రేపు జంధ్యాల పూర్ణిమ , శ్రావణ పూర్ణిమ ప్రాశస్త్యం
శ్రావణ పూర్ణిమను *జంధ్యాల పూర్ణిమ* అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము *‘యజ్ఞము’* *‘ఉపవీతము’* అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే *‘యాగము’* *‘ఉపవీతము’* అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే *యాగకర్మ చేత పునీతమైన దారము* అని అర్థము.
యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని , యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాననే జంధ్యమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు.
శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన *‘అమరకోశాన్ని’* రచించిన అమరసింహుడు *‘సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః’* అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం , వేదాన్ని అధ్యయనం చేయడం *‘ఉపాకరణం’*. సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ.
మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాటవాలను , జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందినవారిని *‘ద్విజుల’* అని అంటారు. ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎడమ భుజంపైనుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతమంటారని అమరకోశం చెబుతుంది. ఉపనయనం చేసుకుని జంధ్యాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు , గాయత్రీపూజ చేయుటకు , ఇతర పూజలు చేయుచుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీత ధారణకు అర్హులైనవారందరూ ఈ రోజు పాత జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) ధరించవలెను. *‘సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి సృతమ్’* బ్రహ్మతత్వాన్ని సూచించడానికి , వేద తత్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఉపవీతము అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని , శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని , ఒకటి అమ్మ కడుపునుంచి పుట్టడం జన్మ అయితే , ఈ గాయత్రి దేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరిండం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట.
ఋగ్వేదులైనవారు శ్రావణమాసంలో ఏ రోజు శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి. *యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం. వారు పౌర్ణమినాడు దీన్ని ఆచరిస్తారు. సామవేదులు మాత్రం హస్తా నక్షత్రము* రోజున ఆచరించవలసి వుంటుంది. ఇలా ఆయా వేదాలు వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు. ఆదిదేవుడు , సర్వమంగళా (పార్వతీ)పతి , సర్వమంగళ కారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపవీతాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని *‘నమో హరి కేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః’* అనే మంత్రం మనకు చెబుతోంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని , యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని , ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం. మొదటి తంతువులో ఓంకారం , రెండవ తంతువులో అగ్నిదేవుడు , మూడవ తంతులో నాగదేవత , నాలుగవ తంతువులో సోమదేవత , ఐదవ తంతువులో పితృదేవతలు , ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు , ఏడవ తంతువులవో వాయుదేవుడు , ఎనిమిదవ తంతువులో సూర్యుడు , తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలూ ఉంటారు.
యజ్ఞోపవీతం తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని వశిష్ఠస్మృతి ప్రమాణంగా తెలియజేసింది. నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని , గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను , ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. బాలురకు ఒంటి ముడి వున్న అంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఈ మూడు పోగులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు.
బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు. వేద విద్యార్థులు , అధ్యాపకులు , గృహస్థులు నిత్య కర్మలు ముగించుకుని గాయత్రీ జపాలు చేస్తారు. ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి. *జంధ్యాల పౌర్ణమిగా శ్రావణ పూర్ణిమ* అలా ప్రసిద్ధి చెందింది.
ఈ రోజున మంత్రదష్టలైన సప్తఋషులను పూజించాలి. జంధ్యంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకుని గాయత్రీ జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. *ఉపాకర్మలోని విశేషం* ఇది. ఇంతటి మహిమాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటగా బ్రహ్మ తయారుచేశాడంటారు. అలా బ్రహ్మ తయారుచేసిన జంధ్యాన్ని శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని , లయకారుకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు. ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని , సకల జ్ఞానరాశి అయిన సావిత్రీదేవి అభిమంత్రించింది. దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది.
యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం , సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి. ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటనవ్రేళ్లతోనూ , యజ్ఞోపవీతాన్ని చేసుకుని *‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం’* అనే శ్లోకాన్ని పఠించి , మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చునట్లుగా ధరించాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జిగి) యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి.
అశౌచాలవల్ల , ఆప్తుల జనన మరణ సమయంలో , గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కల్గిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.
ఉపాకర్మ సందేశం
ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ. అన్ని రోజులలో ఎవరి కార్యక్రమాలలో హడావుడిగా వుంటారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒకచోట చేరి సామూహికంగా , పూజాదులు నిర్వహించడంవల్ల సమిష్టితత్వం పెరుగుతుంది. నదీతీరాలలో ఆచరించే స్నానాదులవల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి