పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1876 - జూలై 4, 1963), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.
పింగళి వెంకయ్య
జననం
1876 ఆగస్టు 2
భట్లపెనుమర్రు, మచిలీపట్నందరి, ఆంధ్రప్రదేశ్
మరణం
1963 జూలై 4 (వయస్సు 86)
భారతదేశం
జాతీయత
భారతీయుడు
ప్రసిద్ధులు
భారత జాతీయపతాకం రూపకర్త
1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు.
గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.
1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి