ఆయనకి తెలియనిది ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటిముందు వెళ్ళి నించున్నారు. ఆయన ఇల్లాలు కళ్ళాపి చల్లడానికి బయటికి వచ్చింది. కళ్ళాపి చల్లి పక్కకు చూస్తే చలికాలము అవడము వలన మహాస్వామి ముడుచుకుని కూర్చుని జపము చేసుకుంటున్నారు. ఆమె హడలిపోయింది. నడిచే దేవుడని పేరుగాచిన వ్యక్తి, ప్రపంచములో కొన్ని కోట్లమంది ఆయన తన పాదములను తలచుకుని నమస్కరిస్తారు. అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు.

పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్ర మంచము మీద నుండి దూకి బయటికి వచ్చి నేలమీద పడి నమస్కరించి ఏడుస్తూ మహానుభావా మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు. ఆయన అతణ్ణి చూసి “రెండు రోజులుగా నా దగ్గరకి వస్తున్నావుగా. ఈయన దగ్గరకు వెళ్ళగలనా మనని పలకరిస్తారా అనుకున్నావు. ధర్మానుష్ఠానము చేసేవాడి దగ్గరకు నేను రాను అనుకున్నావు అందుకే నేనే వచ్చాను” అన్నారు. తణుకు వద్ద జరిగినది ఈ సంఘటన.

మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు. పటాటోపములకు వారి ఆకర్శితులు కారు. ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానము చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. సత్పురుషుల దృష్టిలో పడటము జీవితములో గొప్ప అదృష్టము. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టము ఇంకోటి లేదు.

కామెంట్‌లు లేవు: