25, జులై 2020, శనివారం

గురుపూజోత్సవాలు



సెప్టెంబర్ 5 వ తేదీన గురుపూజోత్సవం. విద్యాబోధన పరమార్ధం, ఉపాధ్యాయుల కర్తవ్యం గురించి చర్విత చరణంగా ఉపన్యాసాలు వినిపిస్తాయి. జ్ఞానం, సృజన శక్తులు, ప్రతిభను మెరుగుపరచడం, ఉదాత్త భావాల్ని ప్రోది చేయడం అనే మాటలు మరోసారి వింటాం. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆశయాలు, ఆదర్శాలు ఎన్ని వల్లించినా నిజంగా పిల్లలకు ఏమి కావాలో, విద్యా బోధనని అందమైన కార్యకలాపంగా ఎలా మార్చాలో ఎవరికైనా పెట్టిందా? ఇవాళ విద్యావ్యాసంగనికి జ్ఞాన సముపార్జన కాక ధన సంపాదన పరమావధి కావడం ఒక వాస్తవం. తన లోపలి శక్తులుని స్వచ్ఛగా, సృజనాత్మకంగా వ్యక్తీకరించటానికి పిల్లలకి అవకాశం కల్పించే బోధనా కార్యక్రమం ఒక కల. పిల్లల శారీరక, మానసిక వికాసానికి అనువుగా బోధన ఉండాలనేది కాగితాలమీద కనిపించే సదాశయం. అనేకానేక సంక్లిష్టతలతో కూడిన సమాజంలో దీనికి ఆచరణ రూపం కల్పించడం కేవలం ఉపాధ్యాయుని చేతిలో లేదు. ఒకరిద్దరి సంకల్పంతో ఇది నెరవేరదు. మన భాషలో మనం చదవాలి, చేతిలో బెత్తం లేకుండా చదువు చెప్పాలి, పిల్లలు ఆనందంగా బడికి రావాలి అనేవి కేవల నినాదాలుగా మిగిలినంత కాలం బోధనా కార్యక్రమం శిక్షణగా కాక పిల్లలకు శిక్షగానే ఉంటుంది. దీన్ని మార్చలన్న సంకల్పం అన్ని స్థాయిల్లో ఉండాలి. ఈ చిత్త శుద్ధి లేకుండా జరిపే గురుపూజోత్సవాలు మొక్కుబడి కార్యక్రమలుగా మిగులుతాయే తప్ప స్ఫూర్తిదాయకంగా నిలవవు. విద్యారంగం లోని ప్రస్తుత స్థితిగతులు మార్చలన్న సంకల్పం, నిబద్ధతతో కూడిన కృషి ప్రతీ స్థాయిలో ఉంటేనే కలలు సాకారమవుతాయి. మౌలికంగా ఈ దిశగా ఆలోచించడమే ఇవాళ సాహసం కావడం గమనార్హం.

సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....26.07.2020....శనివారం.

కామెంట్‌లు లేవు: